Prabhas 'Adipurush' Pre Release Event Highlights - Sakshi
Sakshi News home page

Adipurush: ఏడాది రెండు మూడు సినిమాలు చేస్తా, పెళ్లి తిరుపతిలోనే : ప్రభాస్‌

Published Wed, Jun 7 2023 7:11 AM | Last Updated on Wed, Jun 7 2023 9:25 AM

Prabhas Adipurush Pre Release Event Highlights - Sakshi

‘ఏడు నెలల క్రితం ‘ఆదిపురుష్‌’ ట్రైలర్‌ను నా ఫ్యాన్స్‌ కోసం త్రీడీలో చూపించమని, వారి రెస్పాన్స్‌ చూడమని ఓం రౌత్‌తో చెప్పాను. ఫ్యాన్స్‌ చూపిన ధైర్యం, ప్రోత్సాహమే మమ్మల్ని ముందుకు నడిపించింది. నిజానికి ‘ఆదిపురుష్‌’ను సినిమా అనకూడదు. ఇది రామాయణం. ఈ సినిమా చేయడం మా అదృష్టం’’ అని ప్రభాస్‌ అన్నారు.

ప్రభాస్‌ హీరోగా ఓం రౌత్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఆదిపురుష్‌’. రామాయణం ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో రాముడి పాత్రలో ప్రభాస్, జానకిగా కృతీ సనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతునిగా దేవ దత్తా, లంకేశ్వరుడిగా సైఫ్‌ అలీఖాన్‌ నటించారు. భూషణ్‌కుమార్, క్రిషణ్‌ కుమార్, ఓం రౌత్, ప్రసాద్‌ సుతార్, రాజేష్‌ నాయర్‌ వంశీ, ప్రమోద్‌లు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 16న విడుదల కానుంది.

(చదవండి: ప్రభాస్ ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. భారీస్థాయిలో ఖర్చు?)

ఈ సందర్భంగా మంగళవారం తిరుపతిలో జరిగిన ‘ఆదిపురుష్‌’ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకలో ఇంకా ప్రభాస్‌ మాట్లాడుతూ – ‘‘ఓ సందర్భంలో ‘రామాయణం’ చేస్తున్నావా? అని చిరంజీవిగారు అడిగారు. అవును.. సార్‌ అన్నాను.. ‘అది నిజంగా అదృష్టం. అందరికీ దొరకదు. నీకు దొరికింది’ అన్నారు. ‘ఆదిపురుష్‌’ వేడుకకు వచ్చిన చినజీయర్‌స్వామిగారికి, టీటీడీ చైర్మన్‌ సుబ్బారెడ్డిగారికి, తిరుపతి పోలీసులకు థ్యాంక్స్‌. స్టేజ్‌ మీద తక్కువగా మాట్లాడి, ఎక్కువగా సినిమాలు చేస్తాను. ఏడాది రెండు మూడు సినిమాలు చేస్తాను’’ అన్నారు. పెళ్లి గురించి అభిమానులు అడగ్గా. ‘‘పెళ్లా.. ఎప్పుడైనా..తిరుపతిలోనే చేసుకుంటాలే...’’ అని నవ్వుతూ సమాధానమిచ్చారు ప్రభాస్‌.  

త్రిదండి చినజీయర్‌ స్వామీజీ మాట్లాడుతూ– ‘‘రామాయణంలో ఉండే అరణ్యకాండ, యుద్ధకాండలో ఉన్న ప్రధానమైన కథను చరిత్రగా లోకానికి అందించాలనే ఆశతో ఈ సినిమా చేస్తున్నామని చెప్పారు. ఇంతకంటే ఈ లోకానికి మహోపకారం ఉండదు. రాముడి పాత్రలో సమాజానికి మళ్లీ ఓ కొత్త ఆధ్యాత్మిక చైతన్య తరంగాన్ని అందిస్తున్న ప్రభాస్‌గారికి, సీతగా చేసిన కృతీ సనన్, దర్శకుడు ఓం రౌత్‌ అండ్‌ టీమ్‌కు, ముఖ్యంగా  ‘జై శ్రీరామ్‌’ మంత్రాన్ని పాడిన అజయ్, అతుల్‌కు బ్లెస్సింగ్స్‌. జై శ్రీరామ్‌’’ అన్నారు. 

