‘‘నటనకు కావాలని విరామం ఇవ్వలేదు. నాకు నటించాలనే ఉంది. అయితే ఓ సినిమా ఒప్పుకునే ముందు కథ, అందులోని నా పాత్ర, ఆ చిత్ర దర్శక–నిర్మాతలు... ఈ మూడు అంశాలను పరిగణనలోకి తీసుకుంటాను. ఇలా ఈ మూడు అంశాలతో నేను ఏకీభవించి నటించిన చిత్రం ‘టైగర్ నాగేశ్వర రావు’’ అన్నారు నటి, దర్శక–నిర్మాత రేణూ దేశాయ్.
రవితేజ టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం ‘టైగర్ నాగేశ్వర రావు’. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో మయాంక్ సింఘానియా సహనిర్మాతగా అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో రేణూ దేశాయ్ చెప్పిన విశేషాలు.
► ‘టైగర్ నాగేశ్వర రావు’లో హేమలత లవణంగారి పాత్ర చేశాను. లవణంగారి మేనకోడలు కీర్తిగారిని కలిసి ఆవిడ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను. 1970 కాలంలోనే జోగిని వ్యవస్థ, అంటరానితనంపై పోరాటాలు చేశారామె. దొంగలు, బందిపోట్లలో మంచి మార్పు కోసం కృషి చేశారు. ఇలాంటి సామాజిక కార్యక్రమాలతో స్ఫూర్తిగా నిలిచిన హేమలతగారి పాత్ర చేయడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను.
ఆమె బాడీ లాంగ్వేజ్‌ను వెండితెరపై ప్రతిబింబించడం సవాల్‌గా అనిపించింది. నా కెరీర్‌లో ఇప్పటివరకూ నాకు ఏ పశ్చాత్తాపం లేదు. అయితే హేమలత లవణంగారి గురించి తెలుసుకుని, ఆమె పాత్రలో నటించిన తర్వాత ఆమెను కలవలేకపోయానని పశ్చాత్తాపపడుతున్నాను. హేమలతగారి స్ఫూర్తితో చిన్నారుల ఆకలి తీరేలా నా వంతుగా ఓ స్వచ్ఛంద సేవా సంస్థను మొదలు పెట్టాలనుకుంటున్నాను.
‘టైగర్ నాగేశ్వర రావు’ సినిమా ట్రైలర్ చూసి, నా వయసుకి తగ్గ పాత్రలో నటించినందుకు మా అమ్మాయి ఆద్య తనకు గర్వంగా ఉన్నట్లు చెప్పింది. నాకు బెస్ట్ కాంప్లిమెంట్ అది. నా గురించి నా పిల్లలు ఏమనుకుంటున్నారన్నదే నాకు ముఖ్యం. భవిష్యత్‌లో నా వయసుకు తగ్గ పాత్రలే చేయాలనుకుంటున్నాను. ∙మా నాన్నమ్మ 47 ఏళ్లకే హార్ట్ ఎటాక్‌తో చనిపోయారు. మా నాన్నా హార్ట్ ఎటాక్‌తోనే చనిపోయారు. ఇలా జన్యుపరంగా నాకు గుండె సంబంధిత సమస్యలున్నాయి. అయితే ప్రమాదం లేదు. అలాగని అజాగ్రత్త వహించకూడదు. చికిత్స తీసుకుంటున్నాను.
Comments
Please login to add a commentAdd a comment