‘‘ఈ మధ్య కొన్ని చోట్ల గమనించాను. ఏంటి సార్... కోవిడ్ తర్వాత ప్రేక్షకులు సినిమాలకు రావడం లేదంటున్నారు. మంచి సినిమాలు ఉన్నప్పుడు తప్పకుండా వస్తారు సార్. వస్తూనే ఉంటారు. మనమే అప్పుడప్పుడు మిస్ అవుతుంటాం. ఈసారి మిస్ అయ్యేదే లేదు. డిస్ట్రిబ్యూటర్స్‌కి, ఎగ్జిబిటర్స్‌కు ఏదైనా మాట చెప్పాల్సి వస్తే మనదో సామెత ఉంది. ‘కలిసొచ్చే కాలం వస్తే... నడిచొచ్చే సినిమా వస్తుంది’’ అంటారు కదా. సినిమా పట్ల ఎంతో నమ్మకంగా ఉన్నాం. ఆగస్టు 29.. పోతారు.. మొత్తం పోతారు... థియేటర్స్‌కు పోతారు’’ అని నాని అన్నారు. నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సరిపోదా శనివారం’. ఈ చిత్రంలో ప్రియాంకా అరుళ్ మోహన్ కథానాయికగా నటించారు. డీవీవీ దానయ్య, దాసరి కల్యాణ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న రిలీజ్ కానుంది.
ఈ సందర్భంగా శనివారం జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నాని మాట్లాడుతూ– ‘‘దయా పాత్రను మేం ఊహించినదానికన్నా ఎక్కువగా చేశారు ఏస్‌జే సూర్యగారు. దానయ్యగారు పాజిటివ్ పర్సన్ . అందుకే మంచి కథలు ఆయన్ను వెతుక్కుంటూ వస్తాయి. నిర్మాత కల్యాణ్‌కు ఈ సినిమా ట్రైనింగ్ గ్రౌండ్ అనుకోవచ్చు. వివేక్ ఆత్రేయ శివతాండవం ఏంటో థియేటర్స్‌లో చూస్తారు. ఈ సినిమా టీమ్ అందరికీ థ్యాంక్స్’’ అని చెప్పారు.
వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ– ‘‘అంటే.. సుందరానికీ!’ సినిమా రిలీజ్ డే రోజు నేను కన్‌ఫ్యూజ్ అయ్యాను. కొందరు ల్యాగ్ అన్నారు. మరికొందరు బాగుంది అన్నారు. అయితే నానీగారు నాకు మళ్లీ చాన్స్ ఇచ్చారు. చాన్స్ అన్నది చాలా చిన్న పదం. నానీగారు నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చారు’’ అని తెలిపారు.
డీవీవీ దానయ్య మాట్లాడుతూ– ‘‘కథల ఎంపికలో నానీగారు నంబర్ వన్ . కథ నచ్చితే కొత్త దర్శకులకూ అవకాశం ఇస్తారు. నానీగారితో సినిమా చేస్తే నిర్మాతకు టెన్షన్ ఉండదు. సాధారణంగా నేను ఏ సినిమా వేదికపైనా ఇంత మాట్లాడలేదు. సినిమా మాట్లాడిస్తుంది. ‘సరిపోదా శనివారం’ సినిమా చూశాను. పెద్ద బ్లాక్‌బస్టర్ అవుతుంది. ఈ సినిమాతో వివేక్ ఆత్రేయ ఓ పెద్ద కమర్షియల్ డైరెక్టర్ అవుతాడు’’ అని చెప్పారు.
‘‘సరిపోదా శనివారం’ కాన్సెప్ట్ నచ్చి ఓకే చెప్పాను. తెలుగు ప్రేక్షకుల కోసం సొంత డబ్బింగ్ చెప్పాను’’ అని వెల్లడించారు ఎస్‌జే సూర్య. ‘‘సూర్య (నాని పాత్ర), చారులత (ప్రియాంక పాత్ర)లను గుర్తు పెట్టుకుంటారు’’ అని తెలిపారు ప్రియాంకా అరుళ్. ‘‘నాని కష్టపడి స్టార్ అయ్యాడు. ఆస్కార్ వేదికపై మన ఖ్యాతి చాటారు డీవీవీ దానయ్య, రాజమౌళిగార్లు’’ అని పేర్కొన్నారు నటుడు అలీ. అతిథులుగా పాల్గొన్న దర్శకులు దేవా కట్టా ప్రశాంత్ వర్మ , శైలేష్ కొలను, శ్రీకాంత్ ఓదెల, శౌర్యువ్ ఈ సినిమా విజయాన్ని ఆకాంక్షించారు. నాని తండ్రి రాంబాబు, సంగీత దర్శకుడు జేక్స్, కెమెరామేన్ మురళి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment