రాజేంద్రప్రసాద్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పేదేముంది. అప్పట్లో హీరోగా చేశారు. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన సహాయ పాత్రలు చేస్తూ నటికిరిటీ అనిపించుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన.. తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న అనుభవాల్ని బయటపెట్టారు. తండ్రి మాటల వల్ల ఓ దశలో చనిపోదామనుకున్న సందర్భంగా గురించి చెప్పారు.
'మా నాన్న స్కూల్ టీచర్. చాలా కఠినంగా ఉండేవారు. ఇంజినీరింగ్ చేసిన తర్వాత నేను సినిమాల్లోకి వెళ్తానని ఆయనతో చెప్పా. నీ ఇష్టానికి వెళ్తున్నావ్, అక్కడ సక్సెస్ రావొచ్చు, ఫెయిల్యూర్ రావొచ్చు. అది నీకు సంబంధించిన విషయం. ఒకవేళ ఫెయిలైతే మాత్రం ఇంటికి రావొద్దని అన్నారు. ఆయన మాటలు నాపై చాలా ప్రభావం చూపించాయి. దీంతో మద్రాసు ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరా, గోల్డ్ మెడల్ కూడా సాధించా. కానీ సినిమాల్లో అవకాశాలు మాత్రం రాలేదు. దీంతో ఇంటికెళ్లా.. ఎందుకొచ్చావ్? రావొద్దనన్నానుగా అని నాన్న కోప్పడ్డారు'
(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 28 సినిమాలు)
'నాన్న తిట్టేసరికి చాలా బాధ అనిపించింది. దీంతో చచ్చిపోదానుకున్నా. చివరిసారిగా నా ఆత్మీయులందరిని చూడాలనిపించింది. వాళ్లని కలిసి మాట్లాడాను. చివరగా నిర్మాత పుండరీకాక్షయ్య గారి ఇంటికి వెళ్లాను. అక్కడ 'మేలుకొలుపు' సినిమా విషయంలో ఏదో గొడవ జరుగుతుంది. అంతలో ఆయన రూమ్ నుంచి బయటకొచ్చి నన్ను చూసి.. సరాసరి డబ్బింగ్ రూంకి తీసుకెళ్లిపోయారు. ఓ సీన్‌కి నాతో డబ్బింగ్ చెప్పించారు. అది నచ్చడంతో.. సమయానికి భలే దొరికావ్ అని అన్నారు'
'మరో సీన్‌కి డబ్బింగ్ చెప్పమని అడగ్గానే.. తిని మూడు నెలలైంది. భోజనం పెడితే డబ్బింగ్ చెబుతానన్నా. ఛాన్సులు రాకపోయేసరికి ఆత్మహత్య చేసుకుందామనుకున్నా విషయాన్ని ఆయనకు చెప్పా. దీంతో చాలా కోప్పడ్డారు. ఇంటికి తీసుకెళ్లి మంచి భోజనం పెట్టించారు. అలా మొదలైన నా డబ్బింగ్ ప్రయాణం.. తర్వాత చాలా సినిమాలకు డబ్బింగ్ చెప్పాను. మద్రాసులో ఇల్లు కట్టాను. అక్కడే దర్శకుడు వంశీ పరిచయమయ్యాడు. అతడి సినిమాతోనే హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాను' అని రాజేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు.
(ఇదీ చదవండి: 3 వారాల్లోనే ఓటీటీలోకి 'మట్కా'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)
Comments
Please login to add a commentAdd a comment