ఓటీటీ...ఇది చూడొచ్చు
ఓటీటీలో ఇది చూడొచ్చు అనేప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో మలయాళ చిత్రం వాళ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.
‘వాళ’ తప్పనిసరిగా తమ పిల్లలతో కలిసి తల్లిదండ్రులు చూడవలసిన సినిమా. మనిషి జీవితంలో యవ్వన దశకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. పిల్లలకు మాత్రం బళ్లో, ఊళ్లో సరదాగా స్నేహితులతో గడిచిపోయే స్థితి అది. కానీ తల్లిదండ్రులకు మాత్రం తమ పిల్లల యవ్వన దశ అనేది కత్తి మీద సాములాంటిదే.
పిల్లల భవిష్యత్తు పై ఆశతో అతి గారాబంగా తమ పిల్లలను చూసుకునేవారు కొందరైతే, తమ పిల్లలు దేనికీ పనికి రారని మరికొందరు వారి యవ్వన దశను వారికి అనుగుణంగా అనుభవించనీయకుండా చేస్తుంటారు. సరిగ్గా అలాంటి వారికే ఈ ‘వాళ’ సినిమా. ‘బయోపిక్ ఆఫ్ బిలియన్ బాయ్స్’ అన్నది దీని ట్యాగ్ లైన్. ఈ ట్యాగ్ లైన్ సినిమాకి సరిగ్గా సరిపోవడమే కాదు, నిజ జీవితంలో యవ్వన దశ దాటిన ప్రతి ఒక్కరికీ రిలేట్ అవుతుంది.
ఈ సినిమాకి దర్శకుడు ఆనంద్ మీనన్. ప్రముఖ నటుడు బసిల్ జోసెఫ్ ఓ ప్రధాన పాత్రలో నటించారు. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే... తమ కెరీర్ పరంగా ఓడిపోయిన నలుగురు స్నేహితుల కథ ఇది. ఈ నలుగురూ తమ స్కూల్ నుండి కాలేజ్ వరకు చేసే ప్రయాణం చూసే ప్రతి ప్రేక్షకుడి యవ్వనాన్ని తప్పకుండా గుర్తు చేస్తుంది. ఈ నలుగురూ స్కూల్, కాలేజ్ అన్నింటిలోనూ ఫెయిలవుతారు.
కానీ ఆ ఫెయిలైన వాళ్లు తమ తల్లిదండ్రులకు మాత్రం సినిమా ఆఖర్లో చక్కటి సందేశమిస్తూ అదే తల్లిదండ్రుల దృష్టిలో పాస్ అవుతారు. అసలు ఈ పిల్లలు ఎందుకు ఫెయిల్ అవుతారు, పరీక్షలో కాకుండా తల్లిదండ్రుల విషయంలో ఎలా పాస్ అవుతారన్నది మాత్రం ఈ సినిమాలోనే చూడాలి. తామొకటి తలిస్తే దైవమొకటి తలచినట్లు తమ పిల్లలు వాళ్ల కెరీర్‌ని ఎలా ఎంచుకుంటారు అన్నది వాళ్లకే వదిలేయాలి కానీ తమ ఆలోచనలను వాళ్ల మీద రుద్దకూడదన్న అంశం మీద తీసిన ఈ సినిమా నిజంగా అభినందనీయం. తీసుకున్న పాయింట్ సీరియస్‌దే అయినా సినిమా మొత్తాన్ని చక్కటి స్క్రీన్‌ప్లేతో మంచి కామెడీని మేళవించి కుటుంబమంతా కలిసి చూసే విధంగా రూపొందించారు దర్శకుడు. మనం వినోదం కోసం ఎన్నో సినిమాలు చూస్తాం. కానీ కొన్ని సినిమాలు మనకు మార్గదర్శకమవుతాయి. అటువంటి సినిమానే ఈ ‘వాళ... బయోపిక్ ఆఫ్ బిలియన్ బాయ్స్’... మస్ట్ వాచ్.
– ఇంటూరు హరికృష్ణ
Comments
Please login to add a commentAdd a comment