‘‘జీవితం ఒక ఆట లాంటిది. ఎవరి ఆట వారిదే. ఒకరి ఆటను ఇంకొకరు ఆడలేం. కష్టమైన ఆటలు ఉంటాయి. ఆనందాన్నిచ్చేవీ ఉంటాయి’’ అంటున్నారు రకుల్ ప్రీత్‌సింగ్. జీవితాన్ని గోల్ఫ్ ఆటతో పోల్చారామె. ఈ విషయం గురించి రకుల్ మాట్లాడుతూ – ‘‘ఏ ఆటలో అయినా ప్రత్యర్థి ఉంటారు. కానీ గోల్ఫ్‌కు ఉండరు. మనం బంతిని ఎంత వేగంగా కొడుతున్నామనే దాని మీదే మన విజయం ఆధారపడి ఉంటుంది. సొంతంగా ఆడాలి. మన జీవితం మన సొంత ఆట లాంటిది. గోల్ఫ్ ఆటలో బంతిని కొట్టేటప్పుడు తలదించుకోవాలి. తల ఎత్తితే షాట్ మిస్సవుతుంది. జీవితంలో మనం ఎదిగే కొద్దీ ఒదిగి ఉండడం మంచిదని ఆ విధంగా గోల్ప్ ఆట నాకు చెప్పింది. అలాగే ఒకసారి షాట్ మిస్సయిందంటే మళ్లీ మళ్లీ ప్రయత్నించాలని, విజయం ఖాయం అనే నమ్మకం కలుగుతుంది. జీవితం మీద నమ్మకాన్ని కోల్పోకూడదని గోల్ఫ్ చెబుతుంది. ఎందుకంటే అద్భుతాలు ఎప్పుడైనా జరిగే అవకాశం ఉంటుంది’’ అన్నారు.
నిజానికి ఐదో క్లాస్‌లో ఉన్నప్పుడు రకుల్ తండ్రి ఆమెను గోల్ఫ్ నేర్పించడానికి తీసుకెళితే, నచ్చేది కాదట. ‘‘మా నాన్నగారు ఆర్మీకి చెందిన వ్యక్తి. సహజంగానే స్పోర్ట్స్‌తో అనుబంధం ఉంటుంది. అందుకే ఫుట్‌బాల్, బ్యాడ్‌మింటన్ వంటివన్నీ కోచ్‌లను పెట్టి నేర్పించారు. అలాగే గోల్ఫ్ కూడా. నాకేమో అది ప్రాచీన ఆటలా అనిపించేది. ఇష్టం ఉండేది కాదు. కానీ నేర్చుకోవడం మొదలుపెట్టాక ఇష్టం పెరిగింది. ప్రతి ఒక్కరూ ఏదొక ఆట నేర్చుకోవాలి. అది మనం సంయమనంతో ఉండడానికి ఉపయోగపడుతుంది’’ అన్నారు రకుల్ ప్రీత్‌సింగ్. చదవండి: (బ్రదర్.. ఆ క్షణాలు ఎప్పుడూ సంతోషకరమైనవే: ఎన్టీఆర్)
Comments
Please login to add a commentAdd a comment