హరియాణా బీజేపీ నేత, నటి సోనాలి ఫోగట్ అనుమానాస్పద మృతిపై మిస్టరీ వీడటం లేదు.సోనాలి ఫోగట్(43) హఠాన్మరణం కాస్త హత్యగా నిర్ధారణ కావడం ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అసలు సోనాలి ఫోగట్ హత్య వెనుక ఎవరున్నారు? ఆస్తి కోసమే ఆమెను చంపాలనుకున్నారా వంటి కారణాలు ఇప్పుడు తెరమీదకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోనాలి ఫోగట్ కూతురు, ఆమె రూ 110కోట్ల విలువైన ఆస్తికి ఏకైక వారసురాలు యశోధర ప్రాణానికి కూడా ముప్పు ఉన్నట్లు ఆమె కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.
2016లో సోనాలి ఫోగట్ భర్త సంజయ్ ఫోగట్ కూడా అనుమానాస్పద రీతిలో చనిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సోనాలిని కూడా హత్య చేశారు. ఈ క్రమంలో ఆస్తి కోసం సోనాలి కూతురు యశోధరను కూడా హత్య చేయొచ్చని ఆమె కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం యశోధరకు కేవలం 15 సంవత్సరాలే. ఈ క్రమంలో ఆమె ప్రాణాలకు ముప్పు ఉన్న నేపథ్యంలో యశోధరను తిరిగి హాస్టల్‌కు కూడా పంపొద్దని కుటంబీకులు నిర్ణయించారు. ఇప్పటికే ఆమెకు భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
మరోవైపు తన తల్లి హత్య కేసును సీబీఐకి అప్పగించాలని యశోధర డిమాండ్ చేస్తుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..'నా తల్లిని పథకం ప్రకారమే హత్య చేశారని అనడంలో ఎలాంటి సందేహం లేదు. గోవాలో వారం రోజుల పాటు షూటింగ్ ఉందని అమ్మ నాతో చెప్పింది. మరి అలాంటప్పుడు రిసార్ట్‌ను కేవలం రెండు రోజులకే ఎందుకు బుక్ చేసినట్లు? పక్కా ప్లాన్‌తోనే హత్య చేశారు. అయినా ఇప్పటివరకు మా అమ్మ హత్యకు గల కారణాలు పోలీసులు నిర్ధారించలేదు. గోవా పోలీసుల దర్యాప్తుతో నేను సంతృప్తిగా లేను. దర్యాప్తుపై అనేక సందేహాలున్నాయి. అందుకే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతున్నాం' అని ఆమె పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment