
తీవ్రమైన కసరత్తులు చేసే సిద్దార్థ్.. సెప్టెంబరు 1 రాత్రి భోజనం చేసిన తర్వాత ఛాతీలో నొప్పి వచ్చినట్లు చెప్పి, విశ్రాంతి కావాలంటూ నిద్రపోయాడు.
Sidharth Shukla Autopsy: హిందీ బిగ్‌బాస్ సీజన్ 13 విజేత, చిన్నారి పెళ్లికూతురు ఫేం సిద్దార్థ్ శుక్లా పోస్ట్‌మార్టం పూర్తైంది. అకాల మరణం చెందిన సిద్దార్థ్ శరీరంపై ఎటువంటి గాయాలు లేవని వైద్యులు వెల్లడించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే, కెమికల్ అనాలిసిస్ కోసం అంతర్గత అవయవాల నుంచి సేకరించిన నమూనాలు (వెస్కేరా శాంపిల్స్) పంపించారని, ఆ తర్వాతే మరణానికి గల అసలు కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉన్నట్లు వెల్లడించాయి. కాగా సిద్దార్థ్ గుండెపోటుతో మరణించాడని తొలుత వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. తీవ్రమైన కసరత్తులు చేసే అతడు.. సెప్టెంబరు 1 రాత్రి భోజనం చేసిన తర్వాత ఛాతీలో నొప్పి వచ్చినట్లు చెప్పి, విశ్రాంతి కావాలంటూ నిద్రపోయాడు.
ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించిన సిద్దార్థ్ స్నేహితులు.. తెల్లారేసరికి కూడా అతడు నిద్రలేవకపోవడంతో గురువారం ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో కూపర్ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారని పేర్కొన్నారు. ఈ క్రమంలో అతడిది సహజ మరణమేనని అంతా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం పోస్ట్‌మార్టం నిర్వహించగా శరీరంపై ఎటువంటి గాయాలు లేవని తేలడం గమనార్హం.
చదవండి: Rip Sidharth Shukla: మరణానికి ముందు తల్లితోనే...
ఇక సిద్దార్థ్‌కు తల్లి రీతూ శుక్లా, ఇద్దరు సోదరీమణులు ఉన్న విషయం తెలిసిందే. అతడి మృతి నేపథ్యంలో కుటుంబ సభ్యులు అభిమానులను ఉద్దేశించి ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘మేమంతా తీవ్ర విషాదంలో ఉన్నాం. దిగ్భ్రాంతికి లోనయ్యాం. సిద్దార్థ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించండి. దయచేసి మాకు కాస్త తేరుకునే సమయం, ప్రైవసీ ఇవ్వండి’’ అని విజ్ఞప్తి చేశారు. కాగా సిద్దార్థ్ అంత్యక్రియలు నేటి మధ్యాహ్నం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు సినీ, టీవీ సెలబ్రిటీలు అతడి నివాసానికి చేరుకుంటున్నారు.
చదవండి: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, సిద్ధార్థ్ శుక్లా.. ఫొటో వైరల్