టైటిల్: రాజయోగం
నటీనటులు: సాయి రోనక్, అంకిత సాహా, బిస్మీ నాస్, అజయ్ ఘోష్, ప్రవీణ్, గిరి, భద్రం, షకలక శంకర్, తాగుబోతు రమేశ్ తదితరులు
నిర్మాణ సంస్థలు: శ్రీ నవబాలా క్రియేషన్స్, వైష్ణవి నటరాజ్ ప్రొడక్షన్స్
దర్శకత్వం: రామ్ గణపతి
సంగీతం: అరుణ్ మురళీధరన్
డైలాగ్స్: చింతపల్లి రమణ
సినిమాటోగ్రఫీ: విజయ్ సీ కుమార్
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్
విడుదల తేది: డిసెంబర్ 30, 2022
కథేంటంటే..
రిషి(సాయి రోనక్) ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువకుడు. మెకానిక్‌గా పని చేస్తుంటాడు. ఎప్పటికైనా విలాసవంతమైన జీవితాన్ని అనుభవించాలని కలలు కంటాడు. దాని కోసం సంపన్న కుటుంబానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఓ సారి తను రిపేర్ చేసిన కారును ఓనర్‌కి ఇచ్చేందుకై స్టార్ హోటల్‌కి వెళ్తాడు. అక్కడ శ్రీ(అంకిత సాహా)ను చూసి ప్రేమలో పడతాడు. అయితే ఆమె మాత్రం రిషితో శారీరక సుఖాన్ని పొందుతూనే.. డేనియల్ (సిజ్జు) వద్ద ఉన్న వజ్రాలను కొట్టేయాలని చూస్తున్న రాధా(అజయ్ ఘోష్)గ్యాంగ్‌తో వెళ్లిపోతుంది. దీంతో రిషి.. ఎలాగైన శ్రీ అసలు రంగును బయటపెట్టాలనుకుంటాడు. ఈ క్రమంలో రిషికి ఎదురైన సవాళ్లు ఏంటి? రాధా, డేనియల్ మధ్య ఉన్న వజ్రాల గొడవ ఏంటి? డేనియల్ దగ్గర నుంచి రాధా వజ్రాలను కొట్టేశాడా? అందుకు శ్రీ ఎలా ఉపయోగపడింది? రిషి, శ్రీల మధ్యలోకి వచ్చిన ఐశ్వర్య(బిస్మీనాస్) ఎవరు? వజ్రాల గొడవకు, ఐశ్యర్యకు ఎలాంటి సంబంధం ఉంది? తదితర విషయాలు తెలియాలంటే ‘రాజయోగం’ సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
క్రైమ్ కామెడీ చిత్రాలను టాలీవుడ్‌లో మంచి ఆదరణ ఉంది. అందుకే జోనర్‌లో సినిమాలు ఎక్కువగా వస్తుంటాయి. రాజయోగం కూడా క్రైమ్ కామెడీ సినిమానే. యూత్‌ని ఆకట్టుకునేందుకు రొమాంటిక్ సన్నివేశాలు యాడ్ చేశారు. వజ్రం కోసం జరిగే వేటలో ఇద్దరు ప్రేమికులు ఎలా ఇరుక్కున్నారు? ఆ వజ్రం ఎవరికి దొరికింది? చివరకు రాజయోగం ఎవరికీ వరించింది అనేదే ఈ సినిమా కథ.
యూత్‌ని టార్గెట్‌గా పెట్టుకొని దర్శకుడు రామ్ గణపతి ఈ కథను అల్లుకున్నాడు. అడల్ట్ కామెడీ, మితిమీరిన శృంగారం.. యువతను ఆకట్టుకున్నప్పటికీ.. ఓ వర్గం ప్రేక్షకులను మాత్రం ఇబ్బంది కలిగిస్తాయి. ఫస్టాఫ్‌లో ఈతరం యువతి, యువకుల ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది చూపించారు. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు.. అజయ్ ఘోష్, చిత్రం శ్రీనుల కామెడీతో ఫస్టాఫ్ సరదాగా సాగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. అయితే సెకండాఫ్‌లో మాత్రం ఫస్టాఫ్‌లో ఉన్నంత జోష్ ఉండదు. సాగదీత సీన్స్ ఎక్కువగా ఉంటాయి. హోటల్ సీన్‌తో పాటు ఒకటి రెండు సన్నివేశాలు నవ్వించినప్పటికీ.. కథనం మాత్రం రొటీన్‌గా సాగుతుంది.
ఎవరెలా చేశారంటే..
రిషి పాత్రలో సాయి రోనక్ ఒదిగిపోయాడు. రొమాన్స్, కామెడీ, యాక్షన్ ..అన్ని రకాల ఎమోషన్స్‌ని చక్కగా పండించాడు. ముఖ్యంగా హీరోయిన్ అంకితతో కలిసి పండించిన రొమాంటిక్ సన్నివేశాలు సినిమాకు హైలెట్. అంకిత కూడా ఓ మంచి వైవిధ్యమైన పాత్రలో నటించి ఆకట్టుకుంది. శ్రీ పాత్రలో ఆమె చేసిన రొమాన్స్ యూత్‌ని ఆకట్టుకుంటుంది. కేవలం అందాల ఆరబోతకే కాకుండా.. ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా చక్కగా నటించింది.
విలన్ పాత్రలో డేనియల్ గా సిజ్జు బాగా నటించారు. అలాగే మరో విలన్ పాత్రలో నటించిన అజయ్ ఘోష్ కూడా తన స్టైల్ లో బాగా నటించారు. అజయ్ ఘోష్, చిత్రం శ్రీను, తాగుబోతు రమేశ్, షకలక శంకర్‌ల మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతిక విషయానికొస్తే.. అరుణ్ మురళీధరన్ నేపథ్య సంగీతం బాగుంది. సిధ్ శ్రీరామ్ ఆలపించిన రొమాంటిక్ సాంగ్ ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ముఖ్యంగా సెకండాఫ్‌ని మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment