టైటిల్: శపథం
నటీనటులు: అజ్మల్ అమీర్,మానస రాధాకృష్ణన్,ధనంజయ్ ప్రభునే,సురభి ప్రభావతి తదితరులు
నిర్మాణ సంస్థ: రామదూత క్రియేషన్స్
నిర్మాత: దాసరి కిరణ్ కుమార్
రచన-దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ
సంగీతం: ఆనంద్
సినిమాటోగ్రఫీ: సాజీశ్ రాజేంద్రన్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ ‘వ్యూహం’, ‘శపథం’ అనే సినిమాలను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ‘వ్యూహం’ గతవారం(మార్చి 2) థియేటర్స్‌లో రిలీజై మంచి టాక్‌ని సంపాదించుకుంది. ఇక దానికి కొనసాగింపుగా ‘శపథం’అనే మూవీని తీసుకొచ్చారు. అయితే ఈ చిత్రాన్ని థియేటర్స్‌లో కాకుండా ఏపీ ఫైబర్ నెట్‌తో పాటు పలు ఓటీటీల్లో వెబ్ సిరీస్‌గా రిలీజ్ చేస్తున్నారు. అసలు శపథం కథ ఏంటి? ఈ చిత్రం ద్వారా ఆర్జీవి బయటపెట్టిన నిజాలు ఏంటి? సినిమా ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.
కథ ఏంటంటే..?
‘వ్యూహం’ ముగింపు నుంచి శపథం మూవీ ప్రారంభం అవుతుంది.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి((అజ్మల్ అమీర్)) ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏపీలో చోటు చేసుకున్న పరిణామాలు ఏంటి? ఆయన చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలను ఆపడానికి చంద్రబాబు(ధనంజయ్ ప్రభునే) చేసిన కుట్రలు ఏంటి? ఓటమి తర్వాత పవన్ కల్యాణ్(చింటూ) పరిస్థితి ఎలా ఉంది? 2014 ఎన్నికల్లో చంద్రబాబును తిట్టిన పవన్.. 2024 ఎన్నికల్లో మళ్లీ టీడీపీతో ఎందుకు జత కట్టాడు? సొంత ప్రయోజనాల కోసం మీడియాని, వ్యవస్థలను చంద్రబాబు ఎలా వాడుకున్నాడు? ప్రజలకు, ప్రభుత్వానికి వారధిలా నిలిచిన వాలంటరీ వ్యవస్థను అభాసు పాలు చేసేందుకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ చేసిన కుట్రలేంటి? విగ్రహాలు, దేవాలయాలపై దాడులు చేయిందెవరు? దాని వెనుక ఉన్న వారి వ్యూహం ఏంటి? స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? అనేది తెలియాలంటే శపథం చూడాల్సిందే.
(చదవండి: 'వ్యూహం' సినిమా రివ్యూ)
ఎలా ఉందంటే..
‘వ్యూహం’, ‘శపథం’ సినిమాల ప్రారంభానికి ముందే.. ‘ఇది బయోపిక్ కాదు …బయో పిక్ కన్నా లోతైన రియల్ పిక్. బయో పిక్ లో అయినా అబద్దాలు ఉండొచ్చు కానీ ,రియల్ పిక్ లో నూటికి నూరు పాళ్ళు నిజాలే ఉంటాయి’ అని ఆర్జీవీ చెప్పారు. చెప్పినట్లే పచ్చి నిజాలను తెరపై చూపించాడు వర్మ. చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌ల కుట్రలను తిప్పి కొడుతూ సీఎం జగన్ ఎలా ప్రజా పాలన కొనసాగిస్తున్నాడు అనేది ఇందులో చూపించాడు దర్శకుడు. 2019 నుంచి 2023 వరకు ఏపీలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలను.. దాని వెనుక ఉన్న కారణాలను కళ్లకు కట్టినట్లు చూపించాడు. ప్రజల మనసులో ఏముందో, వాళ్లు ఏం చర్చింకుంటున్నారో దాన్నే తెరపై చూపించే ప్రయత్నం చేశాడు.
సీఎం జగన్ తీసుకొచ్చిన ఇంగ్లీష్ మీడియం.. వాలంటరీ వ్యవస్థ కారణంగా పేద ప్రజలను జరుగుతున్న ప్రయోజనాలను.. వాటిని అడ్డుకునేందుకు చంద్రబాబు, పవన్ చేసిన కుట్రలను ధైర్యంగా తెరపై చూపిస్తూ వారితో ఓ ఆట ఆడుకున్నాడు. వర్మ మాత్రమే ఇలా తీయగలడు అనేంతలా చిత్రాన్ని తీర్చి దిద్డాడు. సినిమా చూస్తున్నంతసేపు నిజంగా అప్పుడు ఇలానే జరిగింది కదా? దాని వెనుక ఇంత పెద్ద ప్లాన్ ఉందా? అనే అనుమానం ప్రతి ఒక్కరికి కలుగుతుంది.
