సాక్షి, హైదరాబాద్: పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి ఆర్థిక పరిస్థితి బాగా లేదని.. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని.. కనీసం ఇంటి అద్దె కూడా చెల్లించే స్థితిలో లేరని ప్రజా గాయకుడు గద్దర్ వ్యాఖ్యానించారంటూ నిన్నంత సోషల్ మీడియాలో తెగ ప్రచారం అయ్యింది. అయితే ఈ వార్తలు అవాస్తవం అని.. గద్దర్ వ్యాఖ్యలని వక్రీకరించారంటున్నారు ఆర్ నారాయణ మూర్తి. చానెల్స్ రేటింగ్స్ పెంచుకోవడం కోసం.. వ్యూస్ కోసం తనపై అవాస్తవాలు ప్రచారం చేయవద్దని కోరారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడిన వీడియోను రిలీజ్ చేశారు.
దీనిలో ఆర్ నారాయణ మూర్తి మాట్లాడుతూ.. చిన్నతనం నుంచి తనకు సాధారణంగా జీవించడం ఇష్టమని.. చాప, దిండే తనకు హాయిగా ఉంటుందని తెలిపారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు అప్పులు చేయడం.. తీర్చడం సర్వ సాధారణం అన్నారు. తాను చాలా సంతోషంగా ఉన్నానని.. తనకు ఎలాంటి కష్టాలు లేవని.. ఎంతో రిచ్‌గా బతుకుతున్నాని స్పష్టం చేశారు. గ్రామాల్లో ఉండటం తనకు ఎంతో ఇష్టమని తెలిపారు.
నిజంగా తనకు సమస్యలుంటే సాయం చేసే మిత్రులు ఎందరో ఉన్నారని తెలిపారు ఆర్ నారాయణమూర్తి. సోషల్ మీడియాలో తన గురించి ఇలాంటి వార్తలు ప్రచారం చేయడం వల్ల తన అభిమానులు, స్నేహితులు ఎంతో బాధపడుతున్నారన్నారు. వారంతా తనకు కాల్ చేసి.. ఏమైంది.. డబ్బులు కావాలంటే మేం ఇస్తాం. నీ అకౌంట్ నంబర్ పంపమని కోరుతున్నారని.. ఇవన్ని తనను ఎంతో బాధపెడుతున్నాయన్నారు. దయచేసి ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దని.. దండం పెడతానంటూ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment