సాక్షి, విజయవాడ: సినీ నటుడు, రియల్ హీరో సోనూసూద్ విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో భాగంగా బుధవారం సాయంత్రం విజయవాడకు చేరుకున్నారు. అనంతరం నేరుగా ఇంద్రకిలాద్రికి వెళ్లి కనక దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆ తరువాత ఆలయ అర్చకులు, అధికారులు ఆయనకు అమ్మవారి చిత్ర పటం, ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా సోనూ సూద్ మీడియాతో మాట్లాడుతూ.. దుర్గమ్మను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. కరోనా వల్ల ఎంతో మంది అనేక ఇబ్బందులు పడ్డారు. రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందాలని, అందరిని చల్లగా కాపాడాలని ఆ అమ్మవారిని కొరుకున్నా అని తెలిపారు.
కాగా కరోనా కాలంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి రియల్ హీరోగా మారారు సోనూసూద్. ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మందికి సాయం అందించి వారి పాలిట దేవుడిగా నిలిచారు. విద్య, వైద్యం, ఉపాధి ఇలా అనేక రకాలుగా సేవలు అందించారు. ఇక కరోనా సెకండ్ వేవ్ సమయంలో కూడా పెద్ద ఎత్తున ఆక్సిజన్ సిలెండర్‌లను సప్లై చేశారు. అంతేగాక ఇందుకోసం ఆయన ప్రత్యేకం ఫౌండేషన్ కూడా ప్రారంభించి దాని ద్వారా ప్రజల కోసం విరాళాలు సేకరించి గొప్ప మనసు చాటుకున్నారు. ప్రభుత్వాలు చేయాల్సిన పనులను సైతం సోనూ సూద్ తన బాధ్యత భావించిన లక్షలాదిమంది అవసరాలు తీర్చి అపర దాన కర్ణుడుగా కీర్తించబడుతున్నారు. దీంతో ఈ రీయల్ హీరోను నేరుగా చూసేందుకు విజయవాడకు ప్రజలు గుంపులుగా తరలివచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment