
శ్రేయాస్ తల్పాడే.. 'ఇక్బాల్' సినిమాతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడీ నటుడు. మూగ క్రికెటర్‌గా అతడి పర్ఫామెన్స్‌కుగానూ జాతీయ అవార్డు సైతం వచ్చింది. నగేశ్ కుకునూర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా వచ్చి 16 ఏళ్లు దాటిపోయింది. కానీ శ్రేయాస్‌కు మళ్లీ అలాంటి స్ట్రాంగ్ పాత్రలో నటించే ఛాన్స్ ఇంతవరకు రానేలేదు. ఈ క్రమంలో ఆయన తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను పంచుకున్నాడు.
చాలాసార్లు స్నేహితులు కూడా తనను పక్కన పెట్టేసేవారని, ఆ సమయంలో ఎంతో కుమిలిపోయేవాడినని బాధపడ్డాడు. కానీ ఆ వెంటనే ఇక్బాల్ సినిమాలో చేసిన పాత్రను గుర్తు చేసుకుని తనను తాను ఓదార్చుకునేవాడినని చెప్పాడు. అమితాబ్ బచ్చన్‌లాంటి వారు కూడా ఇలాంటి కష్టాల కడలిని దాటినవారేనని, అలాంటివారితో పోలిస్తే తానెంత అని చెప్తున్నాడు. ఒత్తిడికి లోనైన ప్రతిసారి ఇక్బాల్ సినిమాను గుర్తుకు చేసుకునేవాడినన్నాడు. ప్రస్తుతం తనకు లభించిన స్థానానికి సంతోషంగానే ఉన్నానని, కానీ ఇప్పటికీ మంచి పాత్రల కోసం ఎదురు చూస్తున్నానని శ్రేయాస్‌పేర్కొన్నాడు.
ఇండస్ట్రీలో ఎవరూ నిజమైన స్నేహితులు కారని, ఎప్పటికప్పుడు అక్కడ సమీకరణాలు మారిపోతుంటాయని తెలిపాడు. ఏదో మాట వరసకు ఫ్రెండ్ అంటారే తప్ప, సినిమా తీసే సమయానికి మాత్రం మనల్ని దూరంగా ఉంచాలని చూస్తారని బాధపడ్డాడు. కొందరు నటులకైతే ఈగో ఓ రేంజ్‌లో ఉంటుందన్నాడు. వాళ్లకు తనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం అస్సలు ఇష్టముండదని తెలిపాడు. తన స్నేహితుల కోరిక మేరకు పనిగట్టుకుని కొన్ని సినిమాలు చేశానని, కానీ చివరకు వాళ్లు తనను ఒంటరిని చేసి సినిమాలు తీసుకుంటూ వెన్నుపోటు పొడిచారని బాధపడ్డాడు. ఇండస్ట్రీలో 90 శాతం మంది ఇలాంటి వారే ఉంటే, 10 శాతం మాత్రమే మనం ఎదుగుతుంటే సంతోషిస్తారని శ్రేయాస్ చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment