బుల్లితెర నటి సంభావన సేత్ తండ్రి ఇటీవలే కోవిడ్‌తో కన్నుమూశారు. అతడికి ఆక్సిజన్ లెవల్స్ తక్కువగా ఉన్నప్పటికీ వైద్యులు పట్టించుకోలేదని, వారి నిర్లక్ష్యం వల్లే ఆయన చనిపోయాడని నటి ఆరోపణలు చేసింది. తన తండ్రిని అన్యాయంగా పొట్టనపెట్టుకున్నారని మండిపడింది. దీనికి కారణమైన వారిని వదిలిపెట్టనని హెచ్చరించింది. ఈ మేరకు ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో రిలీజ్ చేసింది.
"అందరు డాక్టర్లు దేవుళ్లు కాదు.. వారిలో మనలాంటి వాళ్లను హత్య చేసే రాక్షసులు కూడా ఉన్నారు. వాళ్లే నా తండ్రిని చంపేశారు. తండ్రిని కోల్పోవడం అనేది నా జీవితంలోనే ఓ భయంకరమైన పరిస్థితి. కానీ నేను ఇప్పుడు ధైర్యంగా ముందడుగు వేస్తాను. నా తండ్రి నేర్పిన బాటలోనే న్యాయం కోసం పోరాడుతాను. ఈ పోరాటంలో నేను గెలిచినా గెలవకపోయినా కొందరిని కచ్చితంగా బయటకు లాగి వారి నిజ స్వరూపాన్ని చూపిస్తాను. నా తండ్రి చావుకు కారణమైన జైపూర్ గోల్డెన్ ఆస్పత్రికి లీగల్ నోటీసులు పంపాం. మీలో చాలామంది ఇలాంటి కష్టాన్ని ఎదుర్కొనే ఉంటారు. కానీ అనేక కారణాల వల్ల వాటిని ఎదురించలేకపోవచ్చు. ఇప్పుడు మాత్రం నా పోరాటానికి మద్దతు తెలపండి" అని అభ్యర్థించింది.
మే 8న సంభావన ఈ వీడియో రికార్డ్ చేసింది. ఇందులో తను అడిగే ప్రశ్నలకు సిబ్బంది నిర్లిప్తంగా సమాధానాలు చెప్పడం స్పష్టంగా కనిపిస్తోంది. ఆక్సిజన్ లెవల్స్ కేవలం 55 మాత్రమే ఉన్నా ఆక్సిజన్ సాచురేషన్ బాగుందని సిబ్బంది చెప్పారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇక ఈ వీడియో తీసిన రెండు గంటలకే తన తండ్రి తుది శ్వాస విడిచాడంటూ సంభావన ఉద్వేగానికి లోనైంది.
Comments
Please login to add a commentAdd a comment