What Is The Reason Behind Top Heroines Dropping From Movies Consecutively, Here Reason - Sakshi
Sakshi News home page

మిస్ చేసుకుంటున్నారా.. లేక మేనేజ్ చేస్తున్నారా?.. తప్పుకుంటున్న హీరోయిన్స్!

Published Fri, Jul 14 2023 4:00 AM | Last Updated on Fri, Jul 14 2023 6:27 PM

Pooja Hegde, Rashmika Mandanna Replays of Priyanka Chopra, Katrina Kaif - Sakshi

ఒక్క ఛాన్స్‌ వచ్చేవరకే ఎవరైనా ఆ చాన్స్‌ కోసం కష్టపడాలి. ఆ ఒక్క చాన్స్‌ బంపర్‌ చాన్స్‌ అయితే ఆ తర్వాతి చాన్సులు అవే వస్తాయి. ఇందుకు ఓ ఉదాహరణ పూజా హెగ్డే, రష్మికా మందన్నా. స్టార్‌ హీరోయిన్లుగా ఈ ఇద్దరూ తెలుగు, తమిళ, హిందీ చిత్రాలు చేస్తూ దూసుకెళుతున్నారు. చివరికి  ఈ ఇద్దరూ డేట్స్‌ సర్దుబాటు చేయలేక సినిమాలు వదులుకునేంత బిజీ. అటు హిందీకి వెళితే ప్రియాంకా చోప్రా, కత్రినా కైఫ్‌ కూడా ఈ మధ్య ఒక సినిమా వదులుకున్నారు. ‘నో డేట్స్‌.. ఐ వాన్న వాకౌట్‌’ అంటూ ఈ నలుగురూ  వదులుకున్న చిత్రాల గురించి, పూజ–రష్మిక వాకౌట్‌ చేయడం వల్ల ఆ ప్లేస్‌ని రీప్లేస్‌ చేయడానికి దర్శక–నిర్మాతలు పరిశీలిస్తున్న హీరోయిన్‌ గురించి తెలుసుకుందాం.

గుంటూరు కారం మిస్‌
‘ఒక లైలా కోసం’తో (2014) తొలిసారి తెలుగు తెరపై మెరిశారు పూజా హెగ్డే. ఆ తర్వాత వరుస సినిమాలతో ఇక్కడ ఫుల్‌ బిజీ. అటు తమిళ, హిందీ నుంచి అవకాశాలు దక్కించుకున్నారు. ఇలా బిజీగా ఉన్న పూజ ఇటీవల డేట్స్‌ సర్దుబాటు చేయలేక ‘గుంటూరు కారం’ నుంచి తప్పుకున్నారని ఆమె వ్యక్తిగత సిబ్బంది పేర్కొన్న విషయం తెలిసిందే. మహేశ్‌బాబు హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. త్రివిక్రమ్‌తో ‘అరవింద సమేత వీర రాఘవ’, ‘అల.. వైకుంఠపురములో’ వంటి హిట్‌ చిత్రాల్లో నటించారు పూజ. ‘గుంటూరు కారం’ నుంచి వాకౌట్‌ చేయకపోయి ఉంటే ఈ ఇద్దరి కాంబోలో ఇది మూడో సినిమా అయ్యుండేది. అలాగే ‘మహర్షి’ వంటి హిట్‌ తర్వాత మహేశ్‌బాబు–పూజ కాంబోలో రెండో సినిమా అయ్యుండేది. అయితే ‘గుంటూరు కారం’ నుంచి పూజ తప్పుకున్నప్పటికీ సూర్యదేవర నాగవంశితో కలిసి త్రివిక్రమ్‌ భార్య సాయి సౌజన్య నిర్మించనున్న చిత్రంలో ఈ బ్యూటీ నటించే చాన్స్‌ ఉందట. సాయిధరమ్‌ హీరోగా సంపత్‌ నంది దర్శకత్వంలో రూపొందించనున్న చిత్రానికి పూజని హీరోయిన్‌గా తీసుకోవాలని నాగవంశి, సాయి సౌజన్య అనుకున్నారట. పూజని సంప్రదించారని సమాచారం. అయితే ఇంకా ఆమె కథ వినలేదట.


 
నితిన్‌ సినిమా మిస్‌
‘ఛలో’తో తెలుగుకి పరిచయమయ్యారు రష్మికా మందన్నా. ఈ సినిమాలో సింపుల్‌ గాళ్‌గా ఎంట్రీ ఇచ్చి, స్టార్‌గా ఎదిగారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ సినిమాలు చేస్తున్నారీ బ్యూటీ. ప్రస్తుతం ‘పుష్ప 2’, ‘రెయిన్‌ బో’తో పాటు మరో తెలుగు సినిమా, హిందీ చిత్రాలతో రష్మిక ఫుల్‌ బిజీ. అందుకే నితిన్‌ సరసన ఒప్పుకున్న చిత్రానికి కాల్‌షీట్స్‌ అడ్జెస్ట్‌ చేయలేకపోయారట. నిజానికి ‘భీష్మ’ సినిమాతో నితిన్‌–రష్మిక హిట్‌ పెయిర్‌ అనిపించుకున్నారు. ఒకవేళ రష్మిక డేట్స్‌ అడ్జెస్ట్‌ చేయగలిగితే మరోసారి ఈ జంట సిల్వర్‌ స్క్రీన్‌పై కనిపించేది. తెలుగులో రష్మిక ఎంట్రీ ఫిల్మ్‌ ‘ఛలో’ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. తొలి హిట్‌ ఇచ్చిన దర్శకుడితో ‘భీష్మ’ వంటి రెండో హిట్‌ కూడా అందుకున్నారు రష్మిక. సో... వెంకీ కుడుములతో మూడో సినిమాని రష్మిక మిస్‌ అయ్యారు.



రీప్లేస్‌ చేసేది ఎవరు?
బాలీవుడ్‌లో ఈ మధ్య ప్రకటించిన చిత్రాల్లో ‘జీ లే జరా’ అందరి దృష్టినీ ఆకర్షించింది. దానికి కారణం ఇది లేడీ ఓరియంటెడ్‌ ఫిల్మ్‌ కావడం, చిత్రదర్శకుడు ఫర్హాన్‌ అక్తర్‌ కథానాయికలుగా ప్రియాంకా చోప్రా, కత్రినా కైఫ్, ఆలియా భట్‌లను ఎన్నుకోవడం. అయితే హాలీవుడ్‌ ప్రాజెక్ట్స్‌ వల్ల ఈ చిత్రాన్ని 2024లో ఆరంభించాలని ఫర్హాన్‌ని ప్రియాంక కోరారట. ఫర్హాన్‌ ఓకే చెప్పారని టాక్‌. ఈలోపు కత్రినా వేరే ప్రాజెక్ట్స్‌ ఒప్పుకోవడంతో ఈ చిత్రానికి డేట్స్‌ సర్దుబాటు చేయలేనన్నారట. కాగా ‘సిటాడెల్‌ 2’ స్టార్ట్‌ అయ్యే చాన్స్‌ ఉన్నందున టోటల్‌గా ఈ సినిమా నుంచి వాకౌట్‌ చేయాలని ప్రియాంక నిర్ణయించుకున్నారట. కత్రినా కూడా ఇదే నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

ఒకరు వదులుకున్న చాన్స్‌ ఆటోమేటిక్‌గా వేరొకరికి దక్కడం సహజం. అలా ‘గుంటూరు కారం’ నుంచి పూజా హెగ్డే తప్పుకోవడం శ్రీలీలకి, మీనాక్షీ చౌదరికి ప్లస్‌ అయింది. ముందు ఈ చిత్రంలో శ్రీలీలను రెండో హీరోయిన్‌గా అనుకున్నారు. కానీ పూజ తప్పుకోవడంతో ఆమె మెయిన్‌ హీరోయిన్‌ అయ్యారు. శ్రీలీల స్థానంలోకి మీనాక్షీ చౌదరి వచ్చారు. అలాగే నితిన్‌ సినిమా నుంచి రష్మికా మందన్నా తప్పుకోవడంతో ఆ చాన్స్‌ కూడా శ్రీలీలకే వెళ్లనుందని టాలీవుడ్‌ టాక్‌. అటు హిందీ ‘జీ లే జరా’ విషయానికొస్తే.. ప్రియాంకా చోప్రా, కత్రినా కైఫ్‌ తప్పుకోవాలనుకోవడంతో అనుష్కా శర్మ, కియారా అద్వానీ వంటి నాయికల పేర్లను  పరిశీలిస్తున్నారట ఫర్హాన్‌ అక్తర్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement