సాక్షి, హైదరాబాద్: వివాహానికి పూర్వం సమంతకు టాలీవుడ్ స్టైల్ క్వీన్ అని పేరుండేది. సిటీలో ఏ వేడుకకు హాజరైనా చూపులన్నీ తన ఆహార్యంపైనే ఉండేలా వైవిధ్యభరితమైన ఫ్యాషన్లకు ప్రాణం పోసేవారామె. తన నిశ్చితార్థానికి సైతం తన లవ్‌స్టోరీని చిత్రించిన వైవిధ్యభరితమైన చీరను డిజైన్ చేయించడం ద్వారా సమంత తన ఫ్యాషన్ క్వీన్ బిరుదును సార్థకం చేసుకున్న సంగతి తెలిసిందే. అంతగా ఫ్యాషన్‌ను ప్రేమించే సెలబ్రిటీ.. స్వయంగా ఒక ఫ్యాషన్ లేబుల్‌ని ప్రకటించడం సిటీ ఫ్యాషన్‌కు కొత్త ఊపునిచ్చింది. (ఇది నా డ్రీమ్ ప్రాజెక్టు: సమంత)
టాలీవుడ్ నటి సమంత సిటీలోని ఫ్యాషన్ రంగానికి ఒక్కసారిగా నిద్రమత్తు వదిలించారు. కొన్ని నెలలుగా లాక్‌డౌన్ దెబ్బకు సద్దుమణిగిన ఫ్యాషన్ సందడికి ఆమె మరోసారి ఉత్తేజం ఇచ్చారు. తానే స్వయంగా ఒక ఫ్యాషన్ బ్రాండ్‌ను ప్రకటించడం ద్వారా దక్షిణాది తారల్లో ఎవరూ సాధించని ఘనత దక్కించుకోవడంతో పాటు సిటీ ఫ్యాషన్ రంగానికి పునరుత్తేజం ఇచ్చారు.
అందుబాటులో.. నా ఫ్యాషన్..
ఈ లేబుల్ ప్రారంభం అనేది కొంత కాలంగా తను కంటున్న కల అంటున్నారు సమంత. అందుకే సాకి తన బిడ్డ లాంటిదన్నారామె. ఫ్యాషన్ పట్ల తనకున్న ప్రేమకు, తన జీవన ప్రయాణానికి ఇది ప్రతీక అంటూ ఆమె అభివర్ణించారు. తన ఫ్యాషన్ లేబుల్ ప్రతి ఒక్కరికీ అందుబాటులో, ఆకట్టుకునేలా ఉండాలనేదే తన లక్ష్యమన్నారు. ప్రతి డిజైన్ తయారీలో తన భాగస్వామ్యం తప్పక ఉంటుందన్నారు.
డిజైనర్లతో టీమ్..
తన లేబుల్‌ని పక్కాగా ఫ్యాషన్‌కి చిరునామాగా మలచే క్రమంలో పలువురు ఫ్యాషన్ డిజైనర్లతో సమంత ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారని సమాచారం. సాకిని ఆమె ప్రకటింక ముందు నుంచే ఆమెతో కలిసి పనిచేసేందుకు నగర డిజైనర్లు పలువురు ఆసక్తి చూపుతూ ఆమెతో సంప్రదింపులకు యత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన డిజైనింగ్ టీమ్‌లోకి సమంత ఎవరిని ఎంపిక చేసుకుంటారో, ఎటువంటి అద్భుతాలు సృష్టిస్తారనేది సిటీలోని ఫ్యాషన్ ప్రియులకు ఆసక్తి కలిగించే అంశంగా మారింది.
బాలీవుడ్ తారల బ్రాండ్స్‌కు సిటీలో క్రేజ్..
ఆన్‌లైన్ షాపింగ్ పోర్టల్ మింత్రతో కలిసి బాలీవుడ్ నటి దీపికా పదుకునే తన ప్రైవేట్ లేబుల్ ఆల్ ఎబౌట్ యు ను 2015లో ప్రారంభించారు. ప్యారిస్‌కు చెందిన కార్లిన్ అనే డిజైన్ కంపెనీ ద్వారా ఆమె తన డిజైనింగ్ స్కిల్స్‌కి సానబెట్టుకున్నారు. హైదరాబాద్‌తో పాటు పలు నగరాల్లో అమ్మాయిల్ని ఈ బ్రాండ్ ఎత్నిక్, వెస్ట్రన్ వేర్ బాగా ఆకట్టుకుంది.
నుష్.. అంటున్న అనుష్క
యంగ్ బాలీవుడ్ బ్యూటీ అనుష్కశర్మ కూడా నుష్ పేరిట ఒక లేబుల్‌ని మూడేళ్ల క్రితం సుదితీ ఇండస్ట్రీస్‌తో కలిసి లాంచ్ చేశారు. జాకెట్స్, డెనిమ్స్ వంటి స్టైల్స్‌లో ఈ లేబుల్‌కి అమ్మాయిల్లో ఒక గుర్తింపు వచ్చింది.
టేకినిన్‌కు ఆ‘క్రితి’..
బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో కూడా చిరపరిచితమైన నటి క్రితి సనన్ కూడా టేకినిన్ లేబుల్‌ని నాలుగేళ్ల క్రితం ప్రారంభించారు. నగరానికి చెందిన యుఎస్‌పీఎల్ ఫ్యాషన కంపెనీ నిర్వాహకురాలు అంజనారెడ్డితో కలిసి ఆమె ఈ లేబుల్‌కు రూపకల్పన చేశారు. ఇదే కంపేనీతో కలిసి శ్రద్ధా కపూర్ కూడా ఇమారా ప్రారంభించారు. అలాగే జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా ఇదే బ్రాండ్‌తో చేతులు కలిపారు.
రేసన్ తెచ్చిన సోనమ్
తన సోదరి, నిర్మాత రియాతో కలిసి సోనమ్ రేసన్ లేబుల్‌ని 2017లో షాపర్స్‌స్టాప్‌తో కలిసి ఈ లేబుల్‌ని ప్రారంభించారు. చాలా చిత్రాచిత్రమైన ఫ్యాషన్ వస్త్రాలతో షాకింగ్ క్వీన్‌గా అబ్బురపరచే సోనమ్.. అదే స్టైల్‌లో దీన్ని లాంచ్ చేశారు. అన్ని రకాల శరీర ఆకృతి కలిగిన వారూ ఫ్యాషనబుల్‌గా కనిపించాలనే లక్ష్యంతో ఈ బ్రాండ్ రూపుదిద్దుకుంది. ఇండోవెస్ట్రన్ అవుట్ ఫిట్‌కి పేరొందింది.
ముగ్గురు తారల ముచ్చటైన లేబుల్
బాలీవుడ్ తారలు సుశానె ఖాన్, మలైకా అరోరా, బిపాసా బసులు ముగ్గురితో కలిసి ప్రీతా సుక్తాంకర్ ది లేబుల్ లైఫ్ పేరిట 8 సంవత్సరాల క్రితమే ఒక క్లోతింగ్ లైఫ్‌స్టైల్ బ్రాండ్‌ను ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment