ఎలాంటి అంచనాలు లేకుండా పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటిన చిత్రం కాంతార. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. కేవలం రూ. 16కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా రూ. 400కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు రిషబ్‌శెట్టి. అదే సినిమాకుగాను ‘దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’లో ఆయన మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్‌గా అవార్డు అందుకున్నారు. తనకు అవార్డు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ రిషబ్ సోషల్ మీడియాలో ఓ లేఖ పోస్ట్ చేశారు. ముంబయిలో సోమవారం ఈ అవార‍్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది.
లేఖలో రిషబ్ శెట్టి రాస్తూ.. 'ప్రతిష్ఠాత్మక దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు ఎలా చెప్పాలో తెలియడంలేదు. ‘కాంతార’ అవకాశం ఇచ్చిన హోంబలే ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ, నిర్మాత విజయ్ కిరగందూర్ సర్‌కు ధన్యవాదాలు. హోంబలే సంస్థతో కలిసి మరిన్ని చిత్రాలకు కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నా. కాంతార భాగమైన చిత్రబృందం, నా జీవిత భాగస్వామి ప్రగతిశెట్టి లేనిదే ఈ అవార్డు లేదు. వారి సహకారంతోనే ఇది సాధ్యమైంది. ఈ అవార్డును కర్ణాటక ప్రజలు, దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్, భగవాన్ (దివంగత దర్శకుడు)సర్‌కు అంకితమిస్తున్నా. నన్ను అభిమానించిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.' అని రిషబ్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీక్వెల్‌ను తెరకెక్కించే పనిలో ఉన్నారు రిషబ్. తదుపరి చిత్రంలో హీరో తండ్రి పాత్రను ప్రధానంగా చూపిస్తారని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment