‘‘డైరెక్టర్ కావాలని నా చిన్నప్పటి నుంచే కోరుకున్నాను. ఇందు కోసం చిన్న వయసులోనే చెన్నై వెళ్లాను. ఇండస్ట్రీలో నిలబడాలనే తపన, సినిమా క్రాఫ్ట్స్‌పై ఆసక్తి ఉండేవి. కానీ, ఓ దర్శకుడిగా ఇండస్ట్రీలో పాతిక సంవత్సరాలు ఉంటానని నిజంగా ఆ రోజు ఊహించలేదు. నా కెరీర్‌లో ఇలా ఊహించని ఎన్నో అద్భుతాలు జరిగాయి. నా ప్రయాణం పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. ఈ ప్రయాణంలో భాగమైన హీరోలు, నిర్మాతలు, టెక్నీషియన్స్, నా కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు’’ అని దర్శకుడు శ్రీనువైట్ల అన్నారు. రవితేజ, మహేశ్వరి జంటగా శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన చిత్రం ‘నీ కోసం (1999)’. గంటా శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రంతో శ్రీనువైట్ల దర్శకుడిగా పరిచయమయ్యారు.
ఈ సినిమా విడుదలై నేటితో 25 ఏళ్లు పూర్తవుతాయి. అలాగే ఇండస్ట్రీలో పాతిక సంవత్సరాల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు శ్రీనువైట్ల. ఈ సందర్భంగా సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ–‘‘నీ కోసం’ కి ముందు మరో సినిమా చేయాల్సింది. కానీ, ఆ సినిమా ఆగిపోవడంతో నిరుత్సాహంగా అనిపించింది. ఆ తర్వాత తక్కువ బడ్జెట్‌లో ఓ సినిమా చేయాలనుకుని ‘నీ కోసం’ కథ రాసుకుని, సినిమా స్టార్ట్ చేశాం. కానీ, ఈ సినిమా కూడా మధ్యలోనే ఆగిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే రవితేజగారి సహాయంతో పూర్తి చేశాం. ఫస్ట్ కాపీ చూసి నాగార్జునగారు నన్ను మెచ్చుకుని, డైరెక్షన్ చాన్స్ ఇవ్వడం ఎప్పటికీ మర్చిపోలేను.
అలాగే ‘నీ కోసం’ రిలీజ్‌కు రామోజీరావుగారు అండగా నిలబడ్డారు. అలాగే ఆయన బ్యానర్‌లోనే ‘ఆనందం’ సినిమా అవకాశం ఇచ్చారు. ‘నీ కోసం’ సినిమాకి ఏడు నంది అవార్డు వచ్చాయి. ఇక ‘ఆనందం, వెంకీ, రెడీ, దూకుడు, ఢీ’ సినిమాలు నా కెరీర్‌లోని టాఫ్ ఫైవ్ మూవీస్‌గా చెప్పుకుంటాను. ‘దూకుడు’ సినిమాను తమిళంలో అజిత్‌గారితో రీమేక్ చేసే అవకాశం వచ్చింది. కానీ, అప్పటికే నేను ‘బాద్‌షా’కు కమిటై ఉండటంతో కుదర్లేదు. ‘బాద్‌షా’ హిట్ అయింది.
సో.. అజిత్‌గారితో నేను ఆ సినిమా చేయలేదనే బాధ లేదు. మహేశ్‌బాబుగారితో నేను చేసిన ‘ఆగడు’ సినిమా ఎన్నో అంచనాల మధ్య విడుదలై, ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ విషయంలో కాస్త బాధగా అనిపించింది. అయితే ఆ సినిమా తర్వాత మహేశ్‌గారు నాకు మంచి మోరల్ సపోర్ట్ ఇచ్చారు.. ఆ విషయాన్ని మర్చిపోలేను. ‘వెంకీ’ సినిమాకు సీక్వెల్ తీయాలనే ఆలోచన ఉంది. