Sonusoodh
-
ఇటుకలు చేస్తున్న సోనుసూద్
-
Sonu Sood: నా సోదరి పంజాబ్ ఎన్నికల్లో పోటీ చేయనుంది
చంఢీఘర్: కరోనా కష్ట కాలంలో బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఆపన్నులను ఆదుకున్న విషయం తెలిసిందే. లాక్డౌన్ సమయంలో రైతులు, కూలీల కోసం ట్రైన్లు, బస్సులు ఏర్పాటు చేసి మరీ వారిని ఊర్లకు చేర్చారు. ఇప్పటికీ కూడా సోనూసూద్ తన ఫౌండేషన్ ద్వారా సహాయక కార్యక్రమాలు చేపడుతున్నారు. త్వరలో ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై ఇప్పటివరకు సోనూసూద్ స్వయంగా స్పందించలేదు. కానీ తాజాగా సోనూసూద్ తన సోదరి రాజకీయాల్లోకి రాబోతున్నట్లు ప్రకటించారు. సోనూసూద్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. తన సోదరి మాళవిక సూద్ వచ్చే ఏడాది జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలిపారు. చదవండి: అఖిలేశ్‌పై అమిత్ షా మాటల దాడి అయితే ఆమె ఏ పార్టీ తరఫున పోటీ చేస్తారనే విషయాన్ని వెల్లడించలేదు. ఇక సోనూ ఇటీవల పంజాబ్ సీఎం చరణ్‌జిత్ చన్నీతో భేటీ అయ్యారు. అదేవిధంగా సోనూసూద్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో కూడా సమావేశం అయ్యారు. ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన పాఠశాల విద్యార్థులకు సంబంధించిన ‘దేశ్ కా మెంటర్స్’ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నట్లు సోనూసూద్ పేర్కొన్నారు. అయితే ఆయన పలు పార్టీ నేతలు, సీఎంలను కలిసినప్పటికీ ప్రధానంగా తన ఫౌండేషన్‌కు రాజకీయలతో సంబంధం లేదన్నారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో భేటీ కావటం వల్ల ఆప్ తరఫున సోనూసూద్ పంజాబ్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారని వార్తలు వచ్చాయి. కానీ తమ మధ్య రాజకీయాలు చర్చకురాలేదని సోనూసూద్ స్పష్టం చేశారు. అయితే తాజాగా సోనూ తన సోదరి పంజాబ్ ఎన్నికల్లో పోటీ చేస్తుందని ప్రకటించడంతో.. ఆమె ఏ పార్టీ నుంచి బరిలోకి దిగుతారన్నది ప్రస్తుతం రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది. -
విజయవాడ: కనక దుర్గమ్మను దర్శించుకున్న సోనూసూద్
-
విజయవాడ కనక దుర్గమ్మను దర్శించుకున్న సోనూసూద్
సాక్షి, విజయవాడ: సినీ నటుడు, రియల్ హీరో సోనూసూద్ విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో భాగంగా బుధవారం సాయంత్రం విజయవాడకు చేరుకున్నారు. అనంతరం నేరుగా ఇంద్రకిలాద్రికి వెళ్లి కనక దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆ తరువాత ఆలయ అర్చకులు, అధికారులు ఆయనకు అమ్మవారి చిత్ర పటం, ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా సోనూ సూద్ మీడియాతో మాట్లాడుతూ.. దుర్గమ్మను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. కరోనా వల్ల ఎంతో మంది అనేక ఇబ్బందులు పడ్డారు. రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందాలని, అందరిని చల్లగా కాపాడాలని ఆ అమ్మవారిని కొరుకున్నా అని తెలిపారు. కాగా కరోనా కాలంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి రియల్ హీరోగా మారారు సోనూసూద్. ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మందికి సాయం అందించి వారి పాలిట దేవుడిగా నిలిచారు. విద్య, వైద్యం, ఉపాధి ఇలా అనేక రకాలుగా సేవలు అందించారు. ఇక కరోనా సెకండ్ వేవ్ సమయంలో కూడా పెద్ద ఎత్తున ఆక్సిజన్ సిలెండర్లను సప్లై చేశారు. అంతేగాక ఇందుకోసం ఆయన ప్రత్యేకం ఫౌండేషన్ కూడా ప్రారంభించి దాని ద్వారా ప్రజల కోసం విరాళాలు సేకరించి గొప్ప మనసు చాటుకున్నారు. ప్రభుత్వాలు చేయాల్సిన పనులను సైతం సోనూ సూద్ తన బాధ్యత భావించిన లక్షలాదిమంది అవసరాలు తీర్చి అపర దాన కర్ణుడుగా కీర్తించబడుతున్నారు. దీంతో ఈ రీయల్ హీరోను నేరుగా చూసేందుకు విజయవాడకు ప్రజలు గుంపులుగా తరలివచ్చారు. -
కరోనా కష్ట కాలంలో ఆదుకుంటున్న ఆపన్న హస్తాలు
కష్టం వచ్చినప్పుడే ధైర్యం కావాలి.. ధైర్యమే ఆలోచనను రేకెత్తిస్తుంది.. ఆలోచన పరిష్కార మార్గాలను చూపిస్తుంది.. సహాయమార్జించడం.. సహాయం అందించడం ఈ రెండూ ఆ మార్గాల్లోనివే!! పెద్ద విపత్తే వచ్చి పడింది.. ఆ రెండు అవసరాలకూ పరీక్ష పెడుతోంది.. కిందటి సారి ఇంచుమించు ఇదే సమయం, సందర్భంలో.. సొంతూళ్లకు కదిలివెళ్లిన పాదచారులకు అన్నం పెట్టి, సద్ది మూట ఇచ్చి, జేబుల్లో, కొంగు మూడిలో కొంత పైకం సర్ది, పిల్లలకు జోళ్లు, బట్టల జతలు పెట్టి, చేతిలో పళ్లు ఉంచి... దారెంట జాగ్రత్తలు చెప్పి సాగనంపిన మనసులు... బస్సులు మాట్లాడీ బాటసారులను బయలెల్లదీసిన మనుషులు.. ఇప్పుడూ కనిపిస్తున్నారు. కరోనాతో గడపదాటలేని కుటుంబాలు.. వీధి బహిష్కరణతో తలుపులు చాటేసుకున్న ఇళ్లు.. ఆక్సిజన్ అందక ఆగమాగం అవుతున్న జీవితాలు, వెంటిలెటర్ కోసం వెయిటింగ్ లిస్ట్‌లో ఆగిన బతుకులు.. బెడ్స్ దొరక్క బెంబేలెత్తుతున్న బంధువులు.. దొరికినా లక్షల్లో డబ్బు కట్టలేక.. మందుల్లేక.. ఉన్నా కొనే ఆర్థికపరిస్థితి సహకరించక.. మందులు, ఆసుపత్రి ఆగత్యంలేని.. బలవర్ధకమైన ఆహారం తినాల్సిన బాధితులు.. అన్నీ ఉన్నా వండుకునే శక్తిలేని పీడితులకు ఆపన్న హస్తం అందించే మనుషులు ఇప్పుడూ కనిపిస్తున్నారు. రియల్ హీరో రియల్ హీరో.. అనగానే సోనూ సూదే గుర్తొస్తాడు. కిందటేడు లాక్డౌన్ మొదలు ఇప్పటిదాకా అలుపు లేకుండా సేవలను అందిస్తున్నాడు. రియల్ హీరోగా కనిపిస్తున్నాడు. సామాన్యుడి నుంచి సెలబ్రటీస్ దాకా ఎవరికి కష్టం వచ్చినా సోనూ సూద్‌నే తలుచుకుంటున్నారు. ఇందుకు నిన్నమొన్నటి ఉదాహరణ.. 2021 ఐపీఎల్ రద్దు. ఇండియాలో చిక్కుకున్న విదేశీ ఆటగాళ్లను ఇంటికి చేర్చాలని ట్విట్టర్ వేదికగా సురేష్ రైనా సోనూసూద్‌ను కోరిన వెంటనే ‘ప్యాక్ యువర్ బాగ్స్’ అంటూ సంద్పించాడు సోనూ. ఇలా కరోనా కష్టకాలంలో సోనూ చేసిన సేవలు ఎన్నో! చిన్న పిల్లల చదువుకోసం స్మార్ట్ఫోనులు, నిరాశ్రయులకు ఆహారం, నిత్యావసర సరుకులు, బట్టలు.. ఎన్నని చెప్తాం స్వచ్ఛందంగా అతను చేస్తున్న పనులను! సెకండ్‌వేవ్‌లో ఆక్సిజన్ సిలిండర్స్‌ను విదేశాల నుంచి కొనుగోలు చేసి అవసరమైన వారికి పంపిస్తున్నాడు. ఇందుకు ఆయన తన ఆస్తులన్నింటిని అమ్ముకోగా, మరో పదికోట్ల ఆస్తులను తాకట్టు పెట్టాడు. ‘అర్థరాత్రి అపరాత్రి కాల్స్ వస్తూనే ఉన్నాయి. వీళ్లలో కనీసం కొంతమందికైనా ఆసుపత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్ అందించి వాళ్ల ప్రాణాలను కాపాడగలిగితే వంద కోట్ల సినిమా చేయడం కన్నా కొన్ని లక్షల రెట్లు ఎక్కువ సంతృప్తి మిగులుతుంది’ అంటాడు సోనూ సూద్. అన్నదాత.. నిహారిక రెడ్డి ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్. ప్రస్తుతం ఆమె ఇల్లు ఓ మెస్‌ను తలపిస్తోంది. కరోనా బారినపడి హోమ్ ఐసోలేషన్ లో ఉంటున్న వారి కోసం ఆ ఇంటి వంటిగది విరామెరుగక వండుతూనే ఉంది. హైదరాబాద్‌లోని శ్రీనగర్, బంజారా హిల్స్, యూసఫ్‌గూడ, జూబ్లీహిల్స్‌కు చెందిన సుమారు మూడు వందల పైగా మందికి ప్రతిరోజూ పౌష్టికాహారం అందించడానికి తానే స్వయంగా వండి వడ్డిస్తోంది నిహారిక. ఈ బాధ్యతలో ఆమె కుటుంబమంతా పాలుపంచుకుంటోంది. ఆమె పిల్లలు కూడా ఆటలు, పాటలు అన్నీ మానేసి వంటపనిలో నిమగ్నమయ్యారు. కూరలు తరగడం, వండిన వంటను ప్యాక్ చేయడంలో తల్లికి తోడ్పడుతున్నారు. ఇలా తయారైన వంటను నిహారిక సోదరుడు, డ్రైవర్ కలసి హోమ్ ఐసోలేషన్‌లో ఉంటోన్న వారికి అందిస్తున్నారు. ప్రొటీన్లు, ఇతర పోషక పదార్థాలు కలిగిన కూరలతోపాటు వెజిటేబుల్ సలాడ్, డ్రై ఫూట్స్ లడ్డూ కూడా ఉంటాయి మెనులో. హామ్ఐసోలేషన్లో ఉన్నవారు కరోనా పాజీటీవ్ రిపోర్ట్, ఇంటి చిరునామాను ఈ హెల్ప్‌లైన్ నెం. 9701821089కు పంపి, ఫోన్ చేస్తే .. ఆ చిరునామా వీళ్లు అందించగల దూరంలో ఉంటే ఆ తర్వాత రోజు నుంచే ఆ ఇంటికి వండిన ఆహారాన్ని పంపిస్తారు. కరోనాలో చదువు కోసం .. ఆటపాటలతో ఆనందంగా గడపాల్సిన బాల్యం ఆన్లైన్ క్లాసులకే అంకితమై పోయింది. ఈ ఆన్లైన్ క్లాసుల కోసం పిల్లలకు స్మార్ట్ ఫోన్లు తప్పనిసరయ్యాయి. తల్లిదండ్రులు లేని విద్యార్థులకు, ఉన్నా ఆర్థికంగా వెనకబడిన పిల్లల కోసం ఉచితంగా స్మార్ట్ఫోన్లు అందిస్తూ, అనాథశ్రయాల్లో గ్రూప్ ఆన్లైన్ కోర్సులను నిర్వహిస్తోంది ‘ప్యూర్ ఆర్ఫన్ అండ్ రూరల్ ఎడ్యూకేషన్’ అనే స్వస్థంచ సంస్థ. 2016లో గిరిజన ప్రాంత పిల్లల చదువు కోసం ప్రారంభమైన ఈ సంస్థ ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. మధ్యాహ్నభోజనం కోసమే బడికి వెళ్లే పిల్లలు కూడా ఉన్నారని తెలిసి.. పేద విద్యార్థులు, నిరాశ్రయులతోపాటు హోమ్ఐసోలేషన్లో ఉంటున్న కరోనా రోగులకూ ఉచితంగా ఆహారాన్ని అందిస్తోందీ సంస్థ. కరోనా వల్ల ఇబ్బంది పడిన వలస కూలీల కోసం ఈ సంస్థ బస్సులను ఏర్పాటు చేసి, సుమారు మూడు వేలమందికి పైగా కూలీలను వారి ఇళ్లకు చేర్చింది. వీరిలో నిండు గర్భీణీలూ ఉండటం గమనించి వారిని ఆసుపత్రిలో చేర్పించింది. ఈ కరోనా సమయంలో ఏదైనా సహాయం కావాలనుకునేవారు తమ హెల్ప్‌లైన్ నంబర్లు 7386120040, 7675940040 లకు ఫోన్ చేస్తే చాలు సహాయం అందించడానికి సిద్ధం అంటున్నారు ఈ సంస్థ సభ్యులు. నిరాశ్రయులకు ఆసరా.. నిత్యావసరాల సరఫరా అనాథల కోసం దశాబ్దం కిందట మొదలైన ‘దిశా ఫౌండేషన్’ ప్రస్తుతం తన సేవలను కరోనా బాధితుల కోసమూ విస్తరించింది. ప్రతి రోజూ వందల సంఖ్యలో మందులు, మాస్కులతో పాటు అవసరమైన వారికి నిత్యావసర సరుకులు, నిరాశ్రయులకు అహారం అందిస్తున్నారు. త్వరలోనే ఎల్బీ నగర్లో ఓ ఐసోలేషన్ సెంటర్‌నూ ఏర్పాటు చేయనుంది. వీటితోపాటు గుంటూరులోని క్యాన్సర్ ఆసుపత్రి దగ్గర నిత్యాన్నదాన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తోంది. అందరూ ఒక్కటై ఇలాంటి సమయంలో నేను, నాది.. నా అనే ఆలోచనలు పోయి, మనం అనే భావన రావాలి. పది మందికి సాయం చేయలేకపోయనా కనీసం ఒక్కరికైనా సాయం చేయాలి. ప్రస్తుత పరిస్థితుల్లో పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా అందరూ ఒక్కటై సహాయ కార్యక్రమాలు చేపట్టాలి. కరోనా నుంచి కాపాడుకునే చర్యలు తీసుకోవాలి. – సుస్మిత జగ్గి రెడ్డి దిశా ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ష్యాషన్ డిజైనర్. వృద్ధుల కోసం... కరోనా దాటికి రాలిపోతున్న వృద్ధులను చూసి చలించిపోయింది హిమజ. అందుకే వారి కోసం ఉచితంగా మందులు, ఆహారం పంపిణీ చే స్తోంది. అలా ఇప్పటి వరకు సుమారు పదిహేను వందల మందికిపైగా సహాయం అందించింది ఆమె. సేవా కార్యక్రమాలు ఆమెకు కొత్త కాదు. గత ఆరేళ్లుగా ఆనాథ పిల్లల కోసం కృషి చేస్తోంది. క్యాన్సర్ రోగులకు వైద్యసహాయంతో పాటు వారిలో మనోధైర్యాన్ని నింపేందుకు విగ్గులను అందిస్తోంది. కరోనా కష్టకాలంలో సేవలందిస్తోన్న మరికొన్ని హెల్ప్‌లైన్ నెంబర్లు.. ఎమ్మెల్సీ కవిత కార్యాలయం: 898569993 ఎల్హెచ్ఓ ర్యాపిడ్ రెస్పాన్స్ టీం: 8374303020, 8688919729 చదవండి: గాల్లోకి లేచిన కారు.. సీసీ కెమెరాలో దృశ్యాలు -
నా దృష్టిలో నాగలక్ష్మి అత్యంత ధనవంతురాలు: సోనూసూద్
ముంబై: టాలీవుడ్ సినిమాల్లో విలన్ పాత్రలతో పరిచయమైన సోనూసూద్ లాక్డౌన్ మొదలు నుంచి ప్రజలకు సహాయం చేస్తూ నిజ జీవితంలో హిరోగా మారాడు. సోనూ ముంబైలో ఉన్నప్పటికీ దేశంలో ఎక్కడ ఎటువంటి సహాయం కావాలన్న తక్షణమే ఆపన్న హస్తం అందించడంలో సోనూ ముందుంటున్నాడు. ఒక్కోసారి ప్రభుత్వాలకు కూడా సాధ్యం కాని కొన్ని పనులను ఆయన క్షణాల్లో చేసి చూపెడుతున్నారు. సేవ చేయాలంటే కావాల్సింది చేయాలనే శ్రద్ధ అని నిరూపిస్తున్న సోనూసూద్ తాజాగా ఒక మహిళను ట్విటర్లో ప్రశంసించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంధురాలైన నాగలక్ష్మి అనే మహిళ ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారు. ఆమెకు ప్రభుత్వం నుంచి మూడు వేల రూపాయల దివ్యాంగుల పెన్షన్ లభిస్తోంది. ఇటీవల ఆమె తన ఐదు నెలల పెన్షన్ 15 వేల రూపాయలను సోనూసూద్ ఫౌండేషన్‌కు విరాళంగా ఇచ్చింది. ఈ విషయం తెలియడంతో సోనూసూద్ ఆమెను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో.. ఆంధ్రప్రదేశ్ లోని వరికుంటపాడు అనే ఒక చిన్న గ్రామానికి చెందిన బొడ్డు నాగలక్ష్మి సోనూసూద్ ఫౌండేషన్‌కు 15 వేల రూపాయలు విరాళంగా ఇచ్చింది. ఆ డబ్బు ఆమెకు ఐదు నెలల పెన్షన్ అని సోనూసూద్ పేర్కొన్నారు. నా వరకు ఆమె భారతదేశంలోని అత్యంత ధనవంతురాలు. ఒకరి బాధను చూడటానికి మనకి కంటి చూపు అవసరం లేదని ఆమె సందేశం ఇచ్చింది. ఆమె నిజమైన హీరో అని సోనూ పేర్కొన్నాడు. ( చదవండి: రూ. 11 కోట్లకు చేరువలో ‘విరుష్క’ విరాళాల సేకరణ ) Boddu Naga Lakshmi A Blind girl and a youtuber. From a small village Varikuntapadu in andra Pradesh Donated 15000 Rs to @SoodFoundation & that's her pension for 5 months. For me she's the RICHEST Indian. You don't need eyesight to see someone's pain. A True Hero🇮🇳 pic.twitter.com/hJwxboBec6 — sonu sood (@SonuSood) May 13, 2021 -
ఈ అల్లుడు బెదుర్స్!
చిత్రం: ‘అల్లుడు అదుర్స్’; తారాగణం: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నభా నటేశ్, ప్రకాశ్ రాజ్, సోనూసూద్, అనూ ఇమ్మాన్యుయేల్; సంగీతం: దేవిశ్రీ ప్రసాద్; కెమేరా: ఛోటా కె. నాయుడు; ఫైట్స్: రామ్ – లక్ష్మణ్, స్టన్ శివ; ఎడిటింగ్: తమ్మిరాజు; నిర్మాత: గొర్రెల సుబ్రహ్మణ్యం; దర్శకత్వం: సంతోష్ శ్రీనివాస్; రిలీజ్: జనవరి 14 అల్లుడు పాత్ర తెలుగు సినిమాకు మంచి కమర్షియల్ ఎలిమెంట్. సంక్రాంతికి అత్తారింటికి కొత్త అల్లుళ్ళు వచ్చినట్టే... ఈ సినీ సంక్రాంతికి థియేటర్లకు వచ్చిన చిత్రం ‘అల్లుడు అదుర్స్’. కానీ, అన్నిసార్లూ అల్లుడి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా? విలన్ మామ గారిని ఒప్పించి, హీరోయిన్‌తో ప్రేమ పెళ్ళి చేసుకున్న హీరో కథలు కొన్ని వందల సినిమాల్లో చూశాం. మరోసారి ఆ ఫార్ములాను వాడి, తీసిన సినిమా ఇది. కథేమిటంటే..: ఫ్యాక్షనిస్ట్ తరహా లీడర్ – నిజామాబాద్ జైపాల్ రెడ్డి (ప్రకాశ్ రాజ్). అతనికి ఇద్దరు కూతుళ్ళు. పెద్దమ్మాయి వసుంధర (అనూ ఇమ్మాన్యుయేల్). చిన్నప్పటి స్కూల్ ఫ్రెండ్ అయిన ఆ అమ్మాయంటే శీను (బెల్లంకొండ సాయి శ్రీనివాస్)కు ఇష్టం. కానీ, ఆమె రియల్ ఎస్టేట్ గజ (సోనూసూద్)ను ప్రేమిస్తుంది. ఇది ఇలా ఉండగా, తెలియకుండానే వసుంధర చెల్లెలు కౌముది (నభా నటేశ్)తో లవ్ ఎట్ ఫస్ట్ సైట్లో పడతాడు హీరో. ఆ పెళ్ళి వద్దనే ఆడపిల్ల తండ్రిని మన హీరో ఎలా మెప్పించి, ఒప్పించాడన్నది కథ. సోనూసూద్‌కూ, ప్రకాశ్ రాజ్‌కూ మధ్య సినిమా కథలో సంబంధం ఏమిటి? సోనూసూద్ విఫల ప్రేమకథ ఎలా చివరకు సక్సెసైంది అన్నది ఓపిగ్గా చూడాల్సిన మెయిన్ కథలోని కీలక ఉపకథ. ఎలా చేశారంటే..: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఎప్పటిలానే డ్యాన్సులు, ఫైట్లు బాగా చేశారు. హిందీ డబ్బింగ్, శాటిలైట్ మార్కెట్ ఉన్నందు వల్లనో ఏమో – ఒకటి రెండు హిందీ డైలాగులూ చెప్పారు. హీరోయిజాన్ని ఎలివేట్ చేసేలా ‘‘శీనుగాడు నా ఫ్రెండు. యాక్షన్ సీన్లలో వీడిది సెపరేట్ ట్రెండు’’ (హీరో గురించి వెన్నెల కిశోర్) లాంటి మాస్ డైలాగులూ పెట్టారు. ఫైట్స్‌తో పాటు కామెడీ పండించేందుకు హీరో తెగ ప్రయత్నించారు. నభా నటేశ్ ఓకే అనిపిస్తారు. అనూ ఇమ్మాన్యుయేల్‌ది నిడివి పరంగా చిన్న పాత్రే. ప్రకాశ్ రాజ్, సోనూసూద్ తదితరులు – ఈ పాత్రల్లో ప్రత్యేకించి చేయడానికీ, నిరూపించుకోవడానికీ ఇవాళ కొత్తగా ఏమీ లేదు. హీరో తల్లి పాత్రలో ఒకప్పటి హీరోయిన్ ఇంద్రజ, హీరో ఇంట పనిమనిషి రత్తాలుగా హరితేజ లాంటి వాళ్ళూ ఉన్నారు. ఎలా తీశారంటే..: సినిమాటోగ్రఫీ నుంచి దర్శకత్వం వైపు వచ్చిన సంతోష్ శ్రీనివాస్‌కు దర్శకుడిగా ఇది నాలుగో సినిమా. తొలి చిత్రం ‘కందిరీగ’ విజయంతోనే ఇప్పటికీ అందరికీ గుర్తుండే ఆయన... ఆ సక్సెస్ ఫార్ములాను ఇవాళ్టికీ వదులుకోలేకపోవడం అర్థం చేసుకోదగినదే. అందుకే, ఆ ఫార్ములానే వీలైనంత తిరగేసి, మరగేసి, బోర్లేసి... ‘అల్లుడు అదుర్స్’గా మరోసారి వండి వడ్డించారు. దానికి లారెన్స్ ‘కాంచన’ సినిమాతో పాపులరైన హార్రర్ కామెడీని కలిపారు. కానీ, ఎంత సక్సెస్ఫుల్ సూత్రమైనా, పదే పదే వాడితే చీకాకే. అది ఈ సినిమాకున్న పెద్ద ఇబ్బంది. దానికి తోడు ప్రేమకథను సాఫీగా కాకుండా, పలు పాత్రలు, సంఘటనల మధ్య అటూ ఇటూ తిప్పి, తిప్పి చెప్పే కథనం సహనానికి పరీక్ష పెడుతుంది. సెకండాఫ్‌లో వచ్చే హార్రర్ కామెడీ, ప్రకాశ్ రాజ్ – సత్యల ఊహా ప్రపంచం సీన్లు మాత్రం హాలులో అడపాదడపా బాగానే నవ్వులు పూయిస్తాయి. నిర్మాణ విలువలు బాగున్న ఈ సినిమాలో ఛోటా కె. నాయుడు కెమెరా వర్క్, దేవిశ్రీ ప్రసాద్ నేపథ్య సంగీతం ప్రత్యేకించి స్పష్టంగా తెలుస్తాయి. సినిమాకు కొంత బలంగా నిలుస్తాయి. తెర నిండా సుపరిచితులైన నటీనటులు కనిపిస్తారు. వినోదం కోసం సత్య, శ్రీనివాసరెడ్డి, సప్తగిరి, చమ్మక్ చంద్ర – ఇలా చాలామందే వస్తూ పోతూ ఉంటారు. ఇటీవల కరోనా కాలంలో మరణించిన నటులు జయప్రకాశ్ రెడ్డి, కమెడియన్ వేణుగోపాల్ కోసూరి లాంటి వాళ్ళూ తెరపై తమ చివరి సినిమాల్లో ఒకటిగా ఇందులో ఎదురవుతారు. ‘బిగ్ బాస్4’ ఫేమ్ మోనాల్ గజ్జర్ చేసిన ఐటమ్ సాంగ్ ‘రంభ ఊర్వశి మేనక అందరు కలిసి నేనిక...’ లాంటివి మాస్‌ను ఆకర్షిస్తాయి. కాశ్మీర్‌లోని పహల్ గావ్ ప్రాంతాల్లో ఇటీవలే ఈ జనవరి చలిలో తీసిన హీరో, హీరోయిన్ల డ్యుయట్... మంచు కురిసే దృశ్యాలు విజువల్‌గా బాగున్నాయి. ఏ విదేశాల్లోనో తీసిన ఫీలింగ్ కలిగిస్తాయి. అయితే, అన్నీ ఉన్నా... అల్లుడి... అదేదో అన్నట్టు స్క్రిప్టులోని బలహీనతలు ఈ సినిమాకు శాపం. కామెడీ చేస్తున్నాం అనుకొని దర్శక, రచయితలు కథన విధానంలో లేనిపోని కన్ఫ్యూజన్లు పెట్టుకున్నారు. ఎంత సక్సెస్ఫుల్ ఫార్ములా వాడుకున్నా, దాన్ని ఆకట్టుకొనేలా చెప్పడానికి ప్రయత్నించకపోవడంలో పొరపాటు జరిగిందనిపిస్తుంది. ఇది ‘కందిరీగ’కు మరో రీమేక్ అనే కామెంట్‌నూ భరించాల్సి వస్తుంది. వెరసి, రెండున్నర గంటల సాగదీతను భరించాలంటే... జనం బెదుర్స్ అనాలనిపిస్తుంది. కొసమెరుపు: ‘కందిరీగ’ ఫార్ములా + ‘కాంచన’ హార్రర్ కామెడీ = ‘అల్లుడు అదుర్స్’ బలాలు: ∙హీరో చేసిన డ్యాన్సులు, ఫైట్లు ∙తెర నిండా నటీనటులు, నిర్మాణ విలువలు ∙నేపథ్య సంగీతం, కెమెరా వర్కు బలహీనతలు: ∙చాలా ప్రిడిక్టబుల్ ఫార్ములా ∙పాత సినిమాలే చూస్తున్న ఫీలింగిచ్చే స్క్రిప్టు ∙సహనాన్ని పరీక్షించే సా....గ దీత కథనం ∙దర్శకత్వ లోపం ∙కన్ఫ్యూజింగ్... కామెడీ -రివ్యూ: రెంటాల జయదేవ -
ఈ తరానికి మహాభారతం చెప్పడం కోసమే కురుక్షేత్రం
‘‘మా ‘కురుక్షేత్రం’ చిత్రాన్ని కొందరు ‘దానవీరశూరకర్ణ’ చిత్రంతో పోలుస్తున్నారు. ఆ సినిమా ఒకేసారి పుట్టింది. ఇక రాదు. కానీ ‘బాహుబలి’ లాంటి సినిమాలు చేయొచ్చు’’ అన్నారు నిర్మాత మునిరత్న. మహాభారతాన్ని తొలిసారి ఇండియన్ స్క్రీన్ మీద త్రీడీలో ‘కురుక్షేత్రం’ పేరుతో తెరకెక్కించారు. ఇందులో దుర్యోధనుడిగా కన్నడ హీరో దర్శన్, కర్ణుడిగా అర్జున్, అర్జునుడిగా సోనూ సూద్, అభిమన్యుడిగా నిఖిల్ గౌడ, భీష్ముడిగా అంబరీష్ నటించారు. రాక్‌లైన్ వెంకటేశ్ సమర్పణలో కథను అందించడంతో పాటు మునిరత్న ఈ చిత్రాన్ని నిర్మించారు. నాగన్న దర్శకుడు. ఐదు భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రం తెలుగు ట్రైలర్ రిలీజ్ వేడుకలో నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ – ‘‘భారతాన్ని త్రీడీలో తీయాలనుకున్నాను. ఈ సినిమా రావడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ‘‘ప్రస్తుత తరానికి మహాభారతాన్ని తెలియజేయడానికి ఈ సినిమా చేశాం’’ అన్నారు మునిరత్న. ‘‘ఈ చిత్రాన్ని త్రీడీలో తెరకెక్కించినందుకు నిర్మాతలకు కృతజ్ఙతలు’’ అన్నారు ‘బన్నీ’ వాసు. ‘‘దేశంలో మొట్టమొదటి త్రీడీ మైథాలజీ సినిమా ఇది. ‘కురుక్షేత్రం’ పండగలా ఉంటుంది’’ అన్నారు నాగన్న. ‘‘1970–2019 వరకూ ఉన్న గొప్ప యాక్టర్స్ అందరూ ఈ సినిమాలో ఉన్నారు. ఈ చిత్రం తప్పకుండా భారతంలోని పాత్రలన్నీ పరిచయం చేస్తుంది’’ అన్నారు దర్శన్. ‘‘చారిత్రాత్మక చిత్రంలో నటించడం హ్యాపీగా ఉంది’’ అన్నారు అర్జున్. ‘‘ఇలాంటి సినిమాకు సమర్పకుడిగా ఉండటం సంతోషం. తెలుగులో రిలీజ్ చేయడానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు’’ అన్నారు రాక్‌లైన్ వెంకటేశ్. ‘‘ఈ సినిమాలో మాటలు, పాట లు రాసే అవకాశం కల్పించిన దర్శక–నిర్మాతలకు కృతజ్ఞతలు’’ అన్నారు వెన్నెలకంటి. ‘‘నటుడిగా ఈ సినిమా ఓ మంచి అనుభూతి’’ అన్నారు సోనూ సూద్. -
సీత వస్తున్నారు
పురాణాల్లో సీత కథ అందరికీ తెలుసు. మరి ఈ సీత కథ ఏంటి? తెలియాలంటే మా ‘సీత’ విడుదల వరకూ ఆగాల్సిందే అంటున్నారు ‘సీత’ చిత్రబృందం. బెల్లంకొండ సాయిశ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సీత’. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మించిన ఈ సినిమాను ఈనెల 24న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ‘‘కవచం’ తర్వాత సాయిశ్రీనివాస్, కాజల్ జంటగా నటించిన చిత్రమిది. సాయి శ్రీనివాస్ సరికొత్త పాత్రలో కనిపిస్తారు. ఈ సినిమాలో సోనూసూద్ నెగటివ్ రోల్ పోషించారు. పాయల్ రాజ్‌పుత్ స్పెషల్ సాంగ్ చేశారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికపాటి, సహ నిర్మాతలు: అజయ్ సుంకర, అభిషేక్ అగర్వాల్. -
జాకీ పంపిన జాకెట్
బహుమతులు ఎవరికైనా ప్రత్యేకమే. అసలు కానుకలు ఇష్టపడని వారెవరుంటారు చెప్పండి. ఇప్పుడు బాలీవుడ్ నటుడు సోనూ సూద్‌కి కూడా ఒక స్పెషల్ గిఫ్ట్ వచ్చింది. దాంతో చెప్పలేనంత సంతోషంలో మునిగి తేలుతున్నాడు. ఏంటా గిఫ్ట్? ఎవరు పంపిందంటే.. స్పెషల్ లిమిటెడ్ ఎడిషన్ జాకెట్. ఇంటర్నేషనల్ యాక్షన్ హీరో జాకీ చాన్ పంపించారు. వీళ్లిద్దరికీ స్నేహం ఎలా కుదిరిందబ్బా? అంటే గతేడాది వచ్చిన ‘కుంగ్‌ఫూ యోగా’ సినిమాలో వీళ్లిద్దరూ కలిసి యాక్ట్ చేశారు. అప్పటి నుంచి వీళ్ల ఇండో– చైనీస్ మైత్రీ కుదిరింది. గిఫ్ట్‌తో పాటు సోనూసూద్‌కు ఒక లెటర్ కుడా రాశారు జాకీ చాన్. ఆ లేఖ సారాంశం ఏంటంటే... ‘‘మై డియర్ సోనూ..., ఈ జాకెట్ ‘జేసి స్టంట్ టీమ్’ 40వ వార్షికోత్సవం సందర్భంగా తయారు చేసిన స్పెషల్ ఎడిషన్ లిమిటెడ్ జాకెట్. ఈ జాకెట్ కోసం వాడిన లెదర్‌ని స్వయంగా సెలెక్ట్ చేసి, బెస్ట్ తయారీదారుడి దగ్గర నా అభిరుచికి తగ్గటు డిజైన్ చేయించాను. ఈ జాకెట్‌ని నువ్వు తీక్షణంగా పరిశీలిస్తే అందులో కనిపించే ప్రతీ డీటైల్లోనూ, డిజైనింగ్‌లోనూ నేనే స్వయంగా కనిపిస్తాను. ఈ జాకెట్ వెల ఎంతో చెప్పలేను కానీ విలువ మాత్రం నిజాయితీగా చెప్పాలంటే అందులో నా ఆలో^è నలు ప్రతిబింబిస్తాయి. నాతో పాటు నా జర్నీలో కష్ట సుఖాల్లో నడిచిన నా సోదరులకు మాత్రమే కాకుండా నీలాంటి ఆప్తులకు ఇవ్వాలనుకున్నాను. ఈ చిరు కానుక నీకు చలికాలంలో వెచ్చదనాన్ని ఇస్తుందని ఆశిస్తున్నాను. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే దాన్ని చూసినప్పుడల్లా నా గురించి ఆలోచిస్తావు, దాన్ని ధరించినప్పుడల్లా నన్ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నట్టు ఉంటుంది’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. ∙సోనూకి జాకీ పంపించిన జాకెట్ -
'శాంటాను కలిసినంత ఆనందంగా ఉంది'
తెలుగు సినిమాతో వెండితెర మీదకు అడుగుపెట్టిన దిశాపటానీ.. ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉందట. మెగా వారసుడు వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన లోఫర్ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది దిశా. ఆ సినిమా ఆశించిన స్ధాయిలో విజయం సాధించకపోవటంతో ఈ అమ్మడికి పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే అనుకోకుండా వచ్చిన హాలీవుడ్ ఆఫర్ మాత్రం ఈ లాంగ్ లెగ్స్ బ్యూటీని ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంది. జాకీచాన్ హీరోగా తెరకెక్కుతున్న 'కుంగ్‌ఫూ యోగా' సినిమాలో దిశపటానీ ఓ ఆసక్తికరమైన పాత్రలో నటిస్తోంది. మరో భారతీయ నటుడు సోనుసూద్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే సోనూ, జాకీ చాన్ తన మీద అమితమైన ప్రేమ చూపిస్తున్నారని పేర్కొన్న దిశా.. ఇప్పుడు జాకీని ఏకంగా శాంటాతో పోల్చింది. తనను షూటింగ్ సమయంలో ఎంతో ప్రేమగా చూసుకుంటున్న జాకీచాన్‌ను పొగడటానికి శాంటా అనే పదం చాలదంటూ కామెంట్ చేసింది. 'నా గురించి ఎంతో కేర్ తీసుకుంటున్న స్వచ్ఛమైన మనిషికి కృతజ్ఞతలు. నువ్వు ఎంతో మందికి ఎప్పటికీ స్ఫూర్తిగా ఉంటావు. చాలా మందికి నువ్వు జాకీచాన్ గానే తెలుసు, కానీ నువ్వు ఎంత గొప్పవాడివో ప్రపంచం త్వరలోనే తెలుసుకుంటుంది. ఎంతో గొప్పగా ప్రేమించే వ్యక్తితో పనిచేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే శాంటా నన్ను కలిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో అంత కన్నా ఎక్కువ. నీ గురించి చెప్పడానికి శాంటా అన్న పదం చాలదు'. అంటూ జాకీచాన్‌ను ఆకాశానికి ఎత్తేసింది దిశాపటాని. Thank you to the most pure soul on this planet for taking so much care of me !! You are and you… https://t.co/wnH9yTQTWo — disha patani (@DishPatani) March 7, 2016