సినిమాలంటే ఎంటర్‌టైన్ చేయాలి. చాలామంది ఇలాంటి వాటిని చూడటానికే ఇష్టపడతారు. కొందరు మాత్రం డిఫరెంట్‌గా ఉండేవి లేదంటే డిస్ట్రబ్ చేసే మూవీస్ చూడటానికి ఇష్టపడుతుంటారు. అలాంటి వాళ్లకోసమే ఈ మూవీ. ఎందుకంటే చూసిన తర్వాత ఒళ్లంతా కలిపేయడం గ్యారంటీ. మరి అంతలా డిస్ట్రబ్ చేసిన 'ద ఫ్లాట్‌ఫామ్' మూవీ ఏ ఓటీటీలో ఉంది? ఇంతకీ ఎలా ఉందనేది రివ్యూలో చూసేద్దాం.
(ఇదీ చదవండి: Mirzapur 3: ‘మీర్జాపూర్ 3’ వెబ్‌సిరీస్ రివ్యూ)
కథేంటి?
గోరెంగ్ అనే వ్యక్తి ఓ గుహ లాంటి గదిలో నిద్ర లేస్తాడు. అతడితో పాటు త్రిమగాసి అనే వృద్ధుడు అదే గదిలో ఉంటాడు. అసలు అక్కడ ప్రతిరోజూ ఏం జరుగుతుందనేది త్రిమగాసి.. గోరెంగ్‌కి వివరిస్తాడు. పెద్ద బిల్డింగ్‌లో ఫ్లోర్స్‌లా ఉండే ఆ గుహలో, గదికి ఇద్దరు చొప్పున మనుషులు ఉంటారని, ప్రతిరోజూ ఒక్కసారే ఆహారంతో ఉన్న ఫ్లాట్‌ఫామ్ ప్రతి ఫ్లోర్‌లో రెండు నిమిషాలు ఆగుతుందని, పై ఫ్లోర్స్‌లో ఉండే వాళ్లు మిగిల్చిన ఆహారాన్ని మనం తిని బతకాల్సి ఉంటుందని చెబుతాడు. ఇంతకీ వీళ్లు జైలు లాంటి గుహలో ఎందుకు ఉన్నారు? ఇక్కడ మనుషులు తోటి మనుషుల్ని ఎందుకు చంపి తినాల్సి వచ్చింది? చివరకు గోరెంగ్ బయటపడ్డాడా లేదా అనేదే స్టోరీ.
ఎలా ఉందంటే?
ప్రపంచంలో రోజూ ఎన్నో లక్షల మంది ఆకలితో అలమటించి చనిపోతున్నారు. మరోవైపు అవసరానికి మించి తినడమే కాకుండా, ఆహారాన్ని వృథా చేసే వాళ్లు కూడా మన చుట్టూనే చాలామంది ఉన్నారు. ఇలా మనిషి తన విచక్షణ కోల్పోయి ఆహారాన్ని వేస్ట్ చేస్తే.. తిరిగి అది తన ప్రాణాల మీదకే ఎలా వస్తుంది అనే కాన్సెప్ట్‌తో తీసిన సినిమానే 'ద ఫ్లాట్‌ఫామ్'. ఓటీటీలోనే దీన్ని వన్ ఆఫ్ ద మోస్ట్ డిస్ట్రబింగ్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే చూసిన తర్వాత మీకు ఆ రేంజులో ఒళ్లు కలిపేస్తుంది.
(ఇదీ చదవండి: Pihu Review: ఓటీటీలోనే బెస్ట్ చైల్డ్ మూవీ.. కానీ చూస్తే భయపడతారు!)
ఈ సినిమాలో దాదాపు 333 ఫ్లోర్స్‌లో ఇద్దరు చొప్పున ఉంటారు. ప్రతిరోజూ వీళ్లలో ప్రతి ఒక్కరికీ ఇష్టమైన ఫుడ్‌ని సున్న ఫ్లోర్‌లోనే తయారు చేసి, అందంగా అమర్చి కిందకు దింపుతుంటారు. కానీ పైపై ఫ్లోర్స్‌లో ఉన్నోళ్లు తమకు అవసరమైనది మాత్రమే తినకుండా పక్కనోళ్ల ఫుడ్ కూడా తినేస్తుంటారు. దీంతో దిగువ ఫ్లోర్స్‌లోకి ఆహారంతో ఉన్న ఫ్లాట్‌ఫామ్ వచ్చేసరికి ఆహారం సంగతి అటుంచితే ఎముకల కూడా మిగలవు. దీంతో మనిషిలో జంతు ప్రవృత్తి బయటకు వస్తుంది. కింద ఫ్లోర్స్‌లోని వ్యక్తులు.. బతకడం కోసం తమ గదిలోనే తోటి మనిషిని చంపేసుకుంటారు. వాళ్ల శరీరంలోని మాంసాన్ని కొద్ది కొద్దిగా తింటూ నెలంతా బతికేస్తుంటారు.
ఇలాంటి చోటకు గోరెంగ్ అనే వ్యక్తి స్వచ్ఛందంగానే వస్తాడు. కొన్నిరోజులకు బాగానే ఉంటాడు. కానీ ఆహారం దొరక్కపోయే సరికి రెండుసార్లు తన రూమ్మేట్స్‌ని చంపి తింటాడు. మరి చివరకు ఈ జైలు లాంటి గుహ నుంచి ఎలా బయటపడ్డాడనేది క్లైమాక్స్. మనలో చాలామందికి ఆహారం విలువ తెలీదు. ఎక్కువైందని అన్నం పారేయడం, అవసరం లేకపోతే ఫుడ్ వేస్ట్ చేయడం చేస్తుంటారు. చాలా మందికి ఇది కూడా దొరక్కే ఆకలితో చనిపోతున్నారు. కాబట్టి ఎంత కావాలో అంతే తినండి, అలానే పక్కనోళ్లకు పెట్టండి అనే కథతో తీసిన ఈ సినిమా మైండ్ బ్లోయింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది.
అలానే ఇది అందరూ చూసే సినిమా కాదు. ఎందుకంటే మరీ దారుణమైన సీన్స్ కూడా ఉంటాయి. కాబట్టి డిఫరెంట్ మూవీస్ అందులోనూ డిస్ట్రబింగ్ విజువల్స్ ఉండే సినిమాలు చూడాలనుకునేవాళ్లు మాత్రమే దీన్ని ట్రై చేయొచ్చు. పొరపాటున ఫ్యామిలీతో గానీ భోజనం చేసేటప్పుడు గానీ 'ద ఫ్లాట్‌ఫామ్' చూడొద్దు! నెట్‌ఫ్లిక్స్‌లో ఇంగ్లీష్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆసక్తి ఉంటే ఓ లుక్కేయండి.
(ఇదీ చదవండి: In Time Review: బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!)
Comments
Please login to add a commentAdd a comment