అలాగే అమరావతి రాజధాని పేరుతో చంద్రబాబు పన్నిన కుట్రని కూడా ఉన్నది ఉన్నట్లుగా, సామాన్యులకు సైతం అర్థమయ్యేలా చూపించాడు వర్మ. స్వప్రయోజనం కోసం చంద్రబాబు ఎంతకైనా తెగిస్తాడనేది అందరు అనుకునే మాట. అదే విషయాన్ని వర్మ కూడా తన సినిమా ద్వారా చెప్పాడు. అవసరానికి పవన్ ఎలా వాడుకున్నాడు? ఇప్పుడు మళ్లీ జనసేనతో పొత్తు ఎందుకు పెట్టుకున్నాడు? చంద్రబాబు చేతిలో పవన్ పావులా ఎలా మారాడు ? అనే నిజాన్ని కామెడీ వేలో చూపించి నవ్వించాడు. సినిమాల్లో పవన్ హీరో అయినా.. రాజకీయాల్లో మాత్రం పెద్ద జోకర్ అని తనదైన శైలీలో చూపించాడు వర్మ. పవన్‌కి సంబంధించిన సీన్లు వచ్చిన ప్రతిసారి పగలబడి నవ్వడం గ్యారెంటీ? ఆయన తెరపై కనిపించిన ప్రతిసారి పీకే..పీకే.. అంటూ వచ్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరింత నవ్విస్తుంది.
ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా కొన్ని సీరియస్ అంశాలను కూడా కామెడీగా చూపించాడు వర్మ. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టడాన్ని వ్యతిరేకించినప్పుడు.. ‘మరి మీ పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియంలోనే చదువుకుంటున్నారు కదా?’ అని మీడియా పవన్ ప్రశ్నించడం..దానికి ఆయన ఇచ్చిన సమాధానం..తెరపై చూస్తే నవ్వొస్తుంది. బయటకు వచ్చి ఆలోచిస్తే.. నిజమే కదా? అనిపిస్తుంది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ వెనుక ఉన్న అసలు కారణాన్ని చూపిస్తూ.. సీఎం జగన్‌పై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు.
‘ఎవరు నమ్మినా నమ్మకపోయినా.. బాబుని అరెస్ట్ చేయించడం కక్ష సాధింపు కాదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జనం నాకిచ్చిన స్థానానికి న్యాయం చేయడానికే. నేను అధికారం కోరుకున్నది ప్రజలకు మంచి చేయడానికే. అదే చేస్తున్నా. ఇది నాకు నేను చేసుకున్న శపథం’ అంటూ సీఎం జగన్ చెప్పే మాటలు ఆలోచింపజేస్తాయి. అలాగే చివరల్లో చంద్రబాబు గురించి ‘వెయ్యి తప్పులు చేశావ్..’అంటూ ఆర్జీవీ పాడిన పాట అయితే సినిమాకే హైలెట్.
ఎవరెలా చేశారంటే..
ఈ సినిమా మొత్తం వైఎస్ జగన్, చంద్రబాబు, పవన్ కల్యాణ్ పాత్రల చుట్టే తిరుగుతుంది. సీఎం వైఎస్ జగన్ పాత్రలో అజ్మల్ అమీర్ ఒదిగిపోయాడు. తన నటనతో తొలి షాట్ నుంచే తెర మీద వైఎస్ జగన్‌నే చూస్తున్నామన్నంతగా ప్రేక్షకుడిని కథలో లీనం చేశాడు.వైఎస్ భారతి గారి పాత్రలో మానస రాధాకృష్ణన్ ఒదిగిపోయారు. వ్యూహంతో పోలిస్తే ఇందులో ఆమెకు ఎక్కువ సన్నివేశాలు ఉన్నాయి.
ఇక చంద్రబాబు పాత్రలో ధనంజయ్ ప్రభునే పరకాయ ప్రవేశం చేశాడు. చంద్రబాబు మ్యానరిజానికి ఏ మాత్రం తగ్గకుండా ప్రేక్షకులను ఆయన మెప్పించాడు. పవన్ కల్యాణ్ పాత్రకి చింటు న్యాయం చేశాడు. ఇక లోకేష్ పాత్రకి ఎక్కువగా డైలాగ్స్ లేకున్నా.. ఉన్న ఒకటి రెండు సీన్లు నవ్వులు పూయిస్తాయి. ముఖ్యంగా లోకేష్‌ని ఉద్దేశిస్తూ ‘పులి కడుపున పులే పుడుతుంది’ అని చంద్రబాబు అనగానే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌గా పిల్లి సౌండ్ రావడం.. డైట్ అంటూ చిప్స్..గ్లాసుల కొద్ది పాలు తాగడం.. ఇవన్నీ నవ్విస్తాయి.
సాకేంతిక పరంగా సినిమా బాగుంది. ఆనంద్ నేపథ్య సంగీతం, పాటలు బాగున్నాయి. ఆర్జీవీ పాడిన ‘వెయ్యి తప్పులు చేశావ్’ పాట సినిమాకే హైలెట్. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. ఓవరాల్‌గా ‘శపథం’ సినిమా వైఎస్సార్‌సీపీ అభిమానులలో జోష్‌ని నింపుతూ.. సామాన్యులను ఆలోచింపజేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment