పుష్ప భామ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika Mandanna) గాయపడినట్లు తెలుస్తోంది. జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా ఆమెకు గాయాలైనట్లు సన్నిహితులు వెల్లడించారు. రష్మికను గాయాన్ని పరిశీలించిన వైద్యులు కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం శ్రీవల్లి ఆరోగ్యం నిలకడగానే ఉందని సన్నిహిత వర్గాలు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
మరోవైపు సినిమాల విషయానికొస్తే.. పుష్ప-2 (Pushpa 2 The Rule) మూవీతో హిట్ కొట్టి శ్రీవల్లి.. బాలీవుడ్‌లో బిజీగా ఉంది. సల్మాన్ ఖాన్ సరసన సికిందర్ అనే చిత్రంలో కనిపించనుంది. తాజాగా రష్మికకు గాయం కావడంతో ఈ మూవీ షూటింగ్ విరామం ప్రకటించారు. ఫుల్ యాక్షన్ మూవీకి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో బాలీవుడ్‌లోనే థామా అనే చిత్రంలో కనిపించనున్నారు.
తెలుగులో మరో మూడు చిత్రాలు..
టాలీవుడ్‌లో ప్రస్తుతం కుబేర మూవీలో రష్మిక మందన్నా కనిపించనుంది. ఈ చిత్రంలో ధనుష్, నాగార్జున హీరోలుగా నటిస్తున్నారు. ఈ పాన్–ఇండియా మూవీని తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందిస్తున్నారు. శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో వస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు జిమ్ సర్భ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్‌రావు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గతంలో రిలీజ్ కావాల్సిన కుబేర పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. సంక్రాంతి బరిలో ఉంటుందని ఆడియన్స్ అంతా భావించారు. కానీ అలా జరగలేదు. మరి కొత్త ఏడాది ఫిబ్రవరిలోనైనా రిలీజ్ అవుతుందేమోనని ఆశిస్తున్నారు. అయితే కుబేర విడుదల తేదీపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
షూటింగ్ పూర్తి..
ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న కుబేర విడుదల తేదీ ప్రకటించాల్సి ఉంది. వాస్తవానికి గతేడాది దీపావళీ కానుకగా రావాల్సి ఉంది. పలు కారణాల వల్ల జాప్యం జరగడంతో ఇప్పుడు కొత్త ఏడాది ఫిబ్రవరిలో విడుదల కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను మెప్పించాయి. హీరో ధనుష్ కుబేరలో సరికొత్త పాత్రలో కనిపించనున్నాడు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించిన ఈ సినిమా విడుదల కోసం అభిమానులు భారీగానే ఎదురుచూస్తున్నారు. రష్మిక మందన్నా ఈ మూవీతో పాటు ది గర్ల్‌ఫ్రెండ్, రెయిన్ బో చిత్రాల్లో కనిపించనుంది.
Comments
Please login to add a commentAdd a comment