కొందరు ఎంత తిన్నా కరెంట్ వైర్‌లా సన్నగా ఉంటారు. మరికొందరు ఏమీ తినకపోయినా బెలూన్‌లా ఉబ్బిపోయి బొద్దుగా కనిపిస్తారు. అధిక బరువును దారిలో పెట్టడం కొందరికి మాత్రమే సాధ్యమవుతుంది. ఎంత డైట్ చేసినా, కఠోర వ్యాయామాలు చేసినా కొందరికి బరువు తగ్గడం అనేది అందని ద్రాక్షలాగే అనిపిస్తుంది. తమిళ నిర్మాత రవీందర్ చంద్రశేఖర్ ఈ కోవలోకే వస్తాడు.
ఈయన ఎప్పటినుంచో అధిక బరువుతో బాధపడుతున్నాడు. అయితే ఎప్పుడైతే బుల్లితెర నటి మహాలక్ష్మిని పెళ్లి చేసుకున్నాడో అప్పటి నుంచే తరచూ విమర్శలను ఎదుర్కొంటున్నాడు. కట్టుకున్న భార్య సన్నజాజిలా ఉంది, కానీ తనేమో భారీకాయుడు.. ఇంకేముంది, జనాలు ఆడిపోసుకున్నారు. డబ్బుల కోసమే ఆమె ఇతడిని పెళ్లి చేసుకుంది అంటూ రకరకాల విమర్శలు గుప్పించారు. వీళ్ల వైవాహిక బంధం ఎంతోకాలం నిలవదని శాపనార్థాలు కూడా పెట్టారు. ఆ రూమర్లు వచ్చినప్పుడల్లా భార్యాభర్తలిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలు వదిలి తమది అన్యోన్య దాంపత్యమని చాటిచెప్తూనే వస్తున్నారు.
తాజాగా రవీందర్ ఓ ఇంటర్వ్యూలో తన అధిక బరువుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'నేను నా బరువుపై దృష్టి పెట్టను. అందుకు బదులుగా ఆరోగ్యం, శ్రేయస్సుపైనే ఫోకస్ చేస్తాను. ఈరోజు ఇది తినకూడదు వంటి నియమనిబంధనలు పెట్టుకోను. ఎందుకంటే నేను డైట్ పాటించి చూశాను, కానీ అది వర్కవుట్ కాలేదు. అయినా నేను నా బరువును మోయడం అంత ఈజీయేం కాదు. నేను దాదాపు 200 కిలోల బరువుంటాను' అని చెప్పుకొచ్చాడు.
కాగా రవీందర్ గతంలో ఓ చికిత్స తీసుకున్నప్పుడు శరీరంలో కొవ్వు కరిగించే కణాలు క్షీణించిపోయాయి. ఇది అతడు బరువు పెరగడానికి కారణమైంది. అందుకే తాను శరీరానికి కాకుండా ఆరోగ్యానికి ప్రాముఖ్యతనిస్తున్నానని, ఊబకాయం తగ్గించడం తన చేతిలో లేదన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment