కొన్ని కాంబినేషన్స్ రిపీట్ అవుతుంటాయి. అయితే ఎక్కువగా హీరో–హీరోయిన్ కాంబినేషన్ రిపీట్ అవుతుంటుంది. కానీ ఇప్పుడు రిపీట్ అవుతున్న కాంబినేషన్ వేరు. ఇరవై,ఇరవై ఐదేళ్ల తర్వాత ఆ కాంబినేషన్స్ కుదిరాయి. ‘రిపీట్టే’ అంటూ మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకునేందు రెడీ అయిన ఆ స్టార్స్ గురించి తెలుసుకుందాం.
మెగాస్టార్ చిరంజీవితో ఇప్పటి మాస్ మహారాజా అప్పటి అప్‌కమింగ్ హీరో రవితేజ కలిసి నటించిన చిత్రం ‘అన్నయ్య’ (2000). ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రంలో చిరంజీవికి ఓ తమ్ముడిగా నటించారు రవితేజ (ఈ చిత్రంలో వెంకట్ మరో తమ్ముడు). అన్నతమ్ముల కెమిస్ట్రీ ‘అన్నయ్య’లో బాగానే పండింది. ఇక ఆ తర్వాత స్వయంకృషితో హీరోగా చాలా బిజీ అయ్యారు రవితేజ. ఇప్పుడు 22 ఏళ్లకు చిరంజీవి, రవితేజ కలిసి ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంలో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాకు బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకుడు. ఈ చిత్రంలో కూడా చిరంజీవి, రవితేజ అన్నతమ్ముళ్లుగానే నటిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇందులో శ్రుతీహాసన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.
రజనీకాంత్
కెరీర్‌లో ‘పడయప్ప’ (తెలుగులో ‘నరసింహా’) సినిమాది ప్రత్యేక స్థానం. కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దివంగత నటి సౌందర్య హీరోయిన్‌గా నటించగా, నీలాంబరిగా రమ్యకృష్ణ పవర్‌ఫుల్ విలన్ రోల్ చేశారు. రజనీ, రమ్యకృషల మధ్య సన్నివేశాలు పోటా పోటీగా ఉంటాయి. 1999లో వచ్చిన ఈ చిత్రం తర్వాత రజనీకాంత్, రమ్యకృష మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోలేదు. తాజాగా మళ్లీ ‘జైలర్’ సినిమా కోసం రజనీ, రమ్యకృష్ణ కలిశారు. నీలాంబరిలానే ఇందులోనూ రమ్యకృష్ణ పవర్‌ఫుల్ నెగటివ్ షేడ్‌లో కనిపించనున్నారని తెలిసింది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది.
దాదాపు 22 సంవత్సరాల తర్వాత హీరో అజిత్, హీరోయిన్ ఐశ్వర్యారాయ్ మళ్లీ కలిసి నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. హీరో అజిత్, దర్శకుడు విఘ్నేష్ శివన్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా మంజు వారియర్ పేరు తెరపైకి వచ్చింది. తాజాగా ఈ చిత్రంలో ఓ హీరోయిన్ పాత్రకు ఐశ్వర్యా రాయ్ పేరు వినిపిస్తోంది. ఒకవేళ ఆమె కన్ఫార్మ్ అయితే అజిత్, ఐశ్వర్యలు దాదాపు రెండు దశాబ్దాల తర్వాత స్క్రీన్ షేర్ చేసుకుంటున్నట్లే లెక్క.
'కండుకొండేన్ కండుకొండేన్’ (2000) చిత్రంలో అజిత్, టబు, ఐశ్వర్యా రాయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. మరోవైపు ‘మాస్టర్’ (2021) చిత్రం తర్వాత హీరో విజయ్, దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‌లో మరో సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ త్రిష నటించనున్నారనే ప్రచారం సాగుతోంది. ఇదే నిజమైతే 14 సంవత్సరాల తర్వాత విజయ్, త్రిష మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకున్నట్లు అవుతుంది. విజయ్, త్రిష వరిసారిగా ‘కురివి’ (2008) అనే చిత్రంలో నటించారు. ఈ సినిమాకు ముందు విజయ్, త్రిష కలిసి ‘గిల్లి’ (2004), ‘తిరుప్చా’ (2005), ‘ఆది’ (2006) చిత్రాల్లో నటించారు. ఇలాగే మరికొందరు తారలు కొంత గ్యాప్ తర్వాత మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోనున్నట్లుగా తెలుస్తోంది.
దాదాపు 20 ఏళ్ల క్రితం విజయ్‌కి విలన్‌గా నటించారు ప్రకాశ్‌రాజ్. ఈ హీరో–విలన్ 2004లో వచ్చిన ‘గిల్లి’ (తెలుగు హిట్ ‘ఒక్కడు’కి తమిళ రీమేక్)లో ఎవరి స్టయిల్‌లో వారు నటనలో రెచ్చిపోయారు. ఇప్పుడు ‘వారిస్’లో నటిస్తున్నారు. తమిళ హీరో విజయ్, దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘వారిస్’ (తెలుగులో ‘వారసుడు’). ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్ విలన్‌గా నటిస్తున్నారు. రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment