సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారిని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ దర్శనం సమయంలో హీరో శర్వానంద్, హీరోయిన్ రష్మిక మందన్నా స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం వారిని ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందచేశారు. దర్శనాంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. 'అభిమానులకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. కాగా.. శర్వానంద్, రష్మిక 'ఆడవాళ్లు మీకు జోహార్లు' అనే చిత్రంలో నటిస్తున్నారు. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన పూర్తివిశేషాలు వెల్లడిస్తామన్నారు.
ఆదివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, నిడదవోలు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే శ్రీనివాసుల నాయుడు, తెదేపా ఎమ్మెల్యేలు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, శివసేన పార్టీ ప్రధాన కార్యదర్శి మిలింద్ నవదేకర్ వేరు వేరుగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం చేయగా, ఆలయ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. స్వామి వారి దర్శనాంతరం ఆలయ వెలుపల నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాసుల నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. దసరా సందర్భంగా స్వామి వారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన కార్యక్రమాలు విజయవంతం కావాలని స్వామి వారిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రల ప్రజలంతా సుఖసంతోషాలతో దసరా వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటూ ప్రజలందరికి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment