నందమూరి తారక రామారావు.. తెలుగు సినిమాకు దిక్సూచి. తన నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన ఆయన వారి గుండెల్లో తన స్థానాన్ని పదిలపరుచుకున్నారు. గత కొద్దిరోజులుగా ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు విచ్చేశారు.
ఈ సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ.. 'ఎక్కడ మొదలు పెట్టాలో తెలియటం లేదు. ఏ స్థాయి గురించి మాట్లాడినా ఆ స్థాయిలన్నింటినీ మించిన పెద్ద పేరు, పెద్ద వ్యక్తి నందమూరి తారక రామారావుగారు. ఇలాంటి గొప్ప వ్యక్తులు వేసిన దారుల్లో నడుస్తూ వారిని గుర్తు చేసుకుంటే వచ్చే ఆనందం అంతా ఇంతా కాదు. సినిమా సెట్‌లో నాతో సహా ప్రతి ఆర్టిస్ట్ ఎన్టీఆర్ పేరును గుర్తు తెచ్చుకోకుండా ఉండరు. తెలుగు సినీ ఇండస్ట్రీ ఖ్యాతిని చాటిచెప్పిన ఏకైక వ్యక్తి ఎన్టీరామారావు. అలాంటి వ్యక్తి పని చేసిన చిత్రపరిశ్రమలో మనందరం పని చేస్తున్నామంటే అంతకంటే గర్వకారణం ఇంకేముంటుంది.
నేను ఎన్టీఆర్‌ను ఒకే ఒకసారి మాత్రమే కలిశాను. నేను, పురందేశ్వరిగారి అబ్బాయి రితేష్ కలిసి స్కేటింగ్ క్లాసులకు వెళ్లే వాళ్లం. పొద్దున్నే ఐదున్నర, ఆరు గంటలకంతా క్లాసులు అయిపోయేవి. ఓ రోజు మా తాతయ్య గారి ఇంటికి వెళదామా? అని రితేష్ అన్నాడు. అప్పుడాయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనకు పెద్ద సెక్యూరిటీ ఉంటుంది. అక్కడకు వెళ్లగలమా? లేదా? అని చెప్పే అవగాహన నాకు లేదు. నేను సరేనని చెప్పాను. ఇద్దరం స్కేటింగ్ చేసుకుంటూ పురందేశ్వరి ఇంటి నుంచి రామారావు గారి ఇంటికి వెళ్లాం. అప్పుడు ఉదయం ఆరున్నర గంటలు అవుతుంది.
ఎన్టీఆర్‌గారిని కలిసి వెళ్లిపోదామనుకున్నా. అయితే ఆయన అప్పటికే నిద్రలేచి రెడీ అయిపోయి టిఫిన్‌కి కూర్చున్నారు. అందరికీ తెలిసినట్లే ఆ వయసులోనూ ఉదయాన్నే చికెన్ తింటున్నారు. నేను వెళ్లగానే నన్ను కూడా కూర్చోపెట్టి నాకు కూడా టిఫిన్ పెట్టారు. అది నాకు కలిగిన అదృష్టం. ఆయనతో కలిసి టిఫిన్ తిన్న క్షణాలను జీవితాంతం నేను మర్చిపోలేను. తెలుగు ఇండస్ట్రీ బ్రతికున్నంత వరకు ఆయన పేరు బతికే ఉంటుంది. జై ఎన్టీఆర్’ అంటూ స్పీచ్ ముగించాడు చెర్రీ.
చదవండి: వెన్నెల కిశోర్ ఇంట్లో కుప్పలుగా రూ.2000 నోట్ల కట్టలు
Comments
Please login to add a commentAdd a comment