
భారతీయ సినీ పరిశ్రమలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (ఐఫా) (IIFA Awards-2024) అవార్డుల కార్యక్రమం తాజాగా అబుదాబిలో జరిగింది. ఆ వేదికపై దర్శకులు రామ్‌గోపాల్ వర్మ గురించి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్‌లో ఆయన తెరకెక్కించిన యానిమల్ సినిమాకు తొమ్మిది విభాగాల్లో ఐఫా నుంచి అవార్డులు అందాయి. దీంతో ఈ సినిమాను తెరకెక్కించిన సందీప్‌పై భారీగా ప్రశంసలు అందాయి.

యానిమల్ చిత్రానికి గాను ఉత్తమ చిత్రం, ఉత్తమ ఎడిటింగ్ విభాగాల్లో అవార్డులను సందీప్ రెడ్డి వంగా అందుకున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మకు సందీప్ థ్యాంక్స్ చెప్పారు. రామ్‍గోపాల్ వర్మ సినిమాలు చూసి తాను ఎడిటింగ్ నేర్చుకున్నానని అబుదాబి వేదికగా సందీప్ అన్నారు. వర్మ సినిమాలకు తాను పని చేయకపోయినప్పటికీ ఆయన నుంచి చాలా నేర్చుకున్నానని చెప్పారు. ఈ క్రమంలోనే 'థాంక్యూ ఆర్జీవీ సర్' అని సందీప్ చెప్పారు. ఇప్పటికే పలు వేదికల మీద ఆర్జీవీ పట్ల తనకున్న గౌరవాన్ని సందీప్ చాటుకున్నారు. తాజాగా మరోసారి తన అభిమానాన్ని ఇలా పంచుకున్నారు.
సందీప్ రెడ్డి వంగా మాట్లాడిన మాటలను రామ్‌గోపాల్ వర్మ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. తనదైన స్టైల్లో ఆయన ఇలా స్పందించారు. 'సార్.. సందీప్ రెడ్డి వంగా గారు. ఇప్పుడు మీ నుంచి నేను సినిమా తీయడం నేర్చుకోవాలని అనుకుంటున్నాను. మియా మాల్కోవా, దావూద్ ఇబ్రహీం, అయాన్ రాండ్‌తో పాటు మీపై ఒట్టేసి చెబుతున్నా.' అని ఆర్టీవీ ట్వీట్ చేశారు.

యానిమల్ చిత్రం 2023లో విడుదలైంది. సందీప్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రంలో రణ్‍వీర్ కపూర్, రష్మిక మందన్న, అనిల్ కపూర్, బాబీ డియోల్, తృప్తి డిమ్రి నటించారు. రూ. 100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 917 కోట్లు రాబట్టి రికార్డ్స్ క్రియేట్ చేసింది. యానిమల్ చిత్రానికి దర్శకుడిగానే కాకుండా ఎడిటర్‌గానూ సందీప్ తన ప్రతిభను చూపించారు. అలా బాలీవుడ్‌లో తన సత్తా ఏంటో చూపించారు. ఈ సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో స్పిరిట్ చిత్రానికి సందీప్ దర్శకత్వం వహించనున్నారు. 2026లో ఈ సినిమా విడుదల కానుంది.
Sirrrrrrr @imvangasandeep I now want to LEARN film making from YOU and I SWEAR this on Mia Malkova, Dawood Ibrahim ,Ayn Rand and YOU pic.twitter.com/sY0MtdJ7KG
— Ram Gopal Varma (@RGVzoomin) September 30, 2024