‘‘ఆచార్య’ సినిమాలో నాన్నగారి(చిరంజీవి) ఆచార్య, నేను చేసిన సిద్ధ పాత్రలు చాలా బలంగా ఉంటాయి. నా పాత్ర సెకండాఫ్‌లో వస్తుంది. నాన్నతో కలిసి ఈ సినిమాలో 45నిమిషాల నిడివి ఉన్న పాత్ర చేసేందుకు నాకు 13ఏళ్లు పట్టింది. అలాంటిది ఆయనతో పూర్తి స్థాయి నిడివి ఉన్న పాత్ర అంటే ఇంకా చాలా సమయం పడుతుంది’’ అని హీరో రామ్‌చరణ్ అన్నారు. చిరంజీవి, కాజల్ అగర్వాల్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆచార్య’. రామ్‌చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రల్లో నటించారు. సురేఖ కొణిదెల సమర్పణలో నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో రామ్‌చరణ్ పంచుకున్న విశేషాలు...
► ‘ఆచార్య’ లో మీ పాత్ర ఉంటుందని మీకు ముందే తెలుసా?
తెలియదు.. ఎందుకంటే ‘ఆచార్య’ సినిమాకి నేను ఓ నిర్మాతగా ఎంటర్ అయ్యానే కానీ నటుడిగా కాదు. ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన చిన్న పాత్ర ఉంటుందని ఆ తర్వాతే తెలిసింది. పైగా ఈ పాత్ర కథకి ఎంతో ముఖ్యం అని కొరటాల శివగారు చెప్పారు. అలాగే ‘ఆచార్య’ నాన్నగారి సినిమా కావడంతో ఓకే చెప్పాను.
► కొరటాల శివ ‘ఆచార్య’ కథ చెప్పినప్పుడు ఎలా అనిపించింది?
‘మిర్చి’ సినిమా తర్వాత నుంచి నేను–కొరటాలగారు ఓ సినిమా చేద్దామనుకున్నాం. కానీ, ఎవరి ప్రాజెక్టుల్లో వారు బిజీగా ఉండటం వల్ల కుదరలేదు. అయినప్పటికీ మా కాంబినేషన్ కుదరలేదనే బాధ నాకెప్పుడూ లేదు. ఎందుకంటే మా ఇద్దరి మధ్య బలమైన స్నేహ బంధం ఉంది. అందుకే తొందరపడకుండా వీలు కుదిరినప్పుడు మంచి ప్రాజెక్ట్ చేయాలనుకున్నాం.
► ‘ఆచార్య’కి మీరు పచ్చజెండా ఊపాక మీ కోసం కథలో ఏవైనా మార్పులు చేశారా?
ఎలాంటి మార్పులు లేవు. అయితే తొలుత నాది, పూజా హెగ్డేది 15 నిమిషాలే అనుకున్నాం. కానీ నా పాత్ర 45 నిమిషాలు ఎలా అయిందో నాకే తెలియడం లేదు. ఆచార్య, సిద్ధ పాత్రలకి చాలా తేడా ఉంటుంది. ఈ పాత్రలు వేరే ఏ హీరోలు చేసినా కూడా హిట్ అవుతాయి. కాకపోతే నాన్నగారు, నేను చేయడం వల్ల మరింత క్రేజ్ వచ్చింది. ఈ మూవీలో చాలా సన్నివేశాలు సహజంగా ఉంటాయే కానీ ఎక్కడా కావాలని యాడ్ చేసినట్లు ఉండవు.
► సిద్ధ పాత్ర ఎలా ఉంటుంది?
‘ఆచార్య’ లో నాన్నది, నాది తండ్రీ కొడుకుల పాత్ర కాదు. నేను ‘ధర్మస్థలి’ లోని గురుకులంలోని యువకునిగా కనిపిస్తాను. నాన్నగారు ఒక ఫైటర్‌లా కనిపిస్తారు. మా ఇద్దరి పాత్రలు పూర్తి వ్యతిరేకంగా ఉంటాయి. అయితే ధర్మం కోసం ఇద్దరూ ఎలా కలుస్తారు? అధర్మంపై ఎలా పోరాటం చేశారు? అనేది కొరటాలగారు చాలా బాగా చూపించారు.
► ‘ఆర్‌ఆర్‌ఆర్’ చేస్తున్నప్పుడు ‘ఆచార్య’ కోసం రాజమౌళిని ఎలా ఒప్పించారు?
రాజమౌళిగారు ‘బొమ్మరిల్లు’ ఫాదర్‌లాంటివారు. ఆయన సినిమా అంగీకరించామంటే అది పూర్తయ్యే వరకూ ఆర్టిస్ట్‌ల చేయి వదలరు. కానీ సిద్ధ పాత్ర గురించి కొరటాలగారు రాజమౌళిగారికి చెప్పారు. ఆ పాత్రకు ఉన్న ప్రాధాన్యతను రాజమౌళిగారు గుర్తించి, నేను చేస్తేనే బాగుంటుందన్నారు. పైగా మా నాన్నమీద గౌరవంతో, అమ్మ(సురేఖ) డ్రీమ్ ప్రాజెక్ట్ అని ‘ఆచార్య’ చేసేందుకు నాకు అవకాశం ఇచ్చారు రాజమౌళిగారు. ఇందుకు ఆయనకు రుణపడి ఉంటాను.
► ‘ఆర్‌ఆర్‌ఆర్’ చేస్తున్నప్పుడే ‘ఆచార్య’ కి మేకోవర్ కావడం కష్టంగా అనిపించిందా?
ఇష్టమైన పని చేస్తున్నప్పుడు కష్టం అనిపించదు. అటు ‘ఆర్‌ఆర్‌ఆర్’ లో రామరాజు పాత్ర కానీ, ఇటు ‘ఆచార్య’ లో సిద్ధ పాత్రకి కానీ మేకోవర్ కావడం కష్టంగా అనిపించలేదు. ఎందుకంటే నాకు బాగా నచ్చిన పాత్రలు ఇవి.. అందుకే చాలా ఇష్టంగా చేశాను. ‘ధృవ’, ‘రంగస్థలం’, ‘ఆర్‌ఆర్‌ఆర్’ నా మనసుకి బాగా దగ్గరైన చిత్రాలు. ఆ కోవలో నిర్మించిన ‘ఆచార్య’ మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది.
► ‘ఆచార్య’ కి పనిచేస్తున్నప్పుడు చిరంజీవి నుంచి ఏం నేర్చుకున్నారు?
ఈ 35 ఏళ్లల్లో నేను చూసిన నాన్నగారు వేరు.. ‘ఆచార్య’ కోసం మారేడుమిల్లి అడవుల్లో 20 రోజులు షూటింగ్ చేసినప్పుడు చూసిన నాన్నవేరు. అయితే మారేడుమిల్లి అడవుల్లో ‘ఆచార్య’ షూటింగ్ కోసం ఇద్దరం ఒక కాటేజ్‌లో ఉన్నాం. కలిసి వ్యాయామం, భోజనం చేశాం, ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. నా జీవితంలో మర్చిపోలేని రోజులవి. ఆ 20 రోజుల షూటింగ్‌లో నాన్న నుంచి ఎంతో నేర్చుకున్నా.
► ‘ఆచార్య’ కి మీరు నిర్మాతనా? హీరోనా?
కొణిదెల ప్రొడక్షన్స్‌లోనే ‘ఆచార్య’ నిర్మించాలనుకున్నాం. అయితే ‘ఆర్‌ఆర్‌ఆర్’ తో నేను బిజీగా ఉండటం వల్ల ప్రొడక్షన్‌పై పూర్తిగా దృష్టి సారించలేననిపించింది. అప్పుడు నిరంజన్ రెడ్డిగారు ఈ సినిమా చేసేందుకు ముందుకు వచ్చారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ కూడా మా సొంత బ్యానర్‌లాంటిదే. అందుకే ఇప్పటికి కూడా నాన్న, నేను ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోలేదు. ప్రస్తుతానికి నా దృష్టి నటనపైనే. ‘సైరా, ఆచార్య’ లాంటి బలమైన కథలు వచ్చినప్పుడు కొణిదెల ప్రొడక్షన్స్‌లో నిర్మిస్తాను.
► ‘ఆర్‌ఆర్‌ఆర్’ పాన్ ఇండియా స్థాయిలో పెద్ద సక్సెస్ అయింది. మరి ‘ఆచార్య’ ని పాన్ ఇండియన్ మూవీగా రిలీజ్‌కి ఎందుకు ప్లాన్ చెయ్యలేదు?
‘ఆచార్య’ ని దక్షిణాదిలో చేయాలనుకునే కొరటాలగారు చేశారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’, ‘ఆచార్య’ విడుదలకి మధ్య ఎక్కువ గ్యాప్ లేదు. పాన్ ఇండియా రిలీజ్ అంటే చాలా ప్లా¯Œ ్స ఉంటాయి. సమయం తక్కువ ఉంది. అందుకే తెలుగులో రిలీజ్ చేసిన తర్వాత పాన్ ఇండియా స్థాయిలో చేయాలనుకుంటున్నాం.
► స్ట్రైట్ బాలీవుడ్ సినిమా ఎప్పుడు చేస్తున్నారు?
నేనేదీ ప్లాన్ చేసుకోను. ఏ డైరెక్టర్ అయినా నాకు కరెక్ట్ కథ తీసుకొస్తే ఏ భాషలో అయినా చేస్తాను. నేను కావాలనుకుని డిజైన్ చేసిన సినిమాలకంటే డైరెక్టర్స్ ఆలోచించి చేసిన సిని మాలే నాకు సూపర్ హిట్స్ ఇచ్చాయి. ‘ఆరెంజ్’ సరిగ్గా ఆడలేదు కానీ, ఇప్పటికీ నా ఫేవరేట్ సినిమాల్లో అది ఒకటి.
► సౌత్ సినిమాలు పాన్ ఇండియన్ హిట్స్ కావడం ఎలా అనిపిస్తోంది?
ఇటీవల వచ్చిన ‘పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్, కేజీఎఫ్ 2’ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో హిట్స్ కావడం చాలా గర్వంగా ఉంది. ఇది వరకు ఇండియన్ సినిమా అంటే కేవలం హిందీ సినిమా అనే వారు. కానీ, ఇప్పుడు మన సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకోవడం చాలా సంతోషంగా ఉంది.
► మీ తర్వాతి చిత్రాలేంటి?
శంకర్‌గారి దర్శకత్వంలో నటిస్తున్న సినిమా 60రోజులు షూటింగ్ పూర్తయింది. ఆ సినిమా తర్వాత ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేస్తాను.
నానమ్మ ఎప్పుడూ నాన్నవైపే..
‘ఆచార్య’ సెట్స్‌లో నానమ్మ(అంజనాదేవి), అమ్మ(సురేఖ)ల మధ్య సరదా పోటీ ఉండేది. నా కొడుకు బాగా చేశాడంటే, కాదు.. నా కొడుకు అనేకునేవారు. నానమ్మ ఎప్పుడూ నాన్నవైపే ఉండేవారు.
Comments
Please login to add a commentAdd a comment