కరోనా బారినపడి గత పదిరోజులుగా చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ సినీ నేపథ్య గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం మెరుగ్గా ఉన్నట్లు చికిత్స అందిస్తున్న ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ఓ వీడియో సందేశాన్ని ట్విట్ చేశారు. 'ప్రియమైన బాలు సర్, మీరు త్వరగా కోలుకోవాలి' అని ఆయన ఆకాంక్షించారు. ఈ వీడియోలో రజనీకాంత్.. ‘ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఐదు దశాబ్దాలకు పైగా తన మధురమైన గానంతో కోట్లాది మంది ప్రేక్షకులను అలరించారు. కొద్ది రోజుల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్‌గా తేలింది. అయితే ప్రస్తుతం బాలుగారి ఆరోగ్యం నిలకడగానే ఉందని.. అనారోగ్యం నుంచి కోలుకుంటున్నారని తెలిసి ఎంతో సంతోషిస్తున్నాను. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది. పూర్తి ఆరోగ్యంగా మారి సాధారణ స్థితికి రావడానికి మరి కొంత సమయం పడుతుంది. ఆయన ఆరోగ్యంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను’ అంటూ వీడియో సందేశాన్ని ట్విట్ చేశారు రజనీకాంత్. (కోలుకుంటున్న ఎస్పీ బాలు)
బాలు ఆరోగ్యంపై ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ స్పందించారు. ‘నాన్నగారు ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. వదంతులను నమ్మొద్దు. ఒకట్రెండు రోజుల్లో నాన్నగారు కోలుకుంటారని వైద్యులు చెప్పారు’ అని చరణ్ పేర్కొన్నారు. బాలసుబ్రహ్మణ్యం ఈనెల 5న కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. గత పది రోజులుగా చెన్నై చూలైమేడులోని ఎంజీఎం ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులంతా కోరుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా get well soon అంటూ ప్రార్థిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా బాలు ఆరోగ్య పరిస్థితిపై స్పందిస్తూ కన్నీటి పర్యంతం అయిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment