
సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజాగా నటించిన చిత్రం 'సర్కారు వారి పాట'. పరశురాం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎం బీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లో నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంటలు నిర్మించారు. ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ మే 12 ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు రెడీ అవుతోంది. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీకి పనిచేసిన ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్బంగా ఆయన పంచుకున్న మూవీ విశేషాలు ఇలా ఉన్నాయి.
⇔ పరుశురాం గారు మొదట కథ చెప్పినపుడు ఇది పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ అనిపించింది. చాలా పెద్ద యాక్షన్, ఎంటర్ టైనర్ అవుతుందని డైరెక్టర్ గారికి అప్పుడే చెప్పా. తర్వాత పని చేయడం మొదలుపెట్టా.
⇔ మహేశ్ బాబు గారితో నాకు ఇది 7వ సినిమా. ఆయన సెట్స్‌లో చాలా సరదాగా ఉంటారు. అదే సమయంలో టెక్నిషియన్ నుంచి అవుట్ పుట్ కూడా అద్భుతంగా రాబట్టుకుంటారు. సాంగ్స్, యాక్షన్ సీక్వెన్స్ కి సంబధించిన అన్నీ విషయాలను చర్చిస్తారు. ఈ సినిమాలో మహేశ్ బాబు లుక్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. ఆయన సెట్‌లో డాన్స్ చేస్తుంటే విజువల్ ట్రీట్‌లా ఉంటుంది.
⇔ 'సర్కారు వారి పాట' బ్యాంక్ నేపథ్యంలో సాగుతుంది. దీని కోసం మూడు బ్యాంకులు అవసరమయ్యాయి. అందులో ఒకటి యాబై ఏళ్ళ క్రితం బ్యాంకు ఎలా వుంటుంది ? అనే దానిపై స్టడీ చేసి, వింటేజ్ లుక్‌లో డిజైన్ చేశాం. దీనికి సంబంధించిన సెట్‌ను అన్నపూర్ణ స్టూడియో వేశాం. ఇది ఫ్లాష్ బ్యాక్‌లో వస్తుంది. అలాగే మరో రెండు మోడ్రన్ బ్యాంక్ సెట్స్ వేశాం.
⇔ భారీ సినిమా ఇది. ఆర్ట్ వైజ్ చాలా రోజులు పని చేశాం. బ్యాంకు కాకుండా దాదాపు ఎనిమిది సెట్స్ వేశాం. అలాగే ఒక వీధి సెట్ కూడా ఉంది. మొదట గోవాలో చేద్దామని అనుకున్నాం. అయితే కొన్ని ప్రాక్టికల్ సమస్యలు వచ్చాయి. మళ్ళీ హైదరాబాద్‌లోనే ఒక బేసిక్ కాలనీ తీసుకుని దాన్ని వైజాగ్ వీధిలా కథకు తగ్గట్టు డిజైన్ చేశాం. ఇలా ఒకటి కాదు.. చాలా వరకూ సెట్స్‌లోనే షూటింగ్ జరిగింది. చాలా ఇంటీరియర్, ఎక్స్ టీరియర్ డిజైన్ చేశాం.
⇔ దర్శకుడు కథ చెప్పిన తర్వాత ఆర్ట్ డైరెక్టర్ ఒక ఇమాజినేషన్ చేసుకుంటారు. ఆ కథ ఎలాంటి బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందో చెప్పినప్పుడే ఒక ఊహా ఏర్పడుతుంది. దర్శకులు ఒక విజన్‌తో వస్తారు. దానికి ఆర్ట్ డైరెక్టర్ విజన్ తోడవుతుంది. ఈ విజన్‌నే కెమరా మ్యాన్ క్యాప్చర్ చేయాలి.
⇔ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలకు సినిమా అంటే చాలా ప్యాషన్. ఎక్కడ రాజీ పడకుండా చిత్రాల్ని నిర్మిస్తారు. కథకు ఏం అవసరమో అది సమకూర్చడానికి ఎక్కడా కాంప్రమైజ్ అవ్వరు. సినిమా గ్రాండ్‌గా రావాలనే తపన మైత్రీ మూవీ మేకర్స్‌లో ఉంటుంది.