మరో ముఖ్య అతిథి టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ – ‘‘రామాయణంలో కొన్ని ప్రధాన ఘట్టాలను తీసుకుని ‘ఆదిపురుష్‌’ సినిమా నిర్మించడం జరిగింది. మన భారతదేశ చిత్రపరిశ్రమకు ఇంకా గొప్ప పేరు తీసుకువచ్చే విధంగా ఈ సినిమాని చిత్రీకరించారు. హాలీవుడ్‌లో ‘టైటానిక్‌’, ‘అవతార్‌’ వంటి భారీ గ్రాఫిక్స్‌ సినిమాలు వచ్చాయి. ఆ స్థాయిలో గతంలో ప్రభాస్‌ నటించిన ‘బాహుమలి’ మన తెలుగు పరిశ్రమకే కాకుండా భారత చిత్రపరిశ్రమకే ఎంతో కీర్తి తెచ్చింది. ఆ తర్వాత ‘ఆదిపురుష్‌’ కూడా భారీ గ్రాఫిక్స్‌తో అదే స్థాయిలో రూపొందింది.

మన భారతదేశ చరిత్రకు రామాయణం, మహాభారతం.. ఈ రెండూ గొప్ప ఇతిహాసాలు. అటువంటి రామాయణంలోని కొన్ని ఘట్టాలను తీసుకుని  ఆధునిక టెక్నాలజీతో ఈ ‘ఆదిపురుష్‌’ని చేయడం అనేది గొప్ప కార్యక్రమం. ముఖ్యంగా యువతీ యువకులకు ఆదర్శంగా ఉండేలా, వారికి కళ్లకు కట్టేలా ఇలాంటి గొప్ప సినిమా నిర్మించినందుకు నటీనటులు, సాంకేతిక నిపుణులకు ప్రత్యేక అభినందనలు. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో రామాయణం ఆధారంగా రూపొందిన ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.  

ఓం రౌత్‌ మాట్లాడుతూ– ‘‘తన తండ్రి కోసం భూషణ్‌కుమార్‌ ఇలాంటి భారీ చిత్రాన్ని నిర్మించారు. తనకు మాత్రమే కాదు.. నాక్కూడా ఇది చాలా ముఖ్యమైన సినిమా. ఇక డార్లింగ్‌ (ప్రభాస్‌) లేకపోతే ఈ సినిమా చేయడం నాకు సాధ్యం అయ్యేది కాదు. ‘ఆదిపురుష్‌’ చేశామంటే అది మన డార్లింగ్‌ వల్లే. ‘ఆదిపురుష్‌’ నా సినిమానో, మీ సినిమానో, డార్లింగ్‌ సినిమానో కాదు.. ఇది భారతీయ సినిమా. రామాయణం కథ ఎక్కడ జరుగుతుంటే అక్కడికి హనుమంతులు వస్తారని మా అమ్మగారు చెప్పారు. ప్రపంచంలో ఎక్కడైనా ఎప్పుడైనా ఏ థియేటర్లో అయినా ‘ఆదిపురుష్‌’ షో ప్రదర్శితమవుతుంటే అక్కడ ఓ సీటును ఖాళీగా ఉంచాలని నిర్మాతలను, డిస్ట్రిబ్యూటర్స్‌ను కోరుతున్నాను. ఎందుకంటే హనుమాన్‌ వచ్చి చూస్తారు (భావోద్వేగంతో..). ఆశీర్వదిస్తారు’’ అన్నారు. 

భూషణ్‌కుమార్‌ మాట్లాడుతూ – ‘‘రాముడి సినిమా చేయాలనే మా నాన్న గుల్షన్‌కుమార్‌గారి కల ఓం రౌత్‌గారితో నెరవేరింది. రామాయణాన్ని నిర్మించినందుకు మా నాన్న గర్వపడతారు. ఈ సినిమాని ఓం చూపించిన విధానం అద్భుతం. ఇవాళ ఎమోషనల్‌ అవుతున్నాను. ఎందుకంటే ఇది సినిమా కాదు.. ఒక ఎమోషన్‌. మా నాన్నగారే నాకు రాముడు’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement