తేజ్‌కు సక్సెస్‌ వస్తే నాకు వచ్చినట్లే! | Republic Gaana of Republic Song Launch | Sakshi
Sakshi News home page

తేజ్‌కు సక్సెస్‌ వస్తే నాకు వచ్చినట్లే!

Published Sun, Jul 11 2021 12:09 AM | Last Updated on Sun, Jul 11 2021 12:09 AM

Republic Gaana of Republic Song Launch - Sakshi

భగవాన్, కొరటాల శివ, సాయితేజ్, మణిశర్మ, దేవ కట్టా, పుల్లారావు

‘‘సాయితేజ్‌ని చూస్తే నాకేదో చిన్న ఎమోషనల్‌ కనెక్ట్‌. తేజ్‌కు సక్సెస్‌ వస్తే నాకు వచ్చినట్లే  ఆనందపడతాను’’ అన్నారు దర్శకుడు కొరటాల శివ. సాయితేజ్‌ హీరోగా దేవ కట్టా దర్శకత్వంలో జె. భగవాన్, పుల్లారావు నిర్మించిన చిత్రం ‘రిపబ్లిక్‌’. ఈ సినిమాలోని ‘ఎయ్‌ రారో.. ఎయ్‌ రారో.. ఎయ్‌రో.. నా ప్రాణంలోని ప్రాణం.. నా దేహంలోని దాహం..’ లిరికల్‌ వీడియోను శనివారం హైదరాబాద్‌లో కొరటాల శివ విడుదల చేసి, మాట్లాడుతూ – ‘‘ఈ పాటలో స్వేచ్ఛ గురించి బాగా చెప్పారు.

కంటెంట్‌ను దేవ కట్టా చాలా ఇంటెన్స్‌గా చెబుతారని ‘ప్రస్థానం’ చూసినప్పుడే అనుకున్నాను. ‘రిపబ్లిక్‌’లో కూడా అందరూ ఆలోచించే విషయాన్ని గట్టిగా, ఇంటెన్స్‌తో చెప్పి ఉంటారని ఆశిస్తున్నాను. మణిశర్మగారిని మెలోడీ బ్రహ్మ అని ఎందుకు అన్నారో తెలిసింది. భగవాన్, పుల్లారావు ప్రొఫెషనల్‌ ప్రొడ్యూసర్స్‌. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి’’ అన్నారు. సాయితేజ్‌ మాట్లాడుతూ – ‘‘పెద్ద స్క్రీన్‌లో సాంగ్‌ చూసి చాలా రోజులయింది. నా పాట అనే కాదు... ఏ సినిమా పాటనైనా పెద్ద స్క్రీన్‌లో చూస్తే ఉండే కిక్కే వేరు. ఒక ఆర్టిస్ట్‌ నటనను వెండితెరపై చూస్తే ఆ సంతోషమే వేరు.

‘రిపబ్లిక్‌’ను థియేటర్స్‌లోనే విడుదల చేస్తాం. నా చిన్నప్పుడే మణిశర్మగారి పాటలు విన్నాను. అప్పట్నుంచే నా మైండ్‌లో ఆయనతో ఓ సినిమా చేయాలని అనుకుంటున్నానేమో. అది ఇప్పుడు కుదిరింది. మంచి స్క్రిప్ట్, మంచి రోల్‌ ఇచ్చిన దేవాగారికి, రాజీ పడకుండా తీసిన భగవాన్, పుల్లారావు, జీ స్టూడియోస్‌కు థ్యాంక్స్‌’’ అన్నారు. ‘‘మణిశర్మగారితో మరిన్ని సినిమాలు చేయాలని ఉంది. మంచి లిరిక్స్‌ ఇచ్చిన రెహమాన్‌కు థ్యాంక్స్‌’’ అన్నారు దేవ కట్టా.

మణిశర్మ మాట్లాడుతూ – ‘‘తేజ్‌తో సినిమా చేసినందుకు హ్యాపీగా ఉంది. భగవాన్‌తో ఎప్పట్నుంచో మంచి పరిచయం ఉంది. దేవాతో ఎప్పట్నుంచో సినిమా చేయాలనుకుంటున్నాను. ‘రిపబ్లిక్‌’తో కుదిరినందుకు సంతోషం’’ అన్నారు. ‘‘ఈ సినిమాలోని తొలి పాట కొరటాల శివగారి చేతుల మీదగా లాంచ్‌ కావడమే మా సినిమా సక్సెస్‌కు నిదర్శనం’’ అన్నారు భగవాన్‌. కో ప్రొడ్యూసర్‌ జయ ప్రకాష్, ‘జీ’ సంస్థ ప్రతినిధి ప్రసాద్, క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ సతీష్, రచయిత–దర్శకుడు రవి పాల్గొన్నారు అలాగే నేడు (జూలై 11) మణిశర్మ పుట్టినరోజుని పురస్కరించుకుని ఈ కార్యక్రమంలో చిత్రబృందం సెలబ్రేట్‌ చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement