
దక్షిణాది నటుడిగా తన ప్రయాణం ప్రారంభించిన ఆర్ మాధవన్ (R Madhavan ) ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రముఖ నటుడిగా మారారు. కేవలం అభినయానికే ప్రాధాన్యతను ఇస్తూ టాప్ నటులుగా మారిన అతి తక్కువ మందిలో ఆయన ముందు వరుసలో ఉంటారు. గత ధోరణికి భిన్నంగా ఆయన ఇటీవల కాస్త ఎక్కువగానే ఇస్తున్న ఇంటర్వ్యూల్లో అనేక సమకాలీన, సామాజిక అంశాలను ప్రస్తావిస్తున్నారు. తాజాగా చాలా మంది తల్లిదండ్రులకు సమకాలీన పాప్ సంస్కృతి పరిశీలకులకు సుపరిచితం అయిన ఓ అంశాన్ని ప్రస్తావించాడు, ప్రస్తుతం భారతదేశంలో శరవేగంగా విస్తరిస్తున్న కె.పాప్ పట్ల ఆయన తొలిసారిగా స్పందించాడు.
ప్రస్తుత ఓటీటీ యుగం పుణ్యమా అని అనేక దేశాలకు చెందిన సంస్కృతీ సంప్రదాయాలు మన యువతకు చేరువయ్యాయి. అందులో అత్యంత వేగంగా పిల్లల్ని ఆకట్టుకుంటోంది కొరియన్ పాప్ (K Pop) సంగీతం, కొరియన్ సినిమా, సిరీస్‌లు. ఈ కొరియన్ సంస్కృతి పట్ల భారతీయ పిల్లలు పెంపొందించుకున్న గాఢమైన ఆకర్షణపై మాధవన్ ఆశ్చర్యంతో పాటు తన ఆందోళనను సైతం వ్యక్తం చేశారు, ఇటీవల ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఆయన ఊపందుకుంటున్న ధోరణిపై తన ఆలోచనలను ఆందోళననను పంచుకున్నాడు.
‘దక్షిణాదిలో–ఇంకా చెప్పాలంటే భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో–కె–పాప్ సరికొత్త సంస్కృతిగా అవతరిస్తోంది‘ అని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. యువత లో కె–పాప్ సంస్కృతి ఊహలకు అందనంత లోతుగా అల్లుకుపోతోందని వారి కథా కథనాలలో భారతీయ సినిమా తో పోలిస్తే అంత వైవిధ్యం ఏం ఉందో? అదెందుకు వారిని అంతగా ఆకట్టుకుంటుందో తెలియడం లేదని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
అయితే వీటన్నింటి కన్నా తల్లిదండ్రులకు మరింత ఆందోళనను కలిగించే విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అదేమిటంటే... అనేకమంది భారతీయ యువత కొరియన్ భాషను నేర్చుకుంటున్నారు అనేది. నిజానికి అన్యభాషా చిత్రాలను ఆదరించడం, వారి సంగీతాన్ని ఎంజాయ్ చేయడం ఎప్పుడూ ఉండేదే.
అయితే ఏకంగా కొరియన్ భాషను నేర్చుకుని మరీ ఆ సంగీతం, వినోదాన్ని ఆస్వాదించాలనే వారి బలమైన ఆసక్తి పట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అంతేకాదు ఆయన మరో రహస్యాన్ని కూడా బహిర్గత పరిచాడు. కొరియన్ భాషను నేర్చుకుంటున్న పిల్లలు వారి తల్లిదండ్రులకు అర్థం కాని రహస్య సంభాషణల కోసం కోడ్ లాంగ్వేజ్ గా కూడా ఉపయోగిస్తున్నారనే చేదైన వాస్తవాన్ని ఆయన తెలియజేశాడు.
సాంకేతిక విప్లవం కారణంగా ఇప్పటికే టీనేజర్లు రకరకాల మాయాజాలాల్లో ఇరుక్కుపోతున్న పరిస్థితుల్లో కొరియన్ భాషలో వారు సాధించే పట్టు ద్వారా పొందే ప్రయోజనం కేవలం సినిమా, పాప్ సంగీత వినోదానికే పరిమితం కాగా...దాని వల్ల తల్లిదండ్రులకు కలిగే నష్టం అంతకు మించి ఉండబోతోందని ఒక టీనేజర్ తండ్రి కూడా అయిన మాధవన్ చెబుతున్న విషయం ప్రతీ ఒక్క పేరెంట్ గుర్తు పెట్టుకోవాల్సిందే అనడంలో సందేహం లేదు.