టైటిల్ : ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’
నటీనటులు : ఆర్. మాధవన్, సిమ్రన్ , సూర్య, గుల్షన్ గ్రోవర్, రజిత్ కపూర్, రవి రాఘవేంద్ర తదితరులు
నిర్మాణ సంస్థలు : కలర్ ఫిల్మ్స్, వర్ఘీస్ మూలన్ పిక్చరర్స్
నిర్మాతలు: సరితా మాధవన్, మాధవన్, వర్ఘీస్ మూలన్, విజయ్ మూలన్
రచన,దర్శకత్వం : ఆర్ మాధవన్
సంగీతం : శ్యామ్. సీఎస్
సినిమాటోగ్రఫీ : సిర్షా రే
ఎడిటర్ : బిజిత్ బాలా
విడుదల తేది : జులై 1, 2022
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో బయోపిక్‌ల సీజన్ నడుస్తోంది. సినీ, రాజకీయ,క్రీడా ప్రముఖుల జీవిత కథల నేపథ్యంలో పలు భాషల్లో సినిమాలు రూపొందుతున్నాయి. ఈ లిస్ట్‌లో ఓ సైంటిస్ట్ కూడా చేరాడు. ఆర్ మాధవన్ స్వయంగా దర్శకత్వం వహిస్తూ నటించిన సినిమా ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’. ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్‌కు మంచి స్పందన లభించింది. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(జులై 1)థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రం ఎలా ఉంది? నంబి నారాయణన్‌గా మాధవన్ ఏ మేరకు మెప్పించారో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
ఈ సినిమ కథంతా ఇంటర్వ్యూగా సాగుతుంది. ఓ టీవీ చానల్‌లో హీరో సూర్య నంబి నారాయణన్(మాధవన్)ని ఇంటర్వ్యూ చేస్తూ.. తన జీవితం ఎలా సాగింది? ఇస్రోలో ఎలా చేరారు? తనపై వచ్చిన ఆరోపణలు ఎలా ఎదుర్కొన్నాడు తదితర విషయాలను అడుగుతారు. 1966లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)లో చేరుతాడు నంబి నారాయణన్. అంచెలంచెలుగా ఎదుగుతూ.. అమెరికాలోని ప్రిన్స్‌టన్ యూనివర్సీటీలో రాకెట్ ప్రొపల్షన్ సిస్టమ్స్ చదివేందుకు స్కాలర్‌షిప్ పొందారు. అక్కడ సానా ఆఫర్ వచ్చిన సున్నితంగా తిరస్కరించి తిరిగి ఇండియాకు వచ్చిన మళ్లీ ఇస్రోలో చేరుతారు.. స్వదేశీ రాకెట్లను అభివృద్ది చేసే ప్రాజెక్ట్‌లో భాగంగా రష్యా డెవలప్ చేసిన క్రయోజెనిక్ ఇంజన్స్‌ని భారత్ తీసుకురావాలనుకుంటారు. ఇదే సమయంలో పాకిస్తాన్‌కు భారత రాకెట్ సాంకేతిక విషయాలను చేరవేశారనే నెపంతో అరెస్ట్ అవుతారు. ఆ తర్వాత నంబి నారాయణన్ జీవితం ఎలా మలుపు తిరిగింది? అరెస్ట్ తర్వాత కేరళ పోలీసుల చేతిలో నంబి ఎలాంటి చిత్రహింసలు అనుభవించారు? తనపై వచ్చిన తప్పుడు ఆరోపణలను నుంచి ఎలా విముక్తి పొందారు? అనేదే మిగతా కథ.
ఎలా ఉందంటే..
భారత అంతరిక్ష పరిశోధన రంగం అభివృద్ధిలో విశేష కృషి చేసిన వ్యక్తుల్లో నంబి నారాయణన్ ఒకరు. దేశం కోసం అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఆఫర్‌ని తిరస్కరించి ఇస్రోలో చేరారు. అలాంటి వ్యక్తి ఒకానొక సమయంలో ఆయన దేశ ద్రోహం కేసును ఎదుర్కొన్నారు.తర్వాత ఆయనపై వేసిన దేశ ద్రోహం కేసును సుప్రీం కొట్టి వేసింది.నంబి నారాయణన్ మీద ఆరోపణలూ చెదిరిపోయిన తర్వాత భారత ప్రభుత్వం ఆయన్ని పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. ఇలా ఎన్నో ఎత్తు పల్లాలను చవిచూసిన ఆయన జీవితాన్ని మాధవన్ వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించాడు.ఫస్టాఫ్ అంతా స్వదేశీ రాకెట్లను అభివృద్ది కోసం నంబి నారాయణన్ చేసిన కృషిని చూపించారు.
సెకండాఫ్‌లో తప్పుడు కేసు వల్ల ఆయనతో కుటుంబ సభ్యులు ఎలాంటి అవమానాలకు గురయ్యారు? చివరకు నిర్థోషిగా ఎలా బయటకు వచ్చారనే విషయాలను చాలా భావోద్వేంగా చూపించారు.అయితే ఫస్టాఫ్ అంతా అంతరిక్ష పరిశోధన, ప్యూయల్ టెక్నాలజీ, వికాస్ ఇంజన్ అభివృద్ది తదితర అంశాలను లోతుగా చూపించడంతో డ్యాక్యూమెంటరీ ఫీల్ కలుగుతుంది. రాకెట్ సైన్స్ సామాన్య ప్రేక్షకులకు అంతగా అర్థం కాదు..కానీ దానితోనే నంబి నారాయణన్ జీవితం సాగింది కాబట్టి కచ్చితంగా వాటిని చూపించాల్సిందే. దర్శకుడు అదే పని చేశారు. ఇక సెకండాఫ్ మొత్తం చాలా భావోద్వేగంగా సాగుతుంది.
దేశం కోసం అన్ని త్యాగాలు చేసిన నంబి నారాయణన్.. దేశద్రోహి కేసు కింద అరెస్ట్ కావడం.. ఆ సమయంలో ఆయనతో పాటు కుటుంబ సభ్యులు ఎలాంటి మానసిక క్షోభని అనుభవించారు, నిర్దోషిగా బయటకు రావడమే కాకుండా దేశ మూడో అత్యున్నత పురస్కారమైన ‘పద్మభూషణ్’ అందుకున్న సీన్స్ చాలా భావోద్వేగాన్ని కలిగించేలా అద్భుతంగా తెరకెక్కించారు.
‘ఒక రాకెట్ కూలిపోతే రియాక్ట్ అయ్యే మాకు.. ఒక మనిషి కూలిపోతే రియాక్ట్ అవడం తెలియదు’ అంటూ తోటి సైంటిస్టుల గురించి నంబి చెప్పె డైలాగ్, ఒక వీధి కుక్కను కొట్టి చంపాలనకుంటే దానికి పిచ్చి అన్న పట్టం కడితే సరిపోతుంది..అదేవిధంగా ఒక మనిషిని తనకు తెలియకుండా కొట్టాలంటే దేశద్రోహి అనే పట్టం కడితే సరిపోతుంది’ అని హీరో సూర్య చెప్పే డైలాగ్ అందరిని ఆకట్టుకోవడమే కాదు ఆలోచింపజేస్తాయి కూడా. దేశం కోసం కష్టపడిన మీ ఓ గొప్ప శాస్త్రవేత్తని అన్యాయంగా తప్పుడు కేసులో ఇరికించారే అనే ఫీల్‌తో ప్రేక్షకుడు బయటకు వస్తాడు. ఈ సినిమా సామాన్య ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో తెలియదు కానీ.. మాధవన్ చాలా నిజయతీగా, ఉన్నతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.
ఎవరెలా చేశారంటే..
నంబి నారాయణన్ పాత్రలో మాధవన్ నటించడం కంటే ఒదిగిపోయాడు. ఈ సినిమా కోసం దర్శకుడిగా, నటుడిగా మాధవన్ పడిన కష్టమంతా తెరపై కనిపించింది. యంగ్ లుక్‌తో పాటు ప్రస్తుతం నంబి నారాయణన్ ఎలా ఉన్నారో.. అలానే తెరపై చూపించే ప్రయత్నం చేశారు. దాని కోసం మాధవన్ చాలా కష్టపడ్డారు. పొట్టపెంచడం, పంటి వరుసను మార్చుకోవడం.. గెడ్డం పెంచడం ..ఇలా చాలా విషయాల్లో మాధవన్ డేరింగ్ స్టెప్స్ వేశాడు. ఎమోషనల్ సీన్స్‌ని చక్కగా పండించారు. అబ్దుల్ కలాంగా గుల్షన్ గ్రోవర్ , నంబిని ఇంటర్వ్యూ చేసే హీరోగా సూర్య(హిందీలో షారుఖ్) చక్కగా నటించారు. ఇక సినిమాకు మరో ప్రధాన బలం శ్యామ్. సీఎస్ సంగీతం. చక్కటి నేపథ్య సంగీతంతో సినిమాని మరోస్థాయికి తీసుకెళ్లారు.సిర్షా రే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి.
- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment