ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే చిత్రాలు చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్న వాటిలో హిందీ చిత్రం ‘సావి’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.
ఓ సినిమా కథ బావుంటే ఆ కథకి ఏ భాషా హద్దు కాదు. అలాగే ఏ దేశమూ సరిహద్దు కాదు. దానికి సరైన ఉదాహరణ ‘సావి’ సినిమా. ‘సావి’ గురించి చెప్పుకోవాలంటే ఈ సినిమాకి మూలం తెలుసుకోవడం చాలా అవసరం. 2008లో ఫ్రెంచ్ దర్శకుడు ఫ్రెడ్ కవాయే ‘ఎనీథింగ్ ఫర్ హర్’ అనే సినిమా నిర్మించారు. ఆ సినిమాను 8 మిలియన్ డాలర్లు పెట్టి తీస్తే, ఆరు మిలియన్ డాలర్ల రాబడితో సరిపెట్టుకుంది.
అదే మూల కథతో సరిగ్గా రెండేళ్ళ తరువాత... అంటే 2010లో రస్సెల్ క్రోవ్ వంటి సీనియర్ నటుడుతో హాలీవుడ్ దర్శకుడు పాల్ హాగిస్ ‘ది నెక్ట్స్ త్రీ డేస్’ అనే సినిమా నిర్మించారు. ఈ సినిమాను 30 మిలియన్ డాలర్లు పెట్టి తీస్తే దాదాపు 67 మిలియన్ డాలర్లు సాధించి, బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ కథ ఫ్రెంచ్‌లో ప్రారంభమై హాలీవుడ్ చుట్టి 14 ఏళ్ళ తరువాత బాలీవుడ్‌కి ‘సావి’గా అడుగుపెట్టింది. అంతలా ఈ కథలో ఏముందో చూద్దాం.
అందమైన ఓ చిన్న కుటుంబం. భార్య, భర్త, ఓ చిన్న పిల్లాడు. వీరే కథకు పాత్రధారులు. అనుకోని ఓ ఘటన వల్ల ఒక హత్య కేసులో ఇరుక్కుని జీవిత ఖైదీగా శిక్ష పడుతుంది భార్యకు. దేశం కాని దేశంలో తన బిడ్డకు తల్లిని దూరం చేయలేక ఆ భర్త శిక్ష అనుభవిస్తున్న తన భార్యను జైలు నుండి తప్పించి కుటుంబమంతా ఎలా వేరే దేశం చేరుకుంటారు అనేదే కథ.
‘సావి’లో పెద్ద మార్పేంటంటే భార్య బదులు భర్తను ఖైదీగా మార్చారు. పైగా ఇండియా సెంటిమెంట్ ప్రకారం సావి అంటే సావిత్రి అని దర్శకుడు అభినయ్ డియో సినిమా ఆఖర్లో చెప్పిస్తాడు. సినిమా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. అనిల్ కపూర్ ప్రత్యేక పాత్రలో నటించిన ఈ సినిమాలో దివ్య ఖోస్లా టైటిల్ రోల్ చేశారు. థ్రిల్లింగ్ జోనర్ ఇష్టపడే వాళ్ళకు ‘సావి’ మంచి ఛాయిస్. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమ్ అవుతోంది.
– ఇంటూరు హరికృష్ణ
Comments
Please login to add a commentAdd a comment