సంధ్య థియేటర్ ఘటనకు హీరో అల్లు అర్జున్ (Allu Arjun)ను బాధ్యుడిని చేయడం తప్పని ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ (Boney Kapoor) అన్నారు. ఆ ఘటనలో అల్లు అర్జున్‌ను తప్పుపట్టాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. ఓ ఇంటర్వ్యూలో బోనీ కపూర్ మాట్లాడుతూ.. హీరోల సినిమాను ఫస్ట్ డే చూసేందుకు ప్రేక్షకులు ఎగబడుతుంటారు. ఒకసారేమైందంటే హీరో అజిత్ సినిమా తెల్లవారుజామున ఒంటి గంటకు థియేటర్‌లో ప్రదర్శించారు. ఆ సమయంలో కూడా థియేటర్ బయట దాదాపు 25 వేల మంది ఉన్నారు.
థియేటర్ బయట వేలమంది జనం
సినిమా చూసి బయటకు వచ్చేసరికి 3.30 నుంచి నాలుగైంది. అప్పుడు కూడా జనాలు అలాగే అక్కడే నిల్చున్నారు. అజిత్ సినిమా అనే కాదు, రజనీకాంత్, చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేశ్‌బాబు.. ఇలా స్టార్స్ సినిమాల విషయంలోనూ ఇదే జరుగుతోంది. ఆరోజు సంధ్య థియేటర్ వద్ద అభిమాని మృతి చెందిన ఘటనకు అల్లు అర్జున్‌ను బాధ్యుడిని చేయడం సరికాదు. సినిమా చూసేందుకు పెద్ద ఎత్తున వచ్చిన జనాల వల్లే ఆ విషాదం జరిగింది అని బోనీ కపూర్ పేర్కొన్నారు.
తొక్కిసలాట.. మహిళ మృతి
కాగా డిసెంబర్ 4న హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో పుష్ప 2 ప్రీమియర్స్ ఏర్పాటు చేశారు. సినిమా చూసేందుకు అల్లు అర్జున్ తన కుటుంబాన్ని తీసుకుని వెళ్లాడు. అయితే బన్నీ రాకతో జనం అతడిని చూసేందుకు ఎగబడగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు గత నెలలో అల్లు అర్జున్‌ను అరెస్టు చేశారు. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిలుతో బన్నీ మరునాడే జైలు నుంచి విడుదలయ్యాడు. ఈ కేసులో పుష్ప నిర్మాతలు, థియేటర్ యాజమాన్యాన్ని సైతం పోలీసులు విచారిస్తున్నారు.
పుష్ప 2 సినిమా..
పుష్ప 2 సినిమా విషయానికి వస్తే 2021లో వచ్చిన పుష్ప మూవీకి ఇది సీక్వెల్‌గా తెరకెక్కింది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించారు. దేవి శ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా ఇప్పటివరకు రూ.1760 కోట్లమేర రాబట్టింది.
Comments
Please login to add a commentAdd a comment