![Rip Sidharth Shukla: Actor Spent Last Evening With Mother In Park Report - Sakshi](/styles/webp/s3/article_images/2021/09/3/siddharth-shukla3.jpg.webp?itok=F1Y89PMl)
RIP Sidharth Shukla: బాలికా వధు ఫేం, హిందీ బిగ్‌బాస్-13 విజేత సిద్దార్థ్ శుక్లా హఠాన్మరణంతో బాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది. ఎంతో భవిష్యత్తు ఉన్న సిద్దార్థ్ అకాల మృతిని స్నేహితులు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ వార్త అబద్దమైతే బాగుండునంటూ సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు. కాగా సిద్దార్థ్‌కు తన తల్లి రీతూ శుక్లా అంటే పంచప్రాణాలు. బిగ్‌బాస్ హౌజ్‌లో ఉన్న సమయంలోనూ ఆమె గురించే ఎక్కువగా చెప్పేవాడు. భర్త మరణించినా ఎంతో ధైర్యంగా ఇద్దరు అక్కలు, తనని పెంచి పెద్ద చేసిందని, తన బెస్ట్‌ఫ్రెండ్ అమ్మేనంటూ ప్రేమను కురిపించేవాడు.
కాగా ఎప్పుడూ షూటింగ్‌లతో బిజీగా ఉండే సిద్దార్థ్ శుక్లా మరణానికి ముందు రోజు మాత్రం తన తల్లి రీతూతోనే సమయం గడిపినట్లు తెలుస్తోంది. సిద్దార్థ్ నివసించే అపార్టుమెంటు సెక్యూరిటీ గార్డు ఇండియా.కామ్‌తో మాట్లాడుతూ.. ‘‘ఆయన(సిద్దార్థ్) ఎనిమిదో అంతస్తులో, తల్లి తొమ్మిదో అంతస్తులో నివసిస్తారు. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఇలా వేరువేరుగా ఉండాలని సిద్దార్థ్ నిర్ణయించుకున్నారు. తల్లికి ఎటువంటి అనారోగ్యం కలగకూడదని జాగ్రత్త పడ్డారు.
చదవండి: Shehnaaz Gill: షెహనాజ్ పరిస్థితి ఏమీ బాగోలేదు
అయితే, మొన్న సాయంత్రం తల్లి రీతూతో కలిసి ఆయన పార్కుకు వెళ్లారు. కాసేపు అక్కడే సరదాగా గడిపి ఇంటికి వచ్చారు’’ అని పేర్కొన్నాడు. ఇక సిద్దార్థ్ స్నేహితుడు, ఆర్జే అనురాగ్ పాండే.. ‘‘తను ఆరోజు పార్కులో పిల్లలతో క్రికెట్, ఫుట్‌బాల్ ఆడాడు. ఎంతో సరదాగా గడిపాడు. కానీ, మరుసటి రోజే ఇంతటి విషాదం సంభవిస్తుందని ఊహించలేదు’’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా తీవ్రమైన ఛాతీనొప్పితో బాధపడుతున్న సిద్దార్థ్ శుక్లాను సెప్టెంబరు 2న ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆయన తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు వెల్లడించిన విషయం విదితమే.
చదవండి: సినిమా షూటింగ్‌లో దారుణం: గుర్రాన్ని చంపేసి... గుట్టుగా పూడ్చేసి
Comments
Please login to add a commentAdd a comment