![Pushpa 2 Makers Thanks Meet Plan Now](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/allu-arjun.jpg.webp?itok=I3BrG0X5)
అల్లు అర్జున్ - సుకుమార్‌ల యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం ‘పుష్ప2: ది రూల్’. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 4న విడుదలైన ఈ సినిమా థియేటర్‌లలో ఎన్నో రికార్డులు నెలకొల్పి చరిత్ర సృష్టించింది. అయితే, సినిమా ప్రీమియర్ సమయంలో జరిగిన తొక్కిసలాటతో సక్సెస్ మీట్ వంటి కార్యక్రమాలు జరపలేదు. అయితే, పుష్ప2 థియేటర్ రన్ కూడా పూర్తి అయింది. జనవరి 30న నెట్‌ఫ్లిక్స్ వేదికగా అందుబాటులోకి కూడా వచ్చేసింది. దీంతో సినిమా చిత్ర యూనిట్ కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా విజయంలో కీలకంగా పనిచేసిన పుష్ప2 నటీనటులతో పాటు టెక్నీషయన్లతో ఫైనల్ టచ్‌గా ఒక థ్యాంక్స్ మీట్‌ను ఏర్పాటు చేశారు.
హైదరాబాద్‌లోని ఒక స్టార్ హోటెల్‌లో ఈ రోజు (ఫిబ్రవరి 8) సాయింత్రం పుష్ప2 థ్యాంక్స్ మీట్ జరగనుంది. టైట్ సెక్యూరిటీ మధ్య చాలా లిమిటెడ్‌గా ఆహ్వానాలు పంపారు. సినిమా కోసం పనిచేసిన అందరికీ షీల్డ్‌లు అందించి వారిని సత్కరించనున్నారు. పుష్ప2తో భారీ విజయాన్ని అందుకున్న బన్నీ ఈ కార్యక్రమంలో ఏం మాట్లాడనున్నాడోనని తెలుసుకునేందుకు ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే, సంధ్య థియేటర్ ఘటన గురించి ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవచ్చని తెలుస్తోంది. కేవలం తన తర్వాతి సినిమాల గురించి మాత్రమే ఆయన మాట్లాడతారని సమాచారం ఉంది.
పుష్ప 2 విషయానికి వస్తే ఇది 2021లో వచ్చిన పుష్ప మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కింది. అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించారు. సుకుమార్ దర్శకత్వం వహించగా దేవి శ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఫహద్ ఫాజిల్, రావు రమేశ్, జగపతి బాబు, సునీల్, అనసూయ, జగదీశ్ కీలకపాత్రల్లో నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మించారు.
Comments
Please login to add a commentAdd a comment