తమిళసినిమా: తక్కువ సమయంలోనే నటిగా విశేష గుర్తింపును సొంతం చేసుకున్న నటి రష్మిక. ఈ శాండిల్ వుడ్ బ్యూటీ తన మాతృభాషలో పెద్దగా చిత్రాలు చేయలేదు. టాలీవుడ్‌లో తొలి చిత్రమైన ఛలో మార్కులు తెచ్చుకోవడం, గీత గోవిందం ఊహించని విజయాన్ని సాధించడం చకాచకా జరిగిపోయాయి. దీంతో అమ్మడు బాలీవుడ్ వరకు వెళ్లింది. అక్కడ తొలి చిత్రం గుడ్ బై ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది కూడా. అయితే ఆ చిత్రం మంచి వసూళ్లు రాబట్టలేకపోయింది. కానీ రష్మికకు నటిగా మంచి వర్కులే పడ్డాయి. ఇంకా అక్కడ రెండు చిత్రాల్లో నటిస్తోంది.
ఇక తెలుగులో తనను బాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లిన పుష్ప చిత్రం సీక్వెల్‌లో నటించడానికి రెడీ అవుతోంది. ఇదేవిధంగా ద్విభాషా చిత్రం వారీసు చిత్రంలో విజయ్‌తో రొమాన్స్ చేస్తోంది. ఈ చిత్రం రష్మికకు కీలకం. ఎందుకంటే కోలీవుడ్‌లో ఇంతకు ముందు కార్తీ సరసన సుల్తాన్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చినా అది ఆమె కెరీర్‌కి పెద్దగా ప్లస్‌గా కలసిరాలేదు. అయితే అవకాశాలు మాత్రం తగ్గేదేలే అంటున్నాయి.
ఇప్పటికే మరోసారి కార్తీతో జత కట్టడానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం. తాజాగా మరో స్టార్ హీరో ధనుష్‌కు జంటగా నటించే అవకాశం కూడా ఈ బ్యూటీ తలుపు తట్టినట్లు సమాచారం. ధనుష్ హీరోగా టాలీవుడ్ ప్రామినెంట్ దర్శకుడు శేఖర్ కమ్ముల ద్విభాషా చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో నటి రష్మికను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే ఇది ఎంతవరకు నిజమవుతుందో చూడాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment