పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటనతో దేశ ప్రజలను ఉలికిపాటుకు గురిచేసింది. పనిచేస్తున్న చోటే అత్యంత దారణంగా ఆమెపై అఘాయిత్యం జరిగిన తీరు అందరినీ బాధించింది. ఈ ఘటనపై ఇప్పటికీ నిరసనలు కొనసాగుతున్నాయి. అయితే, తాజాగా ఈ ఘటన గురించి ప్రస్తావిస్తూ ప్రముఖ సింగర్ శ్రేయా ఘోషల్ పాడిన పాట అందరినీ కదిలిస్తుంది.
వైద్యురాలిపై హత్యాచార ఘటన జరిగినట్లు వార్తలు వచ్చిన సమయంలో శ్రేయా ఘోషల్ నిర్వహించాలనుకున్న మ్యూజిక్ కాన్సర్ట్ ప్రోగ్రామ్‌ను వాయిదా వేసుకుంది. దేశంలో ఇంతటి ఘోరం జరిగితే.. తాను ఎలా ఈ కార్యక్రమానికి వెళ్లగలను అంటూ ఆమె భావోద్వేగానికి నాడు లోనైంది. ఈ ఘటన వల్ల తన వెన్నులో వణుకు పుట్టిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రూరమైన చర్య తనపై చాలా ప్రభావం చూపిందని గతంలో ఆమె పర్కొన్నారు.
అయితే, తాజాగా ఆమె కాన్సర్ట్‌ను నిర్వహించారు. ఆల్ హార్ట్స్ టూర్‌లో భాగంగా కోల్‌కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరిగింది. కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై ఒక ఎమోషనల్ సాంగ్‌ను అక్కడ శ్రేయా ఘోషల్ పాడింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. 'గాయపడిన నా శరీర భాధను నేడు మీరందరూ వింటున్నారు' అంటూ సాగే ఈ పాటను ఆమె చాలా ఉద్వేగంతో ఆలపించారు. ఇలాంటి ఘటన సమయంలో బాధితురాలి ఆవేదన ఎలా ఉంటుందో పాట రూపంలో శ్రేయా తెలిపింది. అయితే, ఈ పాటకు ఎవరూ చప్పట్లు కొట్టొదని ప్రేక్షకులను కోరింది. ఆమె పాటకు అక్కడున్న వారందరూ కూడా ఉద్విగ్నం అయ్యారు. ఆమెకు న్యాయం జరగాలి అంటూ స్టేడియం మొత్తం నినాదాలు చేశారు.
మహిళల భద్రతపై శ్రేయా ఘోషల్ పాడిన పాటతో నెటిజన్లతో పాటు తృణముల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కునాల్ ఘోష్ ప్రశంసిస్తూ ఒక పోస్ట్ కూడా పెట్టారు. వైద్యురాలి ఘటనపై శ్రేయా ఘోషల్ చాలా బాధపడ్డారని ఆయన తెలిపారు. హత్యాచారాల ఘటనలపై నిరసనలు అవసరమని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment