బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ తన సినిమాలపై దృష్టి పెట్టనున్నారు. ఈ డిసెంబరులో తన ప్రాజెక్టులను తిరిగి ప్రారంభించాలని భావిస్తున్నారు. షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అక్టోబర్ 3న అరెస్ట్ చేసింది. దీంతో షారుఖ్ తన మూవీ షూట్‌లకు బ్రేక్ ఇచ్చాడు. కుమారుడి అరెస్టుతో అతని కుటుంబంతో కలిసి ముంబై తిరిగి రాక తప్పలేదు.
అనేక పరిణామల తర్వాత అక్టోబర్ 28న ఆర్యన్‌కు బెయిల్ రావడంతో షారుఖ్ ఊపిరిపీల్చుకున్నాడు. దీంతో మళ్లీ బాద్‌షా పనిలో నిమగ్నమయ్యేముందు కుటుంబంతో కొంత సమయం గడపాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఆర్యన్ కోసం షారుఖ్ కొన్ని మార్పులు చేశారు. ఆర్యన్‌కు ఒక నమ్మదగిన బాడీగార్డ్‌ను నియమించాలను చూస్తున్నారని సమాచారం. చాలా కాలం పాటు తనతో ఉండి, తన కుటుంబంలో వ్యక్తిగా భావించే షారుఖ్ బాడీగార్డ్ రవి సింగ్‌ను ఆర్యన్‌తో ముంబైలో ఉండమని అడిగారట. ప్రస్తుతం తన కోసం కొత్త బాడీగార్డును నియమించుకోవాలని చూస్తున్నారట షారుఖ్.
బెయిల్ షరతుల ప్రకారం ఆర్యన్ ప్రతి శుక్రవారం ఎన్‌సీబీ కార్యాలయంలో హాజరవ్వాలి. కేసు దర్యాప్తు చేస్తున్న కొత్త బృందంతో తరచుగా సమన్లు రావొచ్చు. ఇలాంటి సందర్భంలో ఆర్యన్ వెంట షారుఖ్‌కు తెలిసిన, నమ్మదగిన వ్యక్తి ఉండటం ఉత్తమమని భావించారు. ముందుగా షారుఖ్ పఠాన్ సినిమా షెడ్యూల్ కోసం స్పెయిన్ వెళ్లాల్సి ఉంది. అన్ని సక్రమంగా జరిగితే వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభమవుతుంది. షారుఖ్ ఖాన్ పఠాన్‌లో జాన్ అబ్రహం, దీపికా పదుకొనేతో కలిసి నటించనున్నారు. అలాగే అట్లీ తదుపరి చిత్రం కూడా చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment