చెన్నై: గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ తెలిపారు. ఈ మేరకు బాలు ఆరోగ్య పరిస్థితిపై చరణ్ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో విడుదల చేశారు. ‘నిన్నటి లాగే నాన్న ఆరోగ్యం మెరుగవుతోంది. అనారోగ్యం నుంచి కోలుకుంటున్నారు. చికిత్సకు నాన్న స్పందిస్తున్నారు. వైద్య నిపుణుల బృందం ఆయన్న పరిశీలిస్తోంది. అయితే నాన్న కోలుకునేందుకు కొంత సమయం పట్టవచ్చు. మీ అందరి దీవెనలు, ప్రార్థనలు ఫలిస్తున్నాయి’ అంటూ ఎస్పీ చరణ్ పేర్కొన్నారు. బాలసుబ్రహ్మణ్యం ఈనెల 5న కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా చెన్నై చూలైమేడులోని ఎంజీఎం ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. (బాలు సార్ త్వరగా కోలుకోవాలి: రజనీకాంత్)
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం ఒక్కసారిగా విషమించడంతో సినీ ప్రముఖులతో పాటు అభిమానులు ఆందోళనకు గురయ్యారు. బాలు బాగుండాలని.. బయటికి వచ్చి మళ్లీ పాటలు పాడాలంటూ చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు. ఇళయరాజా కూడా బాలు నువ్వు త్వరగా రా అంటూ వీడియో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే కమల్ హాసన్, చిరంజీవి, ఏఆర్ రహామాన్ సహా పలువురు ప్రముఖులు ఆయన పూర్తి ఆరోగ్యంతో తిరిగి కోలుకోవాలని ప్రార్ధిస్తున్నారు. బాలసుబ్రహ్మణ్యం పూర్తి ఆరోగ్యంతో తిరిగి కోలుకోవాలని సూపర్ స్టార్ రజినీకాంత్ వీడియో సందేశం ఇచ్చారు. (ఎస్పీ బాలు కోసం మేమంతా: సెలబ్రిటీలు)
Comments
Please login to add a commentAdd a comment