సలార్ మూవీతో టాలీవుడ్‌లో క్రేజ్ దక్కించుకున్న మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్. ప్రభాస్ హీరోగా నటించిన సలార్ చిత్రంతో తెలుగులోనూ ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం ఎల్2 ఎంపురాన్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీకి తానే దర్శకత్వం వహిస్తున్నారు. మరో సూపర్ స్టార్ మోహన్ లాల్ సైతం కీలక పాత్ర పోషిస్తున్నారు. 2019లో మోహన్ లాల్ నటించిన లూసిఫర్ సినిమాకి సీక్వెల్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
అయితే తాజాగా మలయాళ చిత్రాలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు పృథ్వీరాజ్ సుకుమారన్. ముఖ్యంగా బాక్సాఫీస్ వద్ద ఎదురవుతున్న ఒత్తిడిపై ఆయన మాట్లాడారు. ప్రస్తుతం మలయాళ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటుందని అన్నారు. అందువల్లే మంచి సినిమాలను ప్రేక్షకులకు అందించేందుకు దోహద పడుతోందని పృథ్వీరాజ్ సుకుమారన్ వెల్లడించారు. మలయాళ చిత్రాలకు బాక్సాఫీస్ వద్ద పోటీ గురించి ప్రశ్నించగా ఆయన ఈ విధంగా స్పందించారు.
పృథ్వీరాజ్ మాట్లాడుతూ..'మాకు కూడా బాక్సాఫీస్ చాలా ముఖ్యం. సినిమాలు ఆర్థికంగా లాభాలు ఉండేలా చూసుకోవడానికి మాపై కూడా చాలా ఒత్తిడి ఉంది. కానీ మలయాళ సినిమా ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే బాగాలేని సినిమాలకు కలెక్షన్స్ రావని వారంతా క్లారిటీగా చెప్పారు. ఇటీవల కాలంలో నటుడు ఎవరో, దర్శకత్వం ఎవరనే అనే దానితో సంబంధం లేకుండానే కొన్ని మంచి సినిమాలు వసూళ్లు రాబట్టాయి. ప్రేక్షకుల ఆదరణ దక్కాలంటే మనం కథ పట్ల నిజాయితీగా ఉండటం చాలా అవసరం. చిత్ర నిర్మాతలు, నటులు మనం చెప్పాల్సిన అవసరం ఉందని భావించే కథను ఎంచుకుంటే.. ప్రేక్షకులు సానుకూలంగా స్పందిస్తారన్న నమ్మకం ఉంది. మంచి సినిమాలను ప్రేక్షకులు ఎప్పటికీ ఆదరిస్తారని మాకు తెలుసు' అని అన్నారు. కాగా.. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహిస్తోన్న ఎల్2: ఎంపురాన్ మార్చి 27న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment