
సూపర్ స్టార్ రజనీకాంత్ చరిష్మా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏడు పదుల వయసు దాటిన ఆయన క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. తలైవా తెరపై కనిపిస్తే చాలు.. కలెక్షన్ల వర్షం కురవాల్సిందే. సినిమా టాక్‌తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ దద్దరిల్లిపోతుంది.ఆ స్థాయిలో వెండితెరను శాసిస్తాడు కాబట్టే పారితోషికం కూడా అదే స్థాయిలో తీసుకుంటాడు.
ప్రస్తుతం రజనీకాంత్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ అనే సినిమా చేస్తున్నాడు. దీంతో పాటు లాల్ సలామ్ అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు. అయితే ఈ చిత్రంలో రజనీకాంత్ హీరోగా కాకుండా.. గెస్ట్ రోల్ ప్లే చేస్తున్నాడు. విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యా రజనీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు.
లాల్ సలామ్ కోసం రజనీకాంత్ వారం రోజుల కాల్షీట్‌ను కేటాయించారట. అయితే ఈ ఏడు రోజులకు గాను ఆయన భారీగానే పారితోషికం పుచ్చుకుంటున్నారట. వారం రోజులకుగాను రూ.25 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చేందుకు లైకా సంస్థ సూపర్‌స్టార్‌తో డీల్ కుదుర్చుకుందట. త్వరలోనే లాల్ సలామ్ సెట్‌లోకి రజనీకాంత్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
మరోవైపు ‘జైలర్’ మూవీ కోసం కూడా రజనీకాంత్ భారీగానే డిమాండ్ చేశారట. ఈ సినిమా కోసం రజనీకాంత్ ఏకంగా రూ.140 కోట్లు తీసుకుంటున్నాడట. దక్షిణాదికి చెందిన హీరోలలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న స్టార్స్‌లో రజనీకాంత్ మొదటి స్థానంలో ఉన్నారని ఇండస్ట్రీ టాక్.
Comments
Please login to add a commentAdd a comment