హీరోలు ఎలాంటి పాత్ర చేయాలన్నా కుదురుతుంది. యాక్షన్, ఫ్యాక్షన్, కామెడీ, ట్రాజడీ. కానీ పౌరాణిక పాత్ర చేయాలంటే మాత్రం కలసి రావాలి. కథ కుదరాలి. బడ్జెట్ కుదరాలి. ఫిజిక్ కుదరాలి. ప్రస్తుతం కొందరు హీరోలకు అవన్నీ కుదిరాయి. పౌరాణిక సినిమాలతో సిద్ధమవుతున్నారు. పురాణ పురుషులుగా మారబోతున్నారు. ఆ పురుషుల వివరాలు.
ఆది పురుష్
ప్రభాస్ హీరోగా తెరకెక్కనున్న ప్యాన్ ఇండియా చిత్రం ‘ఆది పురుష్’. ఓం రౌత్ దర్శకుడు. ఈ సినిమాలో ప్రభాస్ శ్రీ రాముడి పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా కోసం విలు విద్య నేర్చుకుంటున్నారు ప్రభాస్. అలానే తన శరీరాకృతిని కూడా మార్చేస్తున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా చిత్రీకరణ మొదలవుతుంది.
హిరణ్య కశ్యప
గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న పౌరాణిక చిత్రం ‘హిరణ్య కశ్యప’. సుమారు 200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాలో రానా టైటిల్ రోల్ పోషించనున్నారు. సురేశ్ ప్రొడక్షన్స్ నిర్మించనుంది. ఏడాదిన్నరగా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు చేస్తున్నారు గుణశేఖర్. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం అవుతుంది.
మహావీర్ కర్ణణ్
విక్రమ్ హీరోగా తమిళ–హిందీ భాషల్లో ‘మహావీర్ కర్ణణ్’ అనే ప్రాజెక్ట్‌ను గత ఏడాది ప్రకటించారు. ఈ సినిమాలో కర్ణుడి పాత్రలో విక్రమ్ నటించనున్నారు. ఆర్.ఎస్ విమల్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించనున్నారు.
రండామూళం...
మహాభారతాన్ని తెరకెక్కించే ప్లాన్‌లో ఉన్నారు మలయాళ దర్శకుడు వాసుదేవ్ నాయర్. భీముడి పాత్ర కోణం నుంచి భారతాన్ని చెప్పబోతున్నట్టు ‘రండామూళం’ అనే చిత్రాన్ని ప్రకటించారు. ఇందులో భీముడి పాత్రలో మోహన్‌లాల్ నటించనున్నారు. వెయ్యి కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించే ప్లాన్‌లో ఉన్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని టాక్.
అల్లు అరవింద్ నిర్మాణంలో బాలీవుడ్‌లో రామాయణం నేపథ్యంలో ఓ సినిమా రూపొందనుంది. మూడు భాగాలుగా తెరకెక్కనున్న ఈ సినిమా 1500 కోట్లతో తెరకెక్కనుంది. నితేష్ తివారీ, రవి ఉడయార్ ఈ చిత్రాలను డైరెక్ట్ చేయనున్నారు. నటీనటులను ఇంకా ప్రకటించలేదు. అలానే మహాభారతాన్ని సినిమాగా తీయాలనుందని ఆమీర్ ఖాన్ చాలాసార్లు ప్రకటించారు. అందులో ఆయన శ్రీకృష్ణుడి పాత్ర చేయాలనుకుంటున్నారని టాక్.
Comments
Please login to add a commentAdd a comment