టైటిల్: జిగర్ తండ(డబుల్ ఎక్స్)
నటీనటులు: రాఘవ లారెన్స్, ఎస్‌జే సూర్య, నిమిషా, నవీన్ చంద్ర తదితరులు
నిర్మాణ సంస్థ: స్టోన్ బెంచ్ ఫిలిమ్స్
నిర్మాతలు: కార్తికేయన్ సంతానం, కతిరేశన్
దర్శకత్వం: కార్తీక్ సుబ్బరాజు
సంగీత దర్శకుడు: సంతోష్ నారాయణన్
సినిమాటోగ్రఫీ: తిరు
ఎడిటింగ్: షఫీక్ మహమ్మద్ అలీ
విడుదల తేది: నవంబర్ 10, 2023
రాఘవ లారెన్స్, ఎస్‌జే సూర్య ప్రధాన పాత్రల్లో తెరెకెక్కించిన చిత్రం జిగర్ తండ డబుల్ ఎక్స్. ఈ చిత్రాన్ని స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై కార్తికేయన్ సంతానం, ఎస్. కథిరేసన్ నిర్మించగా.. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించాడు. ఇది తమిళంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన జిగర్ తండ(ఈ మూవీ తెలుగులో గద్దలకొండ గణేశ్‌గా రీమేక్ అయింది) సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కించారు. నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
సీజర్(రాఘవ లారెన్స్) రాయలసీమలోని కర్నూలులో గ్యాంగ్‌స్టార్. ఆ ప్రాంతంలోని మరో గ్యాంగ్ స్టార్ లారెన్స్‌తో గొడవ పడుతుంటారు. అప్పుడే తన గురువు లాంటి అతన్ని సీజర్ చంపేస్తాడు. కానీ సీజర్‌కు స్థానిక రాజకీయ నాయకుడైన కారుమంచి(ఇళవరసు) సపోర్ట్ ఉంటుంది. మరో రాజకీయ నాయకుడైన టామ్ చాకో(జయకృష్ణ) మనిషిని సీజర్ చంపడంతో అతనిపై పగ పెంచుకుంటాడు. దీంతో ఎలాగైనా సరే సీజర్‌ను చంపేయాలని జయకృష్ణ.. ఫారెస్ట్ ఆఫీసర్ అయిన నవీన్ చంద్రకు చెప్తాడు. అయితే సీజర్‌ను చంపే ప్రయత్నంలో ఎస్సై కావాల్సిన ఎస్‌జే సూర్య(రే దాసన్) మధ్యలో ఎందుకు ఎంటరయ్యాడు? అసలు జయకృష్ణకు సీజర్‌ను చంపాల్సిన అవసరమేంటి? చివరికీ జయకృష్ణ సీజర్‌ను చంపాడా? లేదా? అసలు సీజర్(లారెన్స్)ను, రే దాసన్(ఎస్‌జే) ఎందుకు చంపాలనుకున్నాడు? వీరిద్దరి మధ్య గల వైరానికి కారణమేంటి? అన్న విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
మరోవైపు అడవిలో ఉండే ఆదివాసీలకు, అసలు సీజర్‌కు మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఫారెస్ట్ అధికారుల వేధింపుల నుంచి ఆదివాసీలను సీజర్ ఎందుకు రక్షించాలనుకుంటాడు? చివరికీ వారికి అండగా నిలిచాడా? లేదా? ప్రభుత్వం, అటవీ అధికారులకు దొరకకుండా.. అడవిలో ఏనుగులను అంతమొందిస్తున్న స్మగ్లర్లను సీజర్ ఎందుకు పట్టుకున్నాడు? వాళ్లను పట్టుకున్నాక సీజర్ ఎలాంటి పరిణామాలు ఎదుర్కొవాల్సి వచ్చింది? చివరికీ తాను అనుకున్న లక్ష‍్యం నేరవేరిందా? అనే విషయాలు తెలియాలంటే థియేటర్లకు వెళ్లి చూడాల్సిందే.
ఎలా సాగిందంటే..
రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లోనే కథను పరిచయం చేశాడు డైరెక్టర్. దాదాపు పదేళ్ల తర్వాత సీక్వెల్ ముందుకొచ్చిన కార్తీక్ సుబ్బరాజు సీక్వెల్‌పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. 1970 ప్రాంతంలో రాయలసీమలోని నల్లమల అటవీ ప్రాంతంలో జరిగే ఏనుగుల దంతాల స్మగ్లింగ్ నేపథ్యంలో కథను తీసుకొచ్చారు. ఫస్టాఫ్‌లో రాయలసీమ జిల్లాల్లోని స్మగ్లర్లు, రాజకీయ నాయకులు, అడవిలో నివసించే ఆదివాసీల చుట్టే తిరుగుతుంది. అయితే ఎస్సైగా జాబ్‌లో చేరాల్సిన ఎస్‌జే సూర్య(రే దాసన్), మరో వైపు హీరో కావాలనుకున్నా రాఘవ(సీజర్) మధ్య వచ్చే సీన్స్ ఆకట్టుకుంటాయి. ఫస్టాప్‌లో మరీ ముఖ్యంగా సీరియస్‌గా సాగుతున్న స్టోరీలో సత్యన్, ఎస్‌జే సూర్యతో కామెడీని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు సుబ్బరాజు. ఇంటర్వెల్‌కు ముందు చిన్న ట్విస్ట్ ఇచ్చి సింపుల్‌గా ముగించారు.
సెకండాఫ్ మొదలవగానే కథలో కాస్తా వేగం పెరిగింది. అడవితల్లితో వారికున్న బంధాన్ని చాలా చక్కగా చూపించారు. అటవీ ప్రాంతంలో నివసించే ఆదివాసీల జీవన విధానాన్ని సైతం ప్రేక్షకులకు పరిచయం చేశారు కార్తీక్. ముఖ్యంగా అడవిలో ఏనుగులను అంతమొందిస్తున్నషెటానీ ముఠా.. రాఘవ లారెన్స్ మధ్య జరిగే ఫైట్ సీన్స్ ప్రేక్షకుల్లో ఆసక్తితో పాటు కాస్తా ఉత్కంఠకు గురి చేస్తాయి. ఒకవైపు రాజకీయ నాయకులు, అధికారుల కుట్రలను ప్రేక్షకులకు చూపిస్తూనే.. మరోవైపు ఆదివాసీ బిడ్డల అమాయకత్వాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. అడవి బిడ్డలైన ఆదివాసీలకు, జంతువులకు మధ్య ఉండే ప్రేమానురాగాలను కాస్తా కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. ఏనుగులను చంపే షెటానీ ముఠా, సీజర్(రాఘవ లారెన్స్) మధ్య జరిగే ఫైట్ సీన్స్ సెకండాఫ్‌లో హైలెట్.
ఒకవైపు రాజకీయ నాయకుల కుట్రలు, మరోవైపు అడవిలో స్మగ్లింగ్, వీరి మధ్యన నలిగిపోతున్న ఆదివాసీ బిడ్డలతో కథను ముందుకు తీసుకెళ్లారు. అక్కడక్కడ వచ్చే ప్రేకకుల ఊహకందే ట్విస్టులతో థియేటర్లో కూర్చోబెట్టేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. క్లైమాక్స్ వచ్చేసరికి ఎమోషనల్ టచ్ ఇచ్చి ఆడియన్స్‌ను కంటతడి పెట్టించారు డైరెక్టర్. సినిమా చివరి 20 నిమిషాలు ఫుల్ ఎమోషనల్‌గా సాగింది. సన్నివేశాలు కాస్త సినిమాటిక్‌గా ఉన్నా ఆడియన్స్‌లో మాత్రం ఉత్కంఠ పెంచుతాయి. దాదాపు పదేళ్ల తర్వాత సీక్వెల్ తెరకెక్కించడంలో ప్రేక్షకుల అంచనాలు అందుకోవడంలో మాత్రం డైరెక్టర్ సక్సెస్ కాలేకపోయాడనిపిస్తోంది. జగర్ తండకు సీక్వెల్ అయినా రెండు కథలు పూర్తి భిన్నంగా ఉంటాయి. అయితే రెండింటిలోనూ సెటప్ అంతా దాదాపుగా ఒకే తరహాలో సాగుతుంది. అయితే మరో సీక్వెల్‌గా త్రిబుల్ ఎక్స్ తీసుకురానున్నట్లు చివర్లో హింట్ మాత్రం ఇచ్చేశారు.
ఎవరెలా చేశారంటే...
రాఘవ లారెన్స్ ఎప్పటిలాగే తన నటనతో అదరగొట్టేశారు. తనలోని ఫుల్ మాస్ యాక్షన్‌తో మరోసారి తనదైన నటనతో మెప్పించారు. ఎస్‌జే సూర్య సైతం తన పాత్రకు పూర్తిగా న్యాయం చేశారు. నవీన్ చంద్ర అటవీశాఖ అధికారి పాత్రలో ఒదిగిపోయారు. నిమిశా, ఇళవరసు, టామ్ చాకో, సత్యన్, బావ చెల్లాదురై, అరవింద్ ఆకాష్ తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికత విషయానికొస్తే.. సంతోష్ నారాయణన్ సంగీతం పర్వాలేదు. ఈ చిత్రంలో పాటలు అంతగా ఆకట్టుకోలేకపోయినా సందర్భాన్ని తగినట్లుగానే ఉన్నాయి. బీజీఎం ఫరవాలేదనిపించింది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు కాస్తా పని చెప్పి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు సంస్థ స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
- మధుసూదన్, సాక్షి వెబ్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment