Rocketry The Nambi Effect Movie Story: Nambi Narayanan Real Life Story In Telugu - Sakshi
Sakshi News home page

ఉత్తమ చిత్రంగా ‘రాకెట్రీ: శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు.. 50 రోజులు జైల్లో నరకం.. నంబి నారాయణన్‌ రియల్‌ స్టోరీ

Published Thu, Jun 30 2022 1:44 PM | Last Updated on Thu, Jun 30 2022 3:57 PM

Rocketry: The Nambi Effect: Nambi Narayanan Life Story In Telugu - Sakshi

1994 నవంబర్‌ 30.. అప్పటి వరకు ఆయన దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్త. యావత్‌ భారత్‌ ఆయనపై ప్రశంసలు జల్లు కురిపించింది. ఆయన కనిపెట్టిన ‘వికాస్‌’ ఇంజన్‌ అద్భుతమైనదని ప్రపంచమంతా కొనియాడింది. కానీ ఒకే ఒక ఘటనతో ఆయన జీవితం తలకిందులైపోయింది. దేశం కోసం అహర్నిశలు శ్రమించిన ఆయనను ‘దేశద్రోహి’ అన్నారు. చేయని తప్పుకు 50 రోజులు జైలులో పెట్టి నరకం చూపించారు. చివరకు నిర్థోషిగా బయటకు రావడమే కాకుండా.. దేశ మూడో అ‍త్యున్నత పురస్కారమైన ‘పద్మభూషణ్‌’ అందుకున్నారు. ఆయనే  భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్‌. జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలను చవిచూసిన నంబి నారాయణన్‌ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌’. విలక్షణ నటుడు మాధవన్‌ స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జులై 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా నంబి నారాయణన్‌ గురించి..

నాసా ఆఫర్‌ని సున్నితంగా తిరస్కరించి..
నంబి నారాయణన్‌ మధ్య తరగతి కుటుంబానికి చెందినవారు. 1941 డిసెంబర్‌ 12న తమిళనాడులో జన్మించారు. ఆయన తల్లిదంద్రులు కొబ్బరి పీచు వ్యాపారం చేసేవారు. ఐదుగురి బాలికల తర్వాత ఆయన పుట్టాడు. ఇంట్లో అందరికంటే చిన్నవాడైన నారాయణన్‌.. చదువులో మాత్రం బాగా రాణించేవాడు. ఇంజనీరింగ్‌ పూర్తి చేశాక.. కొంతకాలం స్థానికంగా ఉండే చక్కెర కర్మాగారంలో పనిచేశారు. 1966లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)లో చేరారు. అంచెలంచెలుగా ఎదుగుతూ.. అమెరికాలోని  ప్రిన్స్‌టన్ యూనివర్సీటీలో రాకెట్ ప్రొపల్షన్ సిస్టమ్స్ చదివేందుకు స్కాలర్‌షిప్ పొందారు.


 1966లో నంబి నారాయణన్‌

నాసాలో ఉద్యోగ అవకాశం లభించినా.. దేశం కోసం సున్నితంగా తిరస్కరించి తిరిగి ఇస్రోలో చేరారు. అక్కడ  విక్రమ్ సారాబాయి, సతీష్ ధావన్, అబ్దుల్ కలాం లాంటి ప్రఖ్యాత శాస్త్రవేత్తలతో కలిసి పనిచేశారు. స్వదేశీ రాకెట్లను అభివృద్ది చేసే ప్రాజెక్ట్‌లో నారాయణన్‌ కీలక పాత్ర పోషించారు. ప్యూయల్‌ టెక్నాలజీని ఇస్రోకు అందించాలనుకున్నాడు. ఆ ఆలోచనల నుంచి పుట్టిందే క్రయోజెనిక్‌ ఇంజిన్స్‌. ఈ టెక్నాలజీ అప్పట్లో మనకు అందుబాటులో లేదు. దీంతో రష్యాతో రూ.235 కోట్ల ఒప్పందం కుదుర్చుకొని ఈ టెక్నాలజీని దిగుమతి చేసుకోవాలనుకున్నారు. ఈమేరకు సంప్రదింపులు కూడా పూర్తయ్యాయి. ఆ సమయంలోనే ఊహించని పరిణామం చోటు చేసుకుంది. చేయని తప్పుకు నంబి నారాయణన్‌ని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

అసలేం జరిగింది?
1994 నవంబర్ 30న నంబిని కేరళ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అంతకు నెల రోజుల ముందు వీసా గడువు ముగిసిన తర్వాత కూడా భారత్‌లోనే ఉన్నారంటూ మాల్దీవులకు చెందిన మహిళ మరియమ్ రషీదా,  ఫయూజియ్యా హసన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో ఆ మహిళలిద్దరు భారత రాకెట్‌ సాంకేతిక విషయాలను పాకిస్తాన్‌కు చేరవేస్తున్నారని తేలింది. అంతేకాదు వీరికి ఇస్త్రోలో పని చేస్తున్న శాస్త్రవేత్తలు సహకరిస్తున్నారని మీడియాతో వార్తలు వచ్చాయి. ఆ మహిళలు వేసిన వలలో నంబి నారాయణన్‌ కూడా ఉన్నారని కేరళ పోలీసులు అభియోగాలు మోపారు. దేశద్రోహం కేసు కింద అరెస్ట్‌ చేసి 50 రోజులు జైల్లో పెట్టి విచారణ పేరుతో నరకం చూపించారు. దేశం గర్వించదగ్గ సైంటిస్ట్‌ అని కొనియాడిన మీడియానే ఆయన్ను ‘దేశద్రోహి’గా చూపించింది. గూఢచారి, దేశద్రోహి అంటూ అనేకమంది ఆయనను నిందించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తే ఆయన ఇంటిపై దాడి చేశారు. 

న్యాయమే గెలిచింది
దేశం కోసం నాసా ఆఫర్‌ని తిరస్కరించిన నంబి నారాయణన్‌కు.. అసలు తనని ఎందుకు అరెస్ట్‌ చేశారో కూడా మొదట్లో అర్థం కాలేదు. పోలీసులు ఎంత హింసించిన నేరం ఒప్పుకోలేదు. అరెస్టయిన నెల రోజుల తర్వాత ఈ కేసు కేరళ ఇంటలిజెన్స్‌ బ్యూరో నుంచి సీబీఐకు బదిలీ అయింది. 1995 జనవరి 19న ఆయనకు బెయిల్‌ వచ్చింది. సీబీఐ విచారణలో నంబి నారాయణన్‌ ఎలాంటి తప్పు చేయలేదని తేలింది.

సీబీఐ తమ నివేదికను 1996 ఏప్రిల్‌లో కేరళ హైకోర్టుకు సమర్పించింది. ఇస్రోకు చెందిన సమాచారం పాకిస్తాన్‌కు వెళ్లినట్లు ఎక్కడ ఆధారాలు లేకపోవడంతో నంబి నారాయణన్‌తో పాటు మరో ఐదుగురికి కోర్టు  క్లీన్‌చిట్‌ ఇచ్చింది. దీంతో నంబి నారాయణన్‌ తిరిగి ఇస్రోలో చేరారు. సీబీఐ ఈ కేసును మూసివేసినా.. అప్పటి కేరళ ప్రభుత్వం మళ్లీ తెరిచేందుకు ప్రయత్నించింది. ఈ కేసుని మళ్లీ విచారించాలని కోరుతూ..1998లో సుప్రీకోర్టు మెట్లు ఎక్కింది. కానీ  దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ కేసును తిరస్కరించింది. 

తనపై అక్రమంగా కేసును బనాయించి, వేధించిన కేరళ ప్రభుత్వంపై డాక్టర్ నారాయణన్ కేసు వేశారు. నారాయణన్‌కు రూ.50 లక్షల రూపాయలు పరిహారంగా చెల్లించాలని సుప్రీంకోర్టు 2018లో ఆదేశించింది. అంతేకాదు తప్పుడు కేసు బనాయించడంపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేసింది. తన తప్పును తెలుసుకున్న కేరళ ప్రభుత్వం కోర్టు ఆదేశించిన పరిహారానికి అదనంగా రూ.1.3 కోట్లు అదనంగా ఇస్తామని 2019లో ప్రకటించింది. 2019లో భారత ప్రభుత్వం నారాయణన్‌ని ‘పద్మభూషణ్‌’తో సత్కరించింది. నారాయణన్‌పై కుట్ర పన్నిందెవరనే విషయాలు ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నాయి. గుఢచార్యం కేసు వెనుక అమెరికా హస్తం ఉందని  కేరళ హైకోర్టు ఎదుట నారాయణన్‌ అనుమానం వ్యక్తం చేశారు. 

- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement