మనుషులు చాలా తెలివైన జీవులు అనుకుంటాం.. కానీ మనుషుల కన్నా ఏనుగులకే ఎక్కువ తెలివి తేటలున్నాయంటున్నాడు హీరో రానా దగ్గుబాటి. అంతేకాదు, అవి ఎమోషనల్ అని, సో సెంటిమెంటల్ అండ్ కేరింగ్ అని చెప్తున్నాడు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన "అరణ్య" సినిమా ట్రైలర్ బుధవారం రిలీజైంది. దీనికి విక్టరీ వెంకటేశ్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఈ ట్రైలర్‌లో 'ఇది రిజర్వ్‌డ్ ఫారెస్ట్. మనుషులెవరూ లోనికి రాకూడదు' అని చెప్తున్నారు. కానీ రానా సహా మరికొందరు ఆ అడవిలోనే ఏనుగులతో సావాసం చేస్తూ, గజరాజులతో దోస్తీ చేస్తున్నారు. కానీ అటవీశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఓ వ్యక్తి ఆ అడవి చుట్టూ గోడ కట్టించడంతో వివాదం రాజుకుంటుంది. ఆ గోడ వల్ల ఏనుగులు నీటి కోసం వెళ్లే దారి మూసుకుపోతుంది.
ఈ నేపథ్యంలో ఏనుగులకు గుక్కెడు మంచినీళ్లు కూడా దొరక్కుండా పోవడంతో రానా ఆ గోడను ధ్వంసం చేసి వాటిని కాపాడేందుకు పోరాడతాడు. అయితే అలుపెరగకుండా పోరాటం చేస్తున్న రానాను ఇంటర్వ్యూ ఇవ్వమని అడుగుతుందో అమ్మాయి. దీంతో విసుగెత్తిపోయిన రానా "ఏనుగుల ఇంట్లో మనుషుల అరాచకం.. ఈ హెడ్‌లైన్ పెట్టే దమ్ముందా?" అని అడుగుతాడు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ ట్రైలర్‌లో రానా తన నటనతో మెస్మరైజ్ చేశాడు. 25 ఏళ్లుగా అడవిలో జీవించే ఓ వ్యక్తి కథతో వస్తున్న ఈ చిత్రంలో విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రియా పిల్గావోంకర్ కీలక పాత్రలు పోషించారు. ఈరోస్ ఇంటర్నేషనల్ ఫిలింస్ నిర్మించిన ఈ చిత్రానికి ప్రభు సాల్మన్ దర్శకుడు. ట్రైలర్‌లో చూపించినట్లుగానే ఈ సినిమా అటవీ నిర్మూలన సంక్షోభం గురించి కొత్త చర్చను లేవనెత్తేలా కనిపిస్తోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మార్చి 26న ఈ చిత్రం విడుదల కానుంది.
రానా మరోవైపు వేణు ఊడుగుల దర్శకత్వంలో "విరాట పర్వం" సినిమా చేస్తున్నాడు. డి.సురేష్‌బాబు సమర్పణలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రియమణి, నందితా దాస్, నివేదా పేతురాజ్, నవీన్ చంద్ర తదితరులు నటించిన ఈ సినిమా ఏప్రిల్ 30న విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: డానీ సాంచెజ్ లోపెజ్, దివాకర్ మణి, సంగీతం: సురేష్ బొబ్బిలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూ సర్: విజయ్‌కుమార్ చాగంటి.
Comments
Please login to add a commentAdd a comment