తమిళ సినిమా: కుందవై అనగానే ఠక్కున గుర్తొచ్చేది నటి త్రిషనే. పొన్నియిన్ సెల్వన్ చిత్రంలోని ప్రధాన పాత్రల్లో ఒకటి యువరాణి కుందవై. మణిరత్నం అద్భుత సృష్టి పొన్నియిన్ సెల్వన్ చిత్రం. దివంగత ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి నవలకు వెండి తెర రూపం ఇది. నటుడు విక్రమ్, కార్తీ, జయం రవి, విక్రమ్ ప్రభు, ప్రకాష్ రాజ్, శరత్ కుమార్, ప్రభు, నటి ఐశ్వర్యారాయ్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి ఇలా పలువురు ప్రముఖ నటీనటులు నటించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు. దీన్ని మణిరత్నం మెడ్రాస్ టాకీస్, లైక్ ప్రొడక్షనన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ చిత్రం తొలిభాగం గత ఏడాది విడుదలై మంచి విజయాన్ని సాధించింది.
కాగా రెండవ భాగం ఈనెల 28వ తేదీన భారీ అంచనాల మధ్య తమిళం, తెలుగు, హిందీ, కన్నడం, మలయాళం భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో చిత్ర యూనిట్ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తమిళనాడు, తెలంగాణ, ముంబై అంటూ పలు ప్రాంతాలను కాళ్లకు బలపం కట్టుకొని చుట్టేస్తున్నారు. అయితే ఇందులో కుందవై యువరాణి పాత్రకు దర్శకుడు ఏ ముహూర్తంలో త్రిషను ఎంపిక చేశారో గాని, చిత్ర ప్రచారాల్లో ప్రముఖ పాత్రదారులందరూ పాల్గొంటున్నా నటి త్రిషనే సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్‌గా మారడం విశేషం.
నాలుగు పదుల వయసులో త్రిష కుందవై పాత్రలో రాజసాన్ని ప్రదర్శిస్తూ ఆ పాత్రలో ఒదిగిపోయారనే చెప్పాలి. చిత్రంలో ప్రతినాయకి చాయలున్న పాత్రలో నటించిన ఐశ్వర్యరాయ్‌పై.. కుందవై యువరాణిగా తన నటనతో త్రిష పైచేయి సాధించారని చెప్పకతప్పదు. దీంతో ఆమెకు చాలా మంచి పేరు వచ్చింది. దీంతో చిత్రం కూడా ఇప్పుడు ఆమె పేరును ఎక్కువగా వాడుకుంటోందనే చెప్పాలి.
తాజాగా చిత్ర ప్రమోషన్‌లో భాగంగా త్రిష పోషించిన కుందవై పాత్రకు ఇతర పేర్లు ఏమిటి? అనే కాంటెస్ట్‌తో చిత్ర యూనిట్ ఒక వీడియోను విడుదల చేశారు. దీంతో అభిమానులు రకరకాల పేర్లతో సెల్ఫీ వీడియోలను విడుదల చేస్తూ పొన్నియిన్ సెల్వన్ చిత్ర ప్రచారాన్ని పతాక స్థాయికి తీసుకెళాల్లని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment