
ధృవ్ సర్జా, రష్మికా మందన్నా జంటగా నందన్ కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కిన కన్నడ చిత్రం ‘పొగరు’. ఈ చిత్రాన్ని ఇదే పేరుతో తెలుగులో సాయి సూర్యా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డి.ప్రతాప్ రాజు అందిస్తున్నారు. తెలుగులో రష్మికకు వున్న డిమాండ్‌ని దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ‘కరాబు మైండు కరాబు.. మెరిసే కరాబు నిలబడి చూస్తావా రుబాబు..’ అంటూ సాగే ఈ చిత్రంలోని పాట ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. యూట్యూబ్‌లో రికార్డు స్థాయి వ్యూస్‌ని రాబట్టి రికార్డులు సృష్టిస్తోంది.
తాజాగా నూతన సంవత్సరం సందర్భంగా ఈ మూవీ డైలాగ్ ట్రైలర్‌ని చిత్ర బృందం శుక్రవారం విడుదల చేసింది. ‘అడ్రస్ కనుక్కుని సర్వీస్ చేయడానికి కొరియర్ బాయ్‌ని అనుకున్నార్రా.. ఫైటర్.. కొడితే ఎవడి అడ్రస్ అయినా గల్లంతవ్వాల్సిందే’, ‘వాడు చేసేదంతా చూస్తూ ఉండటానికి నేను శివుడి ముందు నందిని కాదు.. దుర్గమ్మను మోసుకు తిరిగే సింహాన్ని’, ‘కండల్లో బలం ఉందని రౌడీయిజం చేయను, గుండెల్లో ధైర్యం ఉందని గుండాగిరి చేయను.. గిత్త సైలెంట్‌గా ఉందని కొమ్ములాగితే..గుద్దితే గూగుల్ వెతికినా ట్రీట్మెంట్ దొరకదు’ అంటూ హీరో ధృవ్ సర్జా చెబుతున్న పవర్‌ఫుల్ డైలాగ్‌తో ట్రైలర్ ఆకట్టుకుంటోంది.
ఈ చిత్రంలో హీరో దృవ్ సర్జా ఫైటర్‌గా మాస్ లుక్‌లో కనిపిస్తుండగా హీరోయిన్ రష్మిక మందన్నమాత్రం అతని వల్ల ఇబ్బందులు పడే అమాయకపు అమ్మాయిగా కనిపిస్తోంది. ట్రైలర్ చూస్తుంటే కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. త్వరలో మరో ట్రైలర్ తో రాబోతున్నామని ట్రైలర్ చివరిలో పేర్కొన్నారు. చందన్ శెట్టి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.