Nambi Narayanan
-
ఓటీటీలో వచ్చేస్తున్న ‘రాకెట్రీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే..
విలక్షణ నటుడు ఆర్ మాధవన్ స్వయంగా దర్శకత్వం వహిస్తూ నటించిన సినిమా ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’. ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. జులై 1న థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ని దక్కించుకుంది. మాధవన్ టేకింగ్,యాక్టింగ్‌పై విమర్శకులు సైతం ప్రశంసల జల్లు కురిపించారు. దాదాపు రూ.25 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం రూ. 40 కోట్ల వసూళ్లను సాధించి రికార్డు సృష్టించింది. (చదవండి: ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ మూవీ రివ్యూ) ఇప్పటి వరకు థియేటర్స్‌లో సందడి చేసిన ఈ చిత్రం.. ఇక ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమైంది. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో జులై 26 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంటుంది. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ సంస్థ అధికారికంగా తెలియజేస్తూ ఓ స్పెషల్ పోస్టర్ని విడుదల చేసింది. రితా మాధవన్, వర్గీస్ మూలన్, విజయ్ మూలన్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో సిమ్రాన్, రవి రాఘవేంద్ర, మిషా ఘోషాల్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. hop on for a space adventure 🚀#RocketryOnPrime, July 26 pic.twitter.com/W3JDZEz2eD — amazon prime video IN (@PrimeVideoIN) July 20, 2022 (చదవండి: చేయని నేరానికి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు.. నంబి నారాయణన్ రియల్ స్టోరీ) -
‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ మూవీ రివ్యూ
టైటిల్ : ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ నటీనటులు : ఆర్. మాధవన్, సిమ్రన్ , సూర్య, గుల్షన్ గ్రోవర్, రజిత్ కపూర్, రవి రాఘవేంద్ర తదితరులు నిర్మాణ సంస్థలు : కలర్ ఫిల్మ్స్, వర్ఘీస్ మూలన్ పిక్చరర్స్ నిర్మాతలు: సరితా మాధవన్, మాధవన్, వర్ఘీస్ మూలన్, విజయ్ మూలన్ రచన,దర్శకత్వం : ఆర్ మాధవన్ సంగీతం : శ్యామ్. సీఎస్ సినిమాటోగ్రఫీ : సిర్షా రే ఎడిటర్ : బిజిత్ బాలా విడుదల తేది : జులై 1, 2022 ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో బయోపిక్‌ల సీజన్ నడుస్తోంది. సినీ, రాజకీయ,క్రీడా ప్రముఖుల జీవిత కథల నేపథ్యంలో పలు భాషల్లో సినిమాలు రూపొందుతున్నాయి. ఈ లిస్ట్‌లో ఓ సైంటిస్ట్ కూడా చేరాడు. ఆర్ మాధవన్ స్వయంగా దర్శకత్వం వహిస్తూ నటించిన సినిమా ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’. ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్‌కు మంచి స్పందన లభించింది. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(జులై 1)థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రం ఎలా ఉంది? నంబి నారాయణన్‌గా మాధవన్ ఏ మేరకు మెప్పించారో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. ఈ సినిమ కథంతా ఇంటర్వ్యూగా సాగుతుంది. ఓ టీవీ చానల్లో హీరో సూర్య నంబి నారాయణన్(మాధవన్)ని ఇంటర్వ్యూ చేస్తూ.. తన జీవితం ఎలా సాగింది? ఇస్రోలో ఎలా చేరారు? తనపై వచ్చిన ఆరోపణలు ఎలా ఎదుర్కొన్నాడు తదితర విషయాలను అడుగుతారు. 1966లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)లో చేరుతాడు నంబి నారాయణన్. అంచెలంచెలుగా ఎదుగుతూ.. అమెరికాలోని ప్రిన్స్టన్ యూనివర్సీటీలో రాకెట్ ప్రొపల్షన్ సిస్టమ్స్ చదివేందుకు స్కాలర్షిప్ పొందారు. అక్కడ సానా ఆఫర్ వచ్చిన సున్నితంగా తిరస్కరించి తిరిగి ఇండియాకు వచ్చిన మళ్లీ ఇస్రోలో చేరుతారు.. స్వదేశీ రాకెట్లను అభివృద్ది చేసే ప్రాజెక్ట్‌లో భాగంగా రష్యా డెవలప్ చేసిన క్రయోజెనిక్ ఇంజన్స్‌ని భారత్ తీసుకురావాలనుకుంటారు. ఇదే సమయంలో పాకిస్తాన్‌కు భారత రాకెట్ సాంకేతిక విషయాలను చేరవేశారనే నెపంతో అరెస్ట్ అవుతారు. ఆ తర్వాత నంబి నారాయణన్ జీవితం ఎలా మలుపు తిరిగింది? అరెస్ట్ తర్వాత కేరళ పోలీసుల చేతిలో నంబి ఎలాంటి చిత్రహింసలు అనుభవించారు? తనపై వచ్చిన తప్పుడు ఆరోపణలను నుంచి ఎలా విముక్తి పొందారు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. భారత అంతరిక్ష పరిశోధన రంగం అభివృద్ధిలో విశేష కృషి చేసిన వ్యక్తుల్లో నంబి నారాయణన్ ఒకరు. దేశం కోసం అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఆఫర్‌ని తిరస్కరించి ఇస్రోలో చేరారు. అలాంటి వ్యక్తి ఒకానొక సమయంలో ఆయన దేశ ద్రోహం కేసును ఎదుర్కొన్నారు.తర్వాత ఆయనపై వేసిన దేశ ద్రోహం కేసును సుప్రీం కొట్టి వేసింది.నంబి నారాయణన్ మీద ఆరోపణలూ చెదిరిపోయిన తర్వాత భారత ప్రభుత్వం ఆయన్ని పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. ఇలా ఎన్నో ఎత్తు పల్లాలను చవిచూసిన ఆయన జీవితాన్ని మాధవన్ వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించాడు.ఫస్టాఫ్ అంతా స్వదేశీ రాకెట్లను అభివృద్ది కోసం నంబి నారాయణన్ చేసిన కృషిని చూపించారు. సెకండాఫ్‌లో తప్పుడు కేసు వల్ల ఆయనతో కుటుంబ సభ్యులు ఎలాంటి అవమానాలకు గురయ్యారు? చివరకు నిర్థోషిగా ఎలా బయటకు వచ్చారనే విషయాలను చాలా భావోద్వేంగా చూపించారు.అయితే ఫస్టాఫ్ అంతా అంతరిక్ష పరిశోధన, ప్యూయల్ టెక్నాలజీ, వికాస్ ఇంజన్ అభివృద్ది తదితర అంశాలను లోతుగా చూపించడంతో డ్యాక్యూమెంటరీ ఫీల్ కలుగుతుంది. రాకెట్ సైన్స్ సామాన్య ప్రేక్షకులకు అంతగా అర్థం కాదు..కానీ దానితోనే నంబి నారాయణన్ జీవితం సాగింది కాబట్టి కచ్చితంగా వాటిని చూపించాల్సిందే. దర్శకుడు అదే పని చేశారు. ఇక సెకండాఫ్ మొత్తం చాలా భావోద్వేగంగా సాగుతుంది. దేశం కోసం అన్ని త్యాగాలు చేసిన నంబి నారాయణన్.. దేశద్రోహి కేసు కింద అరెస్ట్ కావడం.. ఆ సమయంలో ఆయనతో పాటు కుటుంబ సభ్యులు ఎలాంటి మానసిక క్షోభని అనుభవించారు, నిర్దోషిగా బయటకు రావడమే కాకుండా దేశ మూడో అత్యున్నత పురస్కారమైన ‘పద్మభూషణ్’ అందుకున్న సీన్స్ చాలా భావోద్వేగాన్ని కలిగించేలా అద్భుతంగా తెరకెక్కించారు. ‘ఒక రాకెట్ కూలిపోతే రియాక్ట్ అయ్యే మాకు.. ఒక మనిషి కూలిపోతే రియాక్ట్ అవడం తెలియదు’ అంటూ తోటి సైంటిస్టుల గురించి నంబి చెప్పె డైలాగ్, ఒక వీధి కుక్కను కొట్టి చంపాలనకుంటే దానికి పిచ్చి అన్న పట్టం కడితే సరిపోతుంది..అదేవిధంగా ఒక మనిషిని తనకు తెలియకుండా కొట్టాలంటే దేశద్రోహి అనే పట్టం కడితే సరిపోతుంది’ అని హీరో సూర్య చెప్పే డైలాగ్ అందరిని ఆకట్టుకోవడమే కాదు ఆలోచింపజేస్తాయి కూడా. దేశం కోసం కష్టపడిన మీ ఓ గొప్ప శాస్త్రవేత్తని అన్యాయంగా తప్పుడు కేసులో ఇరికించారే అనే ఫీల్‌తో ప్రేక్షకుడు బయటకు వస్తాడు. ఈ సినిమా సామాన్య ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో తెలియదు కానీ.. మాధవన్ చాలా నిజయతీగా, ఉన్నతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఎవరెలా చేశారంటే.. నంబి నారాయణన్ పాత్రలో మాధవన్ నటించడం కంటే ఒదిగిపోయాడు. ఈ సినిమా కోసం దర్శకుడిగా, నటుడిగా మాధవన్ పడిన కష్టమంతా తెరపై కనిపించింది. యంగ్ లుక్‌తో పాటు ప్రస్తుతం నంబి నారాయణన్ ఎలా ఉన్నారో.. అలానే తెరపై చూపించే ప్రయత్నం చేశారు. దాని కోసం మాధవన్ చాలా కష్టపడ్డారు. పొట్టపెంచడం, పంటి వరుసను మార్చుకోవడం.. గెడ్డం పెంచడం ..ఇలా చాలా విషయాల్లో మాధవన్ డేరింగ్ స్టెప్స్ వేశాడు. ఎమోషనల్ సీన్స్‌ని చక్కగా పండించారు. అబ్దుల్ కలాంగా గుల్షన్ గ్రోవర్ , నంబిని ఇంటర్వ్యూ చేసే హీరోగా సూర్య(హిందీలో షారుఖ్) చక్కగా నటించారు. ఇక సినిమాకు మరో ప్రధాన బలం శ్యామ్. సీఎస్ సంగీతం. చక్కటి నేపథ్య సంగీతంతో సినిమాని మరోస్థాయికి తీసుకెళ్లారు.సిర్షా రే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
చేయని నేరానికి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు.. నంబి నారాయణన్ రియల్ స్టోరీ
1994 నవంబర్ 30.. అప్పటి వరకు ఆయన దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్త. యావత్ భారత్ ఆయనపై ప్రశంసలు జల్లు కురిపించింది. ఆయన కనిపెట్టిన ‘వికాస్’ ఇంజన్ అద్భుతమైనదని ప్రపంచమంతా కొనియాడింది. కానీ ఒకే ఒక ఘటనతో ఆయన జీవితం తలకిందులైపోయింది. దేశం కోసం అహర్నిశలు శ్రమించిన ఆయనను ‘దేశద్రోహి’ అన్నారు. చేయని తప్పుకు 50 రోజులు జైలులో పెట్టి నరకం చూపించారు. చివరకు నిర్థోషిగా బయటకు రావడమే కాకుండా.. దేశ మూడో అత్యున్నత పురస్కారమైన ‘పద్మభూషణ్’ అందుకున్నారు. ఆయనే భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్. జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలను చవిచూసిన నంబి నారాయణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’. విలక్షణ నటుడు మాధవన్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జులై 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా నంబి నారాయణన్ గురించి.. నాసా ఆఫర్‌ని సున్నితంగా తిరస్కరించి.. నంబి నారాయణన్ మధ్య తరగతి కుటుంబానికి చెందినవారు. 1941 డిసెంబర్ 12న తమిళనాడులో జన్మించారు. ఆయన తల్లిదంద్రులు కొబ్బరి పీచు వ్యాపారం చేసేవారు. ఐదుగురి బాలికల తర్వాత ఆయన పుట్టాడు. ఇంట్లో అందరికంటే చిన్నవాడైన నారాయణన్.. చదువులో మాత్రం బాగా రాణించేవాడు. ఇంజనీరింగ్ పూర్తి చేశాక.. కొంతకాలం స్థానికంగా ఉండే చక్కెర కర్మాగారంలో పనిచేశారు. 1966లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)లో చేరారు. అంచెలంచెలుగా ఎదుగుతూ.. అమెరికాలోని ప్రిన్స్టన్ యూనివర్సీటీలో రాకెట్ ప్రొపల్షన్ సిస్టమ్స్ చదివేందుకు స్కాలర్షిప్ పొందారు. 1966లో నంబి నారాయణన్ నాసాలో ఉద్యోగ అవకాశం లభించినా.. దేశం కోసం సున్నితంగా తిరస్కరించి తిరిగి ఇస్రోలో చేరారు. అక్కడ విక్రమ్ సారాబాయి, సతీష్ ధావన్, అబ్దుల్ కలాం లాంటి ప్రఖ్యాత శాస్త్రవేత్తలతో కలిసి పనిచేశారు. స్వదేశీ రాకెట్లను అభివృద్ది చేసే ప్రాజెక్ట్‌లో నారాయణన్ కీలక పాత్ర పోషించారు. ప్యూయల్ టెక్నాలజీని ఇస్రోకు అందించాలనుకున్నాడు. ఆ ఆలోచనల నుంచి పుట్టిందే క్రయోజెనిక్ ఇంజిన్స్. ఈ టెక్నాలజీ అప్పట్లో మనకు అందుబాటులో లేదు. దీంతో రష్యాతో రూ.235 కోట్ల ఒప్పందం కుదుర్చుకొని ఈ టెక్నాలజీని దిగుమతి చేసుకోవాలనుకున్నారు. ఈమేరకు సంప్రదింపులు కూడా పూర్తయ్యాయి. ఆ సమయంలోనే ఊహించని పరిణామం చోటు చేసుకుంది. చేయని తప్పుకు నంబి నారాయణన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అసలేం జరిగింది? 1994 నవంబర్ 30న నంబిని కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకు నెల రోజుల ముందు వీసా గడువు ముగిసిన తర్వాత కూడా భారత్‌లోనే ఉన్నారంటూ మాల్దీవులకు చెందిన మహిళ మరియమ్ రషీదా, ఫయూజియ్యా హసన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో ఆ మహిళలిద్దరు భారత రాకెట్ సాంకేతిక విషయాలను పాకిస్తాన్‌కు చేరవేస్తున్నారని తేలింది. అంతేకాదు వీరికి ఇస్త్రోలో పని చేస్తున్న శాస్త్రవేత్తలు సహకరిస్తున్నారని మీడియాతో వార్తలు వచ్చాయి. ఆ మహిళలు వేసిన వలలో నంబి నారాయణన్ కూడా ఉన్నారని కేరళ పోలీసులు అభియోగాలు మోపారు. దేశద్రోహం కేసు కింద అరెస్ట్ చేసి 50 రోజులు జైల్లో పెట్టి విచారణ పేరుతో నరకం చూపించారు. దేశం గర్వించదగ్గ సైంటిస్ట్ అని కొనియాడిన మీడియానే ఆయన్ను ‘దేశద్రోహి’గా చూపించింది. గూఢచారి, దేశద్రోహి అంటూ అనేకమంది ఆయనను నిందించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తే ఆయన ఇంటిపై దాడి చేశారు. న్యాయమే గెలిచింది దేశం కోసం నాసా ఆఫర్‌ని తిరస్కరించిన నంబి నారాయణన్‌కు.. అసలు తనని ఎందుకు అరెస్ట్ చేశారో కూడా మొదట్లో అర్థం కాలేదు. పోలీసులు ఎంత హింసించిన నేరం ఒప్పుకోలేదు. అరెస్టయిన నెల రోజుల తర్వాత ఈ కేసు కేరళ ఇంటలిజెన్స్ బ్యూరో నుంచి సీబీఐకు బదిలీ అయింది. 1995 జనవరి 19న ఆయనకు బెయిల్ వచ్చింది. సీబీఐ విచారణలో నంబి నారాయణన్ ఎలాంటి తప్పు చేయలేదని తేలింది. సీబీఐ తమ నివేదికను 1996 ఏప్రిల్‌లో కేరళ హైకోర్టుకు సమర్పించింది. ఇస్రోకు చెందిన సమాచారం పాకిస్తాన్‌కు వెళ్లినట్లు ఎక్కడ ఆధారాలు లేకపోవడంతో నంబి నారాయణన్‌తో పాటు మరో ఐదుగురికి కోర్టు క్లీన్చిట్ ఇచ్చింది. దీంతో నంబి నారాయణన్ తిరిగి ఇస్రోలో చేరారు. సీబీఐ ఈ కేసును మూసివేసినా.. అప్పటి కేరళ ప్రభుత్వం మళ్లీ తెరిచేందుకు ప్రయత్నించింది. ఈ కేసుని మళ్లీ విచారించాలని కోరుతూ..1998లో సుప్రీకోర్టు మెట్లు ఎక్కింది. కానీ దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ కేసును తిరస్కరించింది. తనపై అక్రమంగా కేసును బనాయించి, వేధించిన కేరళ ప్రభుత్వంపై డాక్టర్ నారాయణన్ కేసు వేశారు. నారాయణన్‌కు రూ.50 లక్షల రూపాయలు పరిహారంగా చెల్లించాలని సుప్రీంకోర్టు 2018లో ఆదేశించింది. అంతేకాదు తప్పుడు కేసు బనాయించడంపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేసింది. తన తప్పును తెలుసుకున్న కేరళ ప్రభుత్వం కోర్టు ఆదేశించిన పరిహారానికి అదనంగా రూ.1.3 కోట్లు అదనంగా ఇస్తామని 2019లో ప్రకటించింది. 2019లో భారత ప్రభుత్వం నారాయణన్ని ‘పద్మభూషణ్’తో సత్కరించింది. నారాయణన్‌పై కుట్ర పన్నిందెవరనే విషయాలు ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నాయి. గుఢచార్యం కేసు వెనుక అమెరికా హస్తం ఉందని కేరళ హైకోర్టు ఎదుట నారాయణన్ అనుమానం వ్యక్తం చేశారు. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
తొలిసారిగా అది చూపించబోతున్నాం: మాధవన్
R Madhavan Says Nambi Narayanan Is James Bond: ‘‘రాకెట్రీ.. ది నంబి ఎఫెక్ట్’ సినిమాకి ఆరేళ్లు పట్టింది. సాధారణంగా స్పేస్ సినిమాల్లో రాకెట్స్‌ను, స్పేస్ షిప్స్‌ను చూస్తుంటాం. కానీ ఏ సినిమాలోనూ రాకెట్ ఇంజిన్‌ను చూపించి ఉండరు. తొలిసారి మా సినిమాలో చూపించబోతున్నాం’’ అని హీరో ఆర్. మాధవన్ అన్నారు. ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ బయోపిక్‌గా తెరకెక్కిన చిత్రం ‘రాకెట్రీ.. ది నంబి ఎఫెక్ట్’. ఆర్. మాధవన్ లీడ్ రోల్లో నటించి, దర్శకత్వం వహించారు. మాధవన్, సరితా మాధవన్, వర్గీస్ మూలన్, విజయ్ మూలన్ నిర్మించిన ఈ సినిమా జూలై 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఆర్. మాధవన్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘మన దేశానికి చెందిన రాకెట్రీ సీక్రెట్స్‌ను నంబి నారాయణన్ పాకిస్థాన్‌కి అమ్మేశారనే నేరం కింద ఆయన్ని అరెస్ట్ చేసి, చిత్రహింసలు పెట్టారు. కానీ సీబీఐ దర్యాప్తులో ఆయన నిరపరాధిగా నిరూపించబడ్డారు ? అదే ఈ చిత్రకథ. ఆయన లైఫ్ నాకు పేదవాడి జేమ్స్ బాండ్ స్టోరీలా అనిపించింది. చదవండి: హీరోను దుమ్మెత్తిపోసిన నెటిజన్లు.. సైలెంట్‌గా ఉండమని కామెంట్లు.. ఏడాదిన్నర పాటు ఈ కథను తయారు చేశాను. సైన్స్, టెక్నాలజీ రంగంలో చాలామంది మేధావులున్నారు. వారి గురించి ఈ ప్రపంచానికి తెలియజేయాలనే ‘రాకెట్రీ.. ది నంబి ఎఫెక్ట్’ సినిమా చేశాను. ఈ సినిమాకి నేను ప్రోస్థటిక్ మేకప్స్ ఉపయోగించలేదు. నంబి నారాయణన్‌లా కనిపించటానికి బాగా కష్టపడ్డాను. ‘బాహుబలి’ వంటి గొప్ప సినిమాను చేయడానికి ఆ టీమ్ ఎంత కష్టపడ్డారో ‘రాకెట్రీ.. ది నంబి ఎఫెక్ట్’ కోసం మా టీమ్ కూడా అంతే కష్టపడింది’’ అని మాధవన్ తెలిపారు. చదవండి: తెరపైకి అటల్ బిహారీ వాజ్‌పేయి జీవిత కథ.. -
మాధవన్‌ను చూసి ఒక్కసారిగా షాకైన సూర్య, వీడియో వైరల్
వైవిధ్యమైన పాత్రలు, కథలతో అలరిస్తుంటాడు మాధవన్. తాజాగా ఆయన రాకెట్రీ అనే బయోపిక్‌తో రాబోతున్నాడు. ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్ జీవితాన్ని ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ఇందులో మాధవన్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. పాత్ర కోసం మ్యాడీ తనని తాను పూర్తిగా మేకోవర్ చేసుకున్నాడు. అచ్చం నంబి నారాయణ్‌లా తెల్ల జుట్టు, కళ్లద్దాలతో కనిపించనున్నాడు. చదవండి: అది చెత్త సినిమా.. దానివల్ల ఏడాది పాటు ఆఫర్స్ రాలేదు: పూజా హెగ్డే అయితే ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన స్టార్ హీరో సూర్య షూటింగ్ చూసేందుకు నంబి నారాయణ్‌తో కలిసి సెట్‌కు వెళ్లిన ఓ దృశ్యం ఒకటి తాజాగా బయటకు వచ్చింది. సెట్లోకి అడుగుపెట్టగానే నంబి నారాయణన్ గేటప్ ఉన్న మాధవన్‌ను చూసి ఆశ్చర్యానికి లోనయ్యాడు. ఒక్క క్షణం ఎవరూ నిజమైన నంబి నారాయణ్ అని గుర్తు పట్టలేదనేంతగా ఓ షాకింగ్ లుక్ ఇచ్చాడు. ఇక సెట్స్‌లోని సూర్య, నారాయణ్ రాగానే కూర్చి నుంచి లేచి ఇరువురి స్వాగతం పలికాడు మ్యాడీ. అనంతరం సూర్యను తన స్నేహితుడు అంటూ నారాయణ్‌కు పరిచయం చేశాడు. చదవండి: కొత్త కారు కొన్న బిగ్‌బాస్ బ్యూటీ, ధరెంతో తెలుసా? ఇక ఆయన సూర్యను పలకరిస్తూ.. మీ సినిమాలు చాలా బాగుంటాయని, మీ నటన అద్భుతమని కొనియాడారు. అంతేకాదు మీ నాన్నగారు(శివకూమార్) దర్శకత్వం కూడా తనకు బాగా నచ్చుందని చెప్పడంతో సూర్య ఆయనకు కృతజ్ఞతలు తెలిపాడు. కాగా తమిళం, తెలుగులో చేస్తున్న సూర్య పాత్రలో హిందీలో షారుక్ ఖాన్ పోషిస్తున్నాడు. ఇక నంబి నారాయణ్ భార్య పాత్రలో సీనియర్ నటి సిమ్రాన్ కనిపించనుంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 1న విడుదలకు సిద్ధమవుతుంది. View this post on Instagram A post shared by R. Madhavan (@actormaddy) -
హీరోను దుమ్మెత్తిపోసిన నెటిజన్లు.. సైలెంట్‌గా ఉండమని కామెంట్లు..
R Madhavan Gets Trolled For Claiming ISRO Used Hindu Calendar For Mars Mission: దక్షిణాది భాషల్లోనే కాకుండా బాలీవుడ్‌లోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు మాధవన్. ఆయన తాజాగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం రాకెట్రీ. ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కింది ఈ చిత్రం. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, స్టార్ హీరో సూర్య కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీషు భాషల్లో జులై 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్లో భాగంగా చిత్రబృందం మీడియా సమావేశాలకు హాజరవుతోంది. ఈ క్రమంలోనే మాధవన్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట ట్రోల్స్ ఎదుర్కొంటున్నాయి. ఓ ప్రెస్ మీట్లో అంతరిక్షంలోకి రాకెట్‌ను ప్రయోగించినప్పుడు, అది అంగారక కక్ష్యలోకి చేరేందుకు ఇస్రోకు పంచాగం ఉపయోగపడిందని మాధవన్ అన్నాడు. 'ఇస్రోవాళ్లు పంచాంగం చూసి పెట్టిన ముహుర్త బలం వల్లే భారత మార్స్ మిషన్ అవాంతరాలను అధిగమించి కక్ష్యలోకి చేరింది. గ్రహాల స్థితిగతులన్నీ పంచాంగాల్లో నిక్షిప్తమై ఉంటాయి.' అని మాధవన్ వ్యాఖ్యలు చేశాడు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ కాగా నెటిజన్స్ ట్రోలింగ్‌తో ఏకిపారేస్తున్నారు. (చదవండి: చై-సామ్ బాటలో మరో టాలీవుడ్ జంట ?) When panjakam plays a important role in Mars mission #Madhavan #MarsMission #science #technology #sciencefiction pic.twitter.com/tnZOqYfaiN — கல்கி (@kalkyraj) June 23, 2022 'సైన్స్ అందరికీ అర్థమయ్యే విషయం కాదు. అలా అని సైన్స్ తెలియకపోవడం కూడా పెద్ద సమస్య కాదు. కానీ అసలు విషయం తెలుసుకోకుండా ఇలా మాట్లాడే బదులు సైలెంట్‌గా ఉండటం మంచిది', 'మీరు మాట్లాడే దాంట్లో ఏమైనా అర్థం ఉందా ?', 'ఇవేం పిచ్చి మాటలు' అంటూ వరుస కామెంట్లతో నెటిజన్లు దుమ్మెత్తిపోశారు. అయితే ఈ ట్రోలింగ్‌పై తాజాగా మాధవన్ స్పందించాడు. 'పంచాంగాన్ని తమిళంలో పంచాంగ్ అని అనడం నా తప్పే. ఈ విమర్శలకు నేను అర్హుడినే. నేను అజ్ఞానినే. అయితే ఈ మాటల వల్ల మనం కేవలం 2 ఇంజిన్ల సహాయంతో మార్స్ మిషన్‌లో విజయం సాధించామనే నిజం కాకుండా పోదు. ఇది ఒక రికార్డు. వికాస్ ఇంజిన్ ఒక రాక్‌స్టార్.' అని ట్వీట్ మాధవన్ ట్వీట్ చేశాడు. (చదవండి: 'నువ్వే కావాలి' నటుడికి నిర్మాత బెదిరింపులు.. పోలీసులకు ఫిర్యాదు) 🙏🙏I deserve this for calling the Almanac the “Panchang” in tamil. Very ignorant of me.🙈🙈🙈🤗🚀❤️Though this cannot take away for the fact that what was achieved with just 2 engines by us in the Mars Mission.A record by itself. @NambiNOfficial Vikas engine is a rockstar. 🚀❤️ https://t.co/CsLloHPOwN — Ranganathan Madhavan (@ActorMadhavan) June 26, 2022 (చదవండి: 9 సార్లు పిల్లలను కోల్పోయిన స్టార్ హీరోయిన్..) -
అవమానం ఎదురైన చోటే అందలం.. ఆ కిక్కే వేరు!
అవమానం ఎదురైన చోటే అందలం ఎక్కితే ఆ కిక్కే వేరు. పరువు పోయినచోటే మళ్లీ గౌరవం దక్కడం అంటే మాటలా? న్యాయం కోసం రెండు దశాబ్దాలకు పైగా పోరాటం చేసిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్(80) అలాంటి గౌరవాన్నే పొందారు. నకిలీ కేసుపై రాజీలేని పోరాటం చేసి గెలిచిన ఆయన తాజాగా మరో ఘనత సాధించారు. 2022 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం 15 మంది సభ్యులతో ఏర్పాటు చేసిన పద్మ పురస్కారాల ఎంపిక కమిటీలో నారాయణన్ కూడా ఉన్నారు. తాజాగా ఈ కమిటీ 128 మందిని పద్మపురస్కారాలకు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. 1990 దశకంలో ‘గూఢచారి’గా నిందించబడి, జైలుపాలై... 2019లో దేశ మూడో అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ అందుకునే వరకు నంబి నారాయణన్ సాగించిన పోరాటం అనన్య సామాన్యం. సత్యం కోసం చివరి వరకు నిలబడి పద్మ పురస్కారం అందుకోవడమే కాదు.. ఇప్పుడు సెలక్షన్ కమిటీలోనూ ఆయన చోటు దక్కించుకోవడం విశేషం. తనను నిరపరాధిగా నిరూపించుకోవడం, నష్టపరిహారం దక్కించుకోవడంతోనే ఆయన పోరాటం ముగించలేదు. దేశం ముందు తనను అపరాధిగా నిలబెట్టిన కుట్రదారులెవరో కనిపెట్టాలన్న ఆయన పంతం ఇంకా నెగ్గలేదు. నారాయణన్‌ను ‘గూఢచారి’ కేసులో ఇరికించిన సూత్రధారులను చట్టం ముందు నిలబెట్టాలని 2021, ఏప్రిల్‌లో సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలివ్వడం ఈ పోరాటంలో మేలిమలుపు. అసలేం జరిగింది? 1994, అక్టోబర్‌లో మాల్దీవుల మహిళ మరియం రషీదా అరెస్ట్‌తో కథ మొదలైంది. ఇస్రో క్రయోజెనిక్ ఇంజన్ డ్రాయింగ్స్‌ను పాకిస్థాన్‌కు అమ్ముతుందంటూ ఆమెపై కేరళ పోలీసులు అభియోగాలు మోపారు. క్రయోజెనిక్ ఇంజన్ డిజైన్ ప్రాజెక్ట్‌కు డైరెక్టర్‌గా ఉన్న నంబి నారాయణన్‌తో పాటు ఆయన డిప్యూటీ డి. శశికుమారన్, రష్యా అంతరిక్ష సంస్థకు చెందిన భారత ప్రతినిధి కె. చంద్రశేఖర్, ఎస్.కె. లేబర్ కాంట్రాక్టర్ శర్మ, రషీదా స్నేహితుడు ఫౌసియా హసన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వీరిపై గూఢచర్యం కింద కేసులు నమోదు చేశారు. మాల్దీవుల జాతీయులు మినహా ఇస్రో శాస్త్రవేత్తలు, వ్యాపారవేత్తలు బెయిల్‌పై 1995 జనవరిలో విడుదలయ్యారు. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన సీబీఐ.. 1996 ఏప్రిల్‌లో కేరళ కోర్టుకు నివేదిక సమర్పించింది. నిందితులు ఎటువంటి గూఢచర్యానికి పాల్పడలేదని క్లీన్చిట్ ఇచ్చింది. సీబీఐ సమర్పించిన కేసు మూసివేత నివేదికను అంగీకరించిన కోర్టు నిందితులందరినీ నిర్దోషులుగా విడుదల చేసింది. కీలక మలుపులు రాష్ట్ర పోలీసులతో కేసును మరోసారి దర్యాప్తు చేయించాలని 1996, జూన్‌లో కేరళ ప్రభుత్వం నిర్ణయించడంతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. కాగా, కేసులో నిరపరాధులుగా తేలిన నిందితులకు 1998 మే నెలలో సుప్రీంకోర్టు రూ. 1 లక్ష పరిహారం ప్రకటించింది. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా నిందితులు అనుభవించిన మానసిక క్షోభకు నష్టపరిహారం చెల్లించాలని కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు తనను నకిలీ కేసులో ఇరికించిన వారిని గుర్తించాలని నారాయణన్ వేసిన పిటిషన్‌పై 2017 ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు విచారణ ప్రారంభించింది. దుర్మార్గపు ప్రాసిక్యూషన్ కారణంగా నారాయణన్ ప్రతిష్టకు భంగం కలిగిందని, దీనికి కేరళ ప్రభుత్వం బాధ్యత వహించాలని 2018 మే 9న అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అబద్దపు కేసుతో నారాయణన్‌ను మానసికంగా వేధింపులకు గురిచేసినందుకు ఆయనకు రూ. 50 లక్షల పరిహారం చెల్లించాలని 2018 సెప్టెంబర్ 14న కేరళ ప్రభుత్వాన్ని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. కాగా, కోర్టు ఆదేశించిన పరిహారానికి అదనంగా రూ.1.3 కోట్లు నష్టపరిహారం ఇవ్వాలని 2019లో కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. (క్లిక్: తెలంగాణలో ‘ఆప్’సోపాలు.. ఢిల్లీ మోడల్ వర్కవుట్ అవుతుందా?) కొనసాగిన పోరాటం నష్ట పరిహారం దక్కినా నారాయణన్ న్యాయ పోరాటం ఆపలేదు. తనను అపఖ్యాతి పాల్జేసిన వారిని చట్టం ముందు నిలబెట్టాల్సిందేనని కేరళ హైకోర్టు తలుపు తట్టారు. దీన్ని ముగిసిన అధ్యాయంగా భావించాలని, ఈ వ్యవహారాన్ని ఇంతటితో ముగించాలని ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన సలహాతో సంతృప్తిచెందకుండా సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జైన్, మరో ఇద్దరు అధికారులతో కమిటీని ఏర్పాటుచేసింది. కమిటీ నివేదిక ఆధారంగా 2021 ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు.. సీబీఐకి ఆదేశాలిచ్చింది. నారాయణన్‌ను గూఢచార్యం కేసులో ఇరికించిన వారిని తమ ముందు నిలబెట్టాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దీంతో 18 మంది కేరళ పోలీసులపై సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. (క్లిక్: నవాబ్ మాలిక్‌కు బిగుసుకుంటున్న ఉచ్చు) అమెరికా హస్తం? తమపై మోపిన గూఢచార్యం కేసు వెనుక ప్రపంచ పెద్దన్న అమెరికా హస్తం ఉందన్న అనుమానాన్ని కేరళ హైకోర్టు ఎదుట నారాయణన్ వెలిబుచ్చారు. క్రయోజెనిక్ ఇంజన్‌ను భారత్ అభివృద్ధి చేయడాన్ని అడ్డుకోవాలనే లక్ష్యంతో అమెరికా గూఢచారి సంస్థ సీఐఏ ఈ పనికి పాల్పడిందని ఆయన పేర్కొన్నారు. భూ స్థిర కక్ష్యలోకి భారీ ఉపగ్రహాలను పంపించేందుకు ఉపయోగించే క్రయోజెనిక్ పరిజ్ఞానాన్ని మన దేశానికి ఇవ్వడానికి పూర్వపు సోవియట్ యూనియన్ అంగీకరించినా అమెరికా ఒత్తిడి తీసుకొచ్చి ఆపించింది. తన నేతృత్వంలో దేశీయంగా క్రయోజెనిక్ ఇంజన్ తయారు చేసేందుకు ఏర్పాటు చేసిన ప్రాజెక్టును గూఢచర్యం కేసుతో అమెరికా విచ్ఛిన్నం చేసిందన్నది నారాయణన్ వాదన. క్రయోజెనిక్ పరిజ్ఞానాన్ని భారత్ అభివృద్ధి చేసి ఉంటే, చాలా దేశాలు తమ ఉపగ్రహాలను ప్రయోగించడానికి మన దేశాన్ని సంప్రదించేవని పేర్కొన్నారు. ఎందుకంటే భారత్‌తో పోలిస్తే యూఎస్‌లో ఉపగ్రహాలను ప్రయోగించడానికి భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. మనం తక్కువ ఖర్చుతో క్రయోజెనిక్ ఇంజన్ చేస్తే తమ ఆధిపత్యానికి గండి పడుతుందన్న భయంతో అమెరికా ఇదంతా చేసిందన్న భావనను నారాయణన్ వ్యక్తపరిచారు. కాగా, 2014 జనవరిలో తొలి దేశీయ క్రయోజెనిక్ ఇంజన్‌ను భారత శాస్త్రవేత్తలు తక్కువ ఖర్చుతో తయారు చేయగలిగారు. పుస్తకాలు.. సినిమా అర్జున్ రామ్‌తో కలిసి ‘రెడీ టు ఫైర్: హౌ ఇండియా సర్వైవడ్ ది ఇస్రో స్పై కేస్’ పేరుతో నంబి నారాయణన్ పుస్తకం తెచ్చారు. గూఢచార్యం కేసు, తదనంతరం చోటు చేసుకున్న పరిణామాల ఆధారంగా ‘క్లాసిఫైడ్: హిడెన్ ట్రూట్స్ ఇన్ ది ఇస్రో స్పై స్టోరీ’పేరుతో ప్రముఖ జర్నలిస్ట్ రాజశేఖర్ నాయర్ పుస్తకం రాశారు. ఇదే నేపథ్యంలో ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ అధికారి కేవీ థామస్ కూడా ‘ఇస్రో మిస్ఫైరెడ్: ది ఇప్సినేజ్ కేస్ దట్ షుక్ ఇండియా’ పేరుతో పుస్తకం రూపొందించారు. నంబి నారాయణన్ జీవితం ఆధారంగా ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ పేరుతో ఇంగ్లీషు, హిందీ, తమిళ భాషల్లో సినిమా తెరకెక్కింది. నటుడు మాధవన్.. నంబి నారాయణన్ పాత్రలో నటించి, నిర్మించడమే కాకుండా దర్శకత్వం వహించారు. ప్రముఖ హీరోలు సూర్య, షారూఖ్ ఖాన్ కూడా ఈ సినిమాలో కనిపించనున్నారు. ఈ సినిమా 2022 ఏప్రిల్ 1న విడుదల కానుంది. తెలుగు, కన్నడ, మలయాళంలోకి అనువదించి విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఎన్నో మలుపులు తిరిగిన నంబి నారాయణన్ జీవితం వెండితెరపై ఎలాంటి సంచనాలు సృష్టిస్తుందో వేచిచూడాలి. (క్లిక్: మంత్రి అరెస్ట్‌పై రాజకీయ దుమారం.. ఎవరీ నవాబ్ మాలిక్?) - సాక్షి, వెబ్ స్పెషల్ -
నంబి నారాయణన్: ఎట్టకేలకు న్యాయం
నిప్పులాంటి నిజాయితీపరుడైన శాస్త్రవేత్తపై గూఢచారిగా ముద్రేసిన కుట్రదారులెవరో నిర్థారించడం కోసం సీబీఐ దర్యాప్తు జరపాలని సుప్రీంకోర్టు గురువారం ఆదేశించటం స్వాగతించదగ్గ నిర్ణయం. 1994లో కొందరి కుట్ర ఫలితంగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్త నంబి నారాయణన్ ఒక నకిలీ కేసులో ఇరుక్కున్నారు. విలువైన తన వ్యక్తిగత జీవితాన్ని, వృత్తిగత జీవితాన్ని కోల్పోయి అనేక విధాలుగా అవమానాలకు లోనయ్యారు. ఆయనా, ఆయన కుటుంబం చెప్పనలవికాని ఇబ్బందులు చవిచూశారు. అయినా నారాయణన్ అలుపెరగని పోరాటం సాగించారు. 1998లో సీబీఐ నివేదిక ఆధారంగా సుప్రీంకోర్టు ఈ కేసు నుంచి ఆయనను నిర్దోషిగా విడుదల చేసింది. పరిహారం కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌కి స్పందించి ఆయనకు రూ. 50 లక్షల పరిహారం చెల్లించాలని 2018లో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కానీ నంబి నారాయణన్ అంతటితో సంతృప్తి చెందలేదు. ఈ నకిలీ కేసు వెనకున్న అధికారులెవరో, వారి ఉద్దేశాలేమిటో దర్యాప్తు చేయించాలని రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని ముగిసిన అధ్యాయంగా భావించాలని ఆ న్యాయస్థానం ఇచ్చిన సలహాతో సంతృప్తిచెందకుండా సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. ఫలితంగా ధర్మాసనం సుప్రీం మాజీ న్యాయమూర్తి జైన్, మరో ఇద్దరు అధికారులతో కమిటీని ఏర్పాటుచేసింది. ఇప్పుడు ఆ కమిటీ నివేదిక పర్యవసానంగానే తాజా తీర్పు వెలువడింది. మన దేశంలో నచ్చనివారిని తప్పుడు కేసుల్లో ఇరికించటం, ఏ స్థాయి వ్యక్తులనైనా అధఃపాతాళానికి నెట్టేయడం ఎంత సులభమో ఇస్రో గూఢచర్యం కేసు నిరూపించింది. ఈ కేసులో నిందితుడిగా ముద్రపడటం వల్ల నంబి నారాయణన్ వ్యక్తిగా చాలా కోల్పోయారన్నది వాస్తవం. కానీ అంతకన్నా ఎక్కువగా మన దేశం నష్టపోయింది. గూఢచారిగా ముద్రపడి దేశవ్యాప్తంగా మీడియాలో పతాకశీర్షికకు ఎక్కేనాటికి నంబినారాయణన్ ఇస్రోలో క్రయోజెనిక్ ఇంజన్ రూపొందించే విభాగానికి ప్రాజెక్టు డైరెక్టర్. వీసా గడువు తీరినా దేశంలోనే వున్న మాల్దీవుల మహిళ మరియం రషీదాను 1994 అక్టోబర్‌లో అరెస్టు చేసినప్పుడు ఆ మహిళతో ఆయనకు ఎందుకు సంబంధం అంటగట్టారో, ఏం ఆశించి పోలీసులు ఆ పనిచేశారో తెలియడానికి సీబీఐ జరపబోయే దర్యాప్తు పూర్తి కావాలి. ఆ కట్టుకథ మాయలో పడి ఆరోజుల్లో మీడియా ‘గూఢచారి నంబి’ గురించి కోడై కూసింది. తాము స్వయంగా అక్కడుండి చూసినట్టు నారాయణన్ ఆమె వ్యామోహంలో చిక్కుకుని అత్యంత కీలకమైన క్రయోజెనిక్ ఇంజన్ డ్రాయింగ్లను ఆమె చేతుల్లో పెట్టిన వైనం గురించి పుంఖానుపుంఖాలుగా కథనాలు అల్లింది. ఇది నిజానికి హాస్యాస్పదమైన కేసు. క్రయోజెనిక్ ఇంజన్‌పై మన శాస్త్రవేత్తలు ఇంకా పరిశోధనలు కూడా మొదలుపెట్టకుండానే దానికి సంబంధించిన సమస్త పరిజ్ఞానాన్ని శత్రువుల చేతిలో పెట్టినట్టు పోలీసులు కట్టుకథ అల్లారు. క్రయోజెనిక్ పరిజ్ఞానాన్ని అందజేయడానికి పుర్వపు సోవి యెట్ యూనియన్ అంగీకరించిన దగ్గరనుంచి అమెరికా మనపై కడుపుమంటతో వుంది. ఆ ఒప్పందాన్ని ఆపాలని అది ప్రయత్నిస్తున్న తరుణంలోనే సోవియెట్ యూనియన్ కుప్పకూలింది. అయితే దాని స్థానంలో ఆవిర్భవించిన రష్యా ఈ విషయంలో మనపట్ల సానుకూలంగానే వున్నా, అప్పట్లో మనం జరిపిన అణు పరీక్షలను సాకుగా చూపి క్రయోజెనిక్ పరిజ్ఞానాన్ని భారత్‌కు ఇవ్వడానికి వీల్లేదంటూ అమెరికా ఒత్తిడి తెచ్చి ఆపించింది. భూ స్థిర కక్ష్యలోకి భారీ ఉపగ్రహాలను పంపాలంటే ఆ పరిజ్ఞానం మినహా ఇస్రోకు గత్యంతరం లేదు. రష్యా సహాయ నిరాకరణతో దాన్నొక సవాలుగా తీసుకున్న ఇస్రో శాస్త్రవేత్తలు అందుకోసం నంబి నేతృత్వంలో దేశీయ పరిజ్ఞానం అభివృద్ధికి ఒక ప్రాజెక్టు ఏర్పాటుచేశారు. కానీ ఆరంభ దశలోనే ఈ ఉచ్చులో చిక్కుకుని ఆ ప్రాజెక్టు కాస్తా మూలనపడింది. దీన్నుంచి కోలుకొని, ఆ ప్రాజెక్టును పట్టాలెక్కించి విజయం సాధించటానికి ఇస్రో శాస్త్రవేత్తలకు రెండు దశాబ్దాలు పట్టింది. 2014 జనవరిలో తొలి దేశీయ క్రయోజెనిక్ ఇంజన్ సాకారమైంది. ఈలోగా వేరే అంతరిక్ష సంస్థల సాయం తీసుకోవడం వల్ల మనకు భారీ వ్యయం తప్పలేదు. రష్యా క్రయోజెనిక్ ఇంజన్ వ్యయం రూ.100 కోట్లు కాగా, మన శాస్త్రవేత్తలు రూ. 40 కోట్లకే దాన్ని నిర్మించగలిగారు. ఈ నకిలీ కేసులో విదేశాల పాత్ర గురించి, వారితో స్థానిక పోలీసుల కుమ్మక్కు గురించి అనంతరకాలంలో ఎన్నో కథనాలు వచ్చాయిగానీ... ఆనాటి రాష్ట్ర కాంగ్రెస్ పెద్దల మధ్య సాగిన అధికార కుమ్ములాటల ఫలితంగానే ఇది పుట్టుకొచ్చిందని, ఒక వర్గానికి కేరళ పోలీసులు అన్నివిధాలా సహకరించి ఇంత పెద్ద కుట్ర కథనాన్ని పకడ్బందీగా అల్లారని వెల్లడైంది. దేశంలో విచారణలో వున్న ఖైదీల్లో అత్యధికులు ఇలా తప్పుడు కేసుల్లో ఇరుక్కొని విలవిల్లాడుతున్నవారేనని మానవ హక్కుల సంఘాలు లోగడ పలుమార్లు గణాంకసహితంగా నిరూపించాయి. క్రిమినల్ కేసుల్లో నిర్దోషులుగా విడుదలైనవారికి పరిహారం చెల్లించే విధానానికి రూపకల్పన జరగాలని, కారకులైన అధికారులపై చర్యలుండాలని ఆ సంఘాలు కోరుతున్నాయి. నంబి నారాయణన్ ఉన్నత స్థాయి శాస్త్రవేత్త గనుక ఆయనకు పరిహారం లభించింది. ఆయన కోరుకున్నట్టు ఈ నకిలీ కేసును నడిపించిన అప్పటి పోలీసు అధికారులపై సీబీఐ దర్యాప్తు జరగబోతోంది. కానీ సామాన్య పౌరుల మాటేమిటి? అందుకే అందరికీ సమానంగా న్యాయం దక్కేందుకు అనువైన చట్టం రూపొందాలి. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి. -
సుప్రీంకోర్టుకు ‘ఇస్రో కుట్ర కేసు’ నివేదిక
న్యూఢిల్లీ: ఇస్రో సైంటిస్టు డా.నంబి నారాయణన్‌ను 1994 కుట్ర కేసుకు సంబంధించి పోలీసులు వేధించిన అంశంపై విచారణకు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన హైలెవల్ కమిటీ తన నివేదికను కోర్టుకు సమర్పించిందని న్యాయవర్గాలు తెలిపాయి. నారాయణన్‌ను తీవ్రంగా అవమానించినందుకు రూ.50 లక్షల పరిహారాన్ని చెల్లించాలని 2018లో ఆదేశించిన కోర్టు, అదే సమయంలో నారాయణన్‌పై పోలీసుల దాష్టీకాన్ని విచారించేందుకు మాజీ జడ్జి జైన్ ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యుల ప్యానెల్‌ను ఏర్పరిచింది. కేరళలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో నారాయణన్‌ను అరెస్టు చేశారు. ఈ విషయమై ఆందోళన చెలరేగడంతో తర్వాత సీబీఐ విచారణ జరిపింది. కేరళ టాప్ పోలీసు అధికారులు నారాయణన్ అక్రమ అరెస్టుకు కారణమని సీబీఐ నిర్ధారించింది. సంచలనం సృష్టించిన ఈ అరెస్టు కారణంగా అప్పటి కాంగ్రెస్ సీఎం కరుణాకరన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. అనంతరం జైన్ ఆధ్వర్యంలోని కమిటీ అరెస్టుకు దారి తీసిన కారణాలు, పోలీసుల వ్యవహారంపై విచారణ జరిపింది. తాజాగా కోర్టుకు నివేదించిన రిపోర్టులో అంశాలు ఇంకా బహిర్గతం కాలేదు. అసలు ఏం జరిగింది? 1994లో మాల్దీవ్‌కు చెందిన రషీదాను ఇస్రో రాకెట్ ఇంజెన్ డ్రాయింగ్స్‌ను పాకిస్థాన్‌కు అమ్ముతుందంటూ పోలీసులు అరెస్టు చేశారు. రషీదాకు అప్పటి ఇస్రోలో క్రయోజెనిక్ ప్రాజెక్టు డైరెక్టర్ నారాయణన్, ఇస్రో డిప్యుటీ డైరెక్టర్ శశికుమారన్‌తో సంబంధాలున్నాయని పోలీసులు అరెస్టు చేశారు. వీరితో పాటు మాల్దీవ్‌కు చెందిన మరో యువతిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసులు ఈ కేసును సృష్టించారని, 1994లో తాను విక్రయించినట్లు చెబుతున్న టెక్నాలజీ అప్పటికింకా అందుబాటులోకే రాలేదని నారాయణన్ ఆరోపించారు. అనంతరం ఆయన ఆరోపించిన పోలీసు అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని హైకోర్టు తీర్పునిచ్చింది. దీనిపై ఆయన సుప్రీంను ఆశ్రయించారు. ఈ సందర్భంగా పోలీసుల పాత్రపై విచారణకు సుప్రీంకోర్టు కమిటీని నియమించింది. నారాయణన్‌ను అరెస్టు చేసి దాదాపు 50 రోజులు కస్టడీలో ఉంచి ఇబ్బంది పెట్టారని, అయితే ఆయన తప్పు లేదని తదనంతరం సీబీఐ తేల్చిచెప్పిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కేసులో కేరళ పోలీసులు ప్రాసిక్యూషన్ మొత్తం మోసపూరితంగా ఉందని, నారాయణన్‌కు తీవ్రమైన ఇబ్బంది కలిగించారని, అందుకే కేరళ ప్రభుత్వాన్ని పరిహారం కట్టమని ఆదేశించింది. చదవండి: మగ ఉద్యోగులకు 24 వారాల పేరెంటల్ లీవ్ -
జర్నలిస్ట్ షారుక్!
హీరో మాధవన్‌ను ప్రశ్నించారు బాలీవుడ్ బాద్షా షారుక్‌ఖాన్.. ఏం ప్రశ్నించారు? వాటికి మాధవన్ సమాధానాలు ఏమిటి? అనేవి వెండితెరపైనే తెలుసుకోవాలి. ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితం ఆధారంగా ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ అనే చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇందులో నంబి నారాయణన్ పాత్రలో నటించి, దర్శకత్వం వహించారు మాధవన్ . జర్నలిస్ట్‌గా కనిపించబోతున్నారు షారుక్ ఖాన్ . నంబి నారాయణన్ని ఓ జర్నలిస్ట్ ప్రశ్నలు అడిగే సన్నివేశంతో ‘రాకెట్రీ’ సినిమా మొదలై, ఆ తర్వాత ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌కి వెళుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే.. షారుక్ నటించిన గత చిత్రం ‘జీరో’లో మాధవన్ సైంటిస్ట్‌గా నటించిన సంగతి తెలిసిందే. -
మాజీ సైంటిస్ట్‌కు 1.3 కోట్ల పరిహారం
తిరువనంతపురం: గూఢచర్యం కేసులో నిరపరాధిగా విడుదలైన ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్‌కు రూ.1.3కోట్ల పరిహారం ఇవ్వాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. 1994లో దేశ రహస్యాలను ఇతరులకు చేరవేస్తున్నారన్న ఆరోపణలపై నారాయణన్‌పై కేసు నమోదు కాగా.. విచారణలో ఆయన నిర్దోషిగా విడుదలయ్యారు. తనను అన్యాయంగా కేసులో ఇరికించిన కారణంగా నష్టపరిహారం చెల్లించాలని 77 ఏళ్ల నారాయణన్ కేసు దాఖలు చేయగా కోర్టు అనుకూల తీర్పునిచ్చింది. దేశ అత్యున్నత న్యాయస్థానం, మానవ హక్కుల కమిషన్ ఈ కేసులో ఇస్రో మాజీ శాస్త్రవేత్తకు రూ.50 లక్షలు, రూ. పది లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పివ్వడం తెల్సిందే. తాజాగా ప్రభుత్వం నిర్ణయించిన రూ.1.3 కోట్లు సుప్రీంకోర్టు పరిహారానికి అదనం. నారాయణన్ లేవనెత్తిన అంశాల పరిశీలనకు ప్రభుత్వం రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి జయకుమార్‌కు బాధ్యతలు అప్పగించగా ఆయన రూ.1.3 కోట్ల పరిహారం చెల్లించాలని సిఫారసు చేశారు. -
కేబినెట్ ఓకే: ఆయనకు భారీగా నష్టపరిహారం
న్యూఢిల్లీ: ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో) మాజీ శాస్త్రవేత్త ఎస్.నంబి నారాయణన్‌కు ఎట్టకేలకు భారీ ఊరట లభించింది. 1994 ఇస్రోలో గూఢచర్యానికి పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనను అరెస్ట్ చేసి.. వేధింపులకు గురి చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయనకు క్లీన్చిట్ లభించడంతో.. తనకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ తిరువనంతపురంలోని కోర్టులో ఇటీవల నంబి నారాయణన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం ఆయనకు సంబంధించిన కేసును విచారించడానికి మాజీ ప్రధాన కార్యదర్శి జయకుమార్‌ను నియమించింది. జయకుమార్ సిఫార్సుల మేరకు రూ.1.3 కోట్లు నష్టపరిహారం ఇచ్చేందుకు కేరళ కేబినెట్ గురువారం ఆమోదం తెలిపింది. వివరాల్లోకి వెళ్తే..1994లో నంబి నారాయణన్ గూఢచర్యానికి పాల్పడి విదేశాలకు ఇస్రో రహస్యాలను చేరవేశారనే ఆరోపణలతో అరెస్ట్ చేశారు. రహస్యాలను చేరవేయడంలో ఇద్దరు శాస్త్రవేత్తలతో పాటు మరో నలుగురి(ఇద్దరు మాల్దీవ్ మహిళలు) భాగస్వామ్యం ఉందని పోలీసులు పేర్కొన్నారు. ఈ క్రమంలో సీబీఐ కోర్టు, సుప్రీంకోర్టు ఆయనను నిర్దోషిగా తేల్చినప్పటికీ.. అప్పటికే ఆయన 50 రోజుల పాటు జైలులో ఉన్నారు. ఈ 50 రోజుల కస్టడీలో తనను పోలీసులు చిత్రహింసలు పెట్టారని నంబి నారాయణన్ ఆరోపించారు. తనను అనవసరంగా అరెస్ట్ చేశారంటూ సుప్రీంకోర్టుకు ఆశ్రయించారు. అదే విధంగా తనపై అక్రమ కేసులు పెట్టిన మాజీ డీజీపీ సీబీ మాథ్యూస్, ఇద్దరు రిటైర్డ్ పోలీస్ సూపరింటెండెంట్లు కేకే జాషువా, ఎస్ విజయన్ పై చర్యలు తీసుకోవాల్సిందిగా కేరళ హైకోర్టును కోరినా స్పందించలేదని నంబి నారాయణన్ సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో నంబి నారాయణన్‌కు రూ. 50లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇక జాతీయ మానవ హక్కుల కమిషన్ సైతం రూ. 10లక్షలు ఇవ్వాలని సిఫార్సు చేసింది. కాగా నంబి నారాయణన్ జీవిత సంఘటనల ఆధారంగా ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నారాయణన్ పాత్రలో మాధవన్ నటిస్తున్నారు. -
స్పేస్ జర్నీ ముగిసింది
‘రాకెట్రీ’లో మాధవన్ అంతరిక్ష ప్రయాణం సెర్బియాలో ముగిసింది. మాధవన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’. ఈ చిత్రానికి దర్శకుడు కూడా మాధవనే కావడం విశేషం. ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా చిత్రీకరణ ముగిసింది. నారాయణన్ పాత్రలో మాధవన్ నటించారు. దాదాపు పదిహేడేళ్ల తర్వాత మాధవన్, సిమ్రాన్ జంటగా నటించిన చిత్రం ఇది. ఇంతకు ముందు మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘కన్నత్తిల్ ముత్తమిట్టాళ్’ (తెలుగులో ‘అమృత’) సినిమాలో మాధవన్, సిమ్రాన్ నటించారు. ‘‘రాకెట్రీ సినిమా ముగిసింది. నా జీవితంలోనే అత్యద్భుతంగా ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. నా హృదయం ఎన్నో భావోద్వేగాలతో నిండిపోయింది’’ అన్నారు మాధవన్. ఇందులో హాలీవుడ్ యాక్టర్లు రాన్ డోనాచీ (గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్), ఫిలిస్ లోగాన్ కీలక పాత్రలు చేశారు. -
వయసు తగ్గింది
సౌత్ ఇండస్ట్రీల్లోని హ్యాండ్సమ్ హీరోల్లో మాధవన్ కచ్చితంగా ముందు వరుసలో ఉంటారు. అటువంటి ఆయన తాజాగా మరో పదేళ్లు వెనక్కివెళ్లిపోయారు అంటున్నారు ఆయన ఫ్యాన్స్. మాధవన్ ప్రస్తుతం ఇస్రో శాస్త్రవేత్త నంబీ నారాయణ్ బయోపిక్‌తో బిజీబిజీగా ఉన్నారు. ఆ సినిమాలో నారాయణ్ యువకుడిగా ఉన్నప్పటి సన్నివేశాలు చిత్రీకరించడానికి క్లీన్ షేవ్ చేసుకున్నారు మాధవన్. ఆ ఫొటో తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే.. ‘భలే యంగైపోయారే!’ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. ఈ యంగ్ లుక్ గురించి మాధవన్ మాట్లాడుతూ– ‘‘అమ్మ రెండేళ్ల నుంచి క్లీన్షేవ్ చేసుకోమని పోరుపెడుతోంది. నంబీ నారాయణ్ కోసం చేయాల్సి వచ్చింది. నంబీ యంగ్ ఎపిసోడ్‌ను ఫ్రాన్స్‌లో చిత్రీకరించనున్నాం’’ అన్నారు. -
నంబీ నారాయణ్‌కు పద్మపురస్కారమా? షాకింగ్..!
తిరువనంతపురం: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మాజీ శాస్త్రవేత్త నంబీ నారాయణ్‌కు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించడంపై కేరళ మాజీ డీజీపీ టీపీ సేన్‌కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశ అంతరిక్ష పరిశోధన రహస్యాలను విదేశాలకు అమ్మేందుకు ప్రయత్నించారంటూ 1990లో క్రయోజనిక్ నిపుణుడైన నంబీ నారాయణ్ అభియోగాలు ఎదుర్కొన్నారు. ఇస్రోను కుదిపేసిన ఈ గూఢచర్య కేసులో నంబీతోపాటు మరో శాస్త్రవేత్త అయిన డీ శశికుమార్ అరెస్టయ్యారు. మాల్దీవులకు చెందిన మహిళలతో ఉండగా వారిని 1994లో అరెస్టు చేశారు. ఈ కేసు నుంచి పూర్తిగా నంబీ నారాయణ్ బయటపడకముందే ఆయనకు పద్మ పురస్కారాన్ని ఎలా ప్రకటిస్తారని మాజీ డీజీపీ సేన్‌కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘ఏ ప్రాతిపదికన ఆయనకు అవార్డు ఇచ్చారో అర్థం కావడం లేదు. తేనెలో విషం కలిపిన చందంగా ఇది ఉంది. ఇస్రో గూఢచర్య కేసులో సుప్రీంకోర్టు ఏకసభ్య కమిషన్‌ను నియమించింది. ఈ కమిషన్ విచారణ జరుపుతున్న దశలో అతని పేరును అవార్డుకు ఎలా పరిగణనలోకి తీసుకున్నారు’ అని సేన్‌కుమార్ ప్రశ్నించారు. ఆయన పేరును ప్రతిపాదించిన వ్యక్తులు మున్ముందు దీనిపై వివరణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. నిజాయితీపరుడైన ఐపీఎస్‌గా పేరొందిన సేన్‌కుమార్ మూడేళ్ల కిందట డీజీపీ పదవి నుంచి తనను పినరయి విజయన్ ప్రభుత్వం తొలగిస్తే.. దీనిపై సుప్రీంకోర్టులో పోరాడి పదవిని తిరిగిపొందారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. ‘నంబీ నారాయణ్ దేశానికి చేసిన సేవలేమిటి? ఆయనో మామూలు శాస్త్రవేత్త. ఇస్రో నుంచి స్వయంగా తప్పుకున్నాడు. ఆయనకు బదులు ఓ యువ శాస్త్రవేత్తకు ఈ పురస్కారం అందజేసి ఉంటే నేను సంతోషించి ఉండేవాడిని’ అని అన్నారు. ఇస్రో గూఢచర్యం కేసును ఇప్పటికీ సరిగ్గా దర్యాప్తు చేయలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు తనకు పద్మభూషణ్ పురస్కారం దక్కడంపై నంబీ నారాయణ్ సంతోషం వ్యక్తం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలు బూటకమని, తాను అమాయకుడినని చాటడానికి ఈ పురస్కారమే నిదర్శనమన్నారు. -
కనుక్కోండి చూద్దాం
... అనేది మీ ముందున్న సవాల్. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత సంఘటనల ఆధారంగా ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. నారాయణన్ పాత్రలో మాధవన్ నటిస్తున్నారు. ఈ సినిమా కోసం కంప్లీట్‌గా నారాయణన్ లుక్‌లోకి మారిపోయారాయన. ఇక్కడున్న ఫొటోని షేర్ చేసి, ఎవరో కనిపెట్టగలరా? అంటూ తన నయా లుక్‌ను విడుదల చేశారు మాధవన్. అచ్చంగా నంబి నారాయణన్‌లానే మౌల్డ్ అయ్యారు కదూ. ఈ చిత్రానికి అనంత మహదేవన్‌తో పాటు మాధవన్ కూడా దర్శకుడిగా చేయాలనుకున్నారు. అయితే మహదేవన్ తప్పుకోవడంతో ఇప్పుడు పూర్తి స్థాయి దర్శకత్వ బాధ్యతలు చేపడుతున్నారు. ఈ సినిమాను సమ్మర్లో విడుదల చేయాలనుకుంటున్నారు. -
రీల్ సైంటిస్ట్.. రియల్ సైంటిస్ట్
ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలలో బయోపిక్‌ల సీజన్ నడుస్తోంది. సినీ రాజకీయా క్రీడా ప్రముఖుల జీవిత కథల నేపథ్యంలో పలు భాషల్లో సినిమాలు రూపొందుతున్నాయి. ఈ లిస్ట్‌లో ఓ సైంటిస్ట్ కూడా చేరబోతున్నాడు.ఆర్ మాధవన్ స్వయంగా దర్శకత్వం వహిస్తూ నటిస్తున్న సినిమా రాకెట్రీ. ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం మాధవన్ చూపిస్తున్న డెడికేషన్ అందరిని విస్మయానికి గురిచేస్తుంది. ఇప్పటికే తన లుక్కు సంబంధించిన అప్డేట్స్తో ఆకట్టుకుంటున్న మాధవన్ తాజాగా తన ఫైనల్ లుక్‌ను రివీల్ చేశాడు. అచ్చు నంబి నారాయణన్‌లా మారిపోయాడు మాధవన్. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాను తెలుగు, తమిళ, ఇంగ్లీష్, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. -
సోలో డైరెక్టర్‌గా..
నంబీ నారాయణ్ బయోపిక్కు అనంత్ మహాదేవన్‌తో పాటు ఓ దర్శకుడిగా వ్యవహరిస్తున్నట్టు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు మాధవన్. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్‌కు పూర్తి స్థాయి డైరెక్టర్‌గా వ్యవహరించి సినిమాను పూర్తి చేస్తారట. ఇస్రో శాస్త్రవేత్త నంబీ నారాయణ్ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘రాకెట్రీ : ది నంబీ ఎఫెక్ట్’. ‘‘అనంత్ అద్భుతమైన ఫిల్మ్ మేకర్. కొన్ని అనివార్య కారణలతో దర్శకుడు అనంత్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఈ సినిమాను నేను డైరెక్ట్ చేయనున్నాను’’ అని పేర్కొన్నారు మాధవన్. ఈ సినిమాలో మాధవన్ సరసన సిమ్రాన్ హీరోయిన్గా కనిపించనున్నారు. సమ్మర్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. -
సైంటిస్ట్‌తో జోడీ
సినిమాల ఎంపికలో కథానాయిక సిమ్రాన్ స్పీడ్ పెంచినట్లు తెలుస్తోంది. గతేడాది ‘సీమరాజా’ అనే తమిళ సినిమాలో విలన్‌గా నటించారామె. ఈ ఏడాది రజనీకాంత్ హీరోగా నటించిన ‘పేట’ చిత్రంలో ఒక కథానాయికగా ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఇప్పుడు ఆమె మాధవన్ సరసన నటించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితం ఆధారంగా ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో మాధవన్ హీరోగా నటిస్తున్నారు. అనంత్ మహాదేవన్, ఆర్. మాధవన్ దర్శకులు. ఈ సినిమాలో సిమ్రాన్ కథానాయికగా నటించబోతున్నారని తాజా కోలీవుడ్ టాక్. తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా సమ్మర్లో విడుదల కానుంది. -
రెండేళ్లు... పద్నాలుగు గంటలు
కదలకుండా కుర్చీలో ఐదు గంటలకు మించి కూర్చోవాలంటే ఎవరైనా కాస్త ఇబ్బంది పడాల్సిందే. అలాంటిది ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ సినిమాలోని క్యారెక్టర్ కోసం హీరో మాధవన్ దాదాపు 14 గంటలు మేకప్‌తో అలాగే కుర్చీలో కూర్చుండిపోయారట. ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితం ఆధారంగా తమిళం, హిందీ, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాలో మాధవన్ హీరోగా నటిస్తున్నారు. అంతేకాదు ఒక దర్శకుడు కూడా. అనంత మహాదేవన్ మరో దర్శకుడు. ‘‘నంబి నారాయణన్ పాత్ర కోసం రెండేళ్లు కష్టపడ్డాం. ఇప్పుడు ఈ సినిమాలోని నా పాత్ర లుక్ కోసం కుర్చీలో పద్నాలుగు గంటలు కూర్చుండిపోవాల్సి వచ్చింది’’ అని పేర్కొన్నారు మాధవన్. ఈ సినిమా సమ్మర్లో విడుదల కానుంది. ‘సవ్యసాచి’ సినిమాతో తెలుగులో డైరెక్ట్ చిత్రం చేసిన మాధవన్ నెక్ట్స్ ‘వస్తాడు నా రాజు’ ఫేమ్ హేమంత్ మధుకర్ దర్శకత్వంలో మరో తెలుగు సినిమాలో హీరోగా నటించనున్నారు. అనుష్క, అంజలి, షాలినీ పాండే ప్రధానపాత్రల్లో కనిపిస్తారు. మార్చిలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది. -
కొత్త లుక్
ఇస్రోకి (ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్) చెందిన ప్రముఖ శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’. టైటిల్ రోల్లో మాధవన్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన మేకోవర్ పనుల్లో బీజీగా ఉన్నారాయన. ఈ మేకోవర్‌కు చెందిన ఓ వీడియోను మాధవన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘నా క్యారెక్టర్‌కు చెందిన కొత్త లుక్ కోసం రెడీ అవుతున్నాను. చాలా ఎగై్జటింగ్‌గా ఉంది’’ అని పేర్కొన్నారు. కాగా అనంత్ మహాదేవన్‌తో పాటు హీరో మాధవన్ కూడా ఈ చిత్రానికి దర్శకత్వం వహించనుండటం విశేషం. ఈ చిత్రాన్ని సమ్మర్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సినిమా కాకుండా మాధవన్, అనుష్క ప్రధాన తారలుగా ‘సైలెన్స్’ అనే కొత్త చిత్రం వచ్చే ఏడాది ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. -
ఈసారి వినిపిస్తా!
‘సవ్యసాచి’తో తొలిసారి స్ట్రయిట్ తెలుగు చిత్రంలో తెలుగు ప్రేక్షకులను పలకరించారు మాధవన్. ఈ చిత్రంలో మాధవన్ పోషించిన నెగటివ్ పాత్రకు మంచి అభినందనలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం మాధవన్ ‘రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్’ అనే చిత్రంలో యాక్ట్ చేస్తున్నారు. శాస్త్రవేత్త నంబీ నారాయణ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని అనంత్ మహదేవ్‌తో కలసి దర్శకత్వ బాధ్యతలు కూడా చేపడుతున్నారు మాధవన్. ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో తెరకెక్కుతోంది. ఈ చిత్రం తెలుగు వెర్షన్‌కు మాధవన్ సొంతంగా డబ్బింగ్ చెప్పుకోనున్నారు. ‘‘సవ్య సాచి’ సినిమాలో పాత్రకు డబ్బింగ్ చెప్పాలనుకున్నా అనివార్య కారణాల వల్ల కుదరలేదు. ఈ సినిమా చేస్తున్నప్పుడు నా సినిమాలను ఫాలో అయ్యేవాళ్లు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఉన్నారని తెలుసుకున్నాను. అందుకే ‘రాకెట్రీ’ సినిమాలో నా గొంతునే వినిపిస్తాను’’ అని మాధవన్ పేర్కొన్నారు. -
కొత్త జాబ్
‘రాకెట్రీ : ది నంబీ ఎఫెక్ట్’... మాధవన్ లేటెస్ట్ సినిమా. ఇస్రో శాస్త్రవేత్త నంబీ నారాయణ్ జీవితం ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో మాధవన్ టైటిల్ రోల్ చేస్తున్నారు. నటుడిగానే కాదు.. ఈ సినిమాకి దర్శకుడిగానూ బాధ్యతలు చేపట్టారు. ఇక నంబీ నారాయణ్ గురించి చెప్పాలంటే.. విదేశీ గూఢచారి అంటూ ఆయనపై 1994లో కేసులు నమోదయ్యాయి. చాలా ఏళ్లు పోరాడిన తర్వాత ఆయన ‘నిర్దోషి’ అనే తీర్పు వచ్చింది. ఆ విధంగా జీవితంలో పెద్ద సవాల్‌ని ఎదుర్కొన్న నారాయణ్ పాత్ర చేయడం మంచి సవాల్‌లా భావిస్తున్నారు మాధవన్. ఈ చిత్రం టీజర్‌ను బుధవారం రిలీజ్ చేశారు. అనంత మహదేవన్‌తో కలసి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు మాధవన్. తమిళ, తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. -
‘రాకెట్రీ : ది నంబి ఎఫెక్ట్’
ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలలో బయోపిక్‌ల సీజన్ నడుస్తోంది. సినీ రాజకీయా క్రీడా ప్రముఖుల జీవిత కథల నేపథ్యంలో పలు భాషల్లో సినిమాలు రూపొందుతున్నాయి. తాజాగా ఈ లిస్ట్‌లో ఓ సైంటిస్ట్ కూడా చేరబోతున్నాడు. ప్రస్తుతం ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా రాకెట్రీ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో టైటిల్ రోల్లో బహు భాష నటుడు మాధవన్ కనిపించనున్నాడు. తమిళ దర్శకుడు అనంత మహదేవన్‌తో కలిసి మాధవన్ స్వయంగా దర్శకత్వం వహిస్తున్నాడు. నంబి నారాయణ్ జీవితంలోని మూడు ప్రధాన కోణాలని బయోపిక్‌లో చూపించనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. తెలుగు, తమిళ, ఇంగ్లీష్, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను 2019 సమ్మర్‌కు రిలీజ్ చేయనున్నారు. రాకెట్రీ తెలుగు టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి