‘‘నా కెరీర్‌లో ఎప్పుడూ ద్విపాత్రాభినయం చేయలేదు. అలాంటిది ‘శ్వాగ్’ సినిమాలో నాలుగు పాత్రలు చేశాను. అందరూ ఒకే పోలికతో ఉండే ఒకే వంశస్తులే. నాలుగు పాత్రలు ఉన్నప్పడు ఎలా చేయాలనేది సవాల్‌గా అనిపించింది. ఒక్కసారి గెటప్స్ అన్నీ సెట్ అయ్యాక చాలా బాగా కుదిరింది’’ అని హీరో శ్రీవిష్ణు అన్నారు. హసిత్ గోలి దర్శకత్వంలో శ్రీవిష్ణు, రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘శ్వాగ్’. మీరా జాస్మిన్, దక్ష నగార్కర్ ఇతర కీలక పాత్రలు పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీవిష్ణు పంచుకున్న విశేషాలు.
⇒ ‘శ్వాగ్’ ఒక వంశానికి సంబంధించిన కథ. మాతృ, పితృస్వామ్యం అనే క్లాష్ నుంచి 1500 సంవత్సరంలో మొదలయ్యే కథ. పురుషులు గొప్పా? మహిళలు గొప్పా? అనే అంశంపై వినోదాత్మకంగా ఈ కథ సాగుతుంది. శ్వాగ్ అంటే శ్వాగనిక వంశానికి సుస్వాగతం. అంత పెద్ద టైటిల్‌ని పలకడానికి ఇబ్బందిగా ఉంటుందని ‘శ్వాగ్’ అని పెట్టాం. కొత్త తరహా కథల్ని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తుంటారు. అదే ధైర్యంతో సరికొత్త కథాంశంతో మా సినిమా చేశాం. ఈ మూవీలో నా పాత్రకి మేకప్ వేసుకోవడానికి రోజుకి నాలుగున్నర గంటలు పట్టేది... తీయడానికి రెండు గంటలు పట్టేది.. ఇదంతా చాలా కష్టంగా అనిపించింది.
⇒ కుటుంబమంతా కలిసి చూడదగ్గ సినిమా ఇది. పెద్దవాళ్లకి ఈ చిత్రం విపరీతంగా నచ్చుతుంది. అలాగే యువ ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఉన్నాయి. నేటి యువత తెలుసుకోవాల్సిన చాలా విషయాల్ని చూపించాం. మన వంశంతో పాటు పెద్దల గురించి, తాతల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి? అనేది హసిత్ చాలా చక్కగా తెరకెక్కించాడు. చాలా పెద్ద కథ ఇది. రెండున్నర గంటల్లో ఇంత పెద్ద కథ చెప్పారా? అని సినిమా చూసిన తర్వాత డైరెక్టర్‌ని ప్రేక్షకులు అభినందిస్తారు. కథలో బాగంగానే వినోదం ఉంటుంది. నా కెరీర్‌లో పెద్ద హిట్‌గా నిలిచే చిత్రాల్లో ‘శ్వాగ్’ ఒకటిగా నిలుస్తుందనే నమ్మకం ఉంది.
⇒పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్‌గారు నన్ను, హసిత్‌ని నమ్మి తొలిసారి ‘రాజ రాజ చోర’ సినిమా అవకాశం ఇచ్చి, చాలా ్రపోత్సహించారు. ఇప్పుడు ‘శ్వాగ్’ చేసే అవకాశం కల్పించారు. ఈ సినిమా పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి మంచి సక్సెస్ ఇస్తుంది. ఈ సినిమా చూశాక మహిళలను ఒక మెట్టు ఎక్కువ అభిమానం, గౌరవంతో చూస్తాం. ఈ సినిమా చూస్తున్నంత సేపు నటీనటులు కాకుండా పాత్రలే గుర్తుంటాయి. ప్రస్తుతం ఓ థ్రిల్లర్ మూవీ చేస్తున్నా. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో ఓ వినోదాత్మక చిత్రం చేస్తున్నాను.
Comments
Please login to add a commentAdd a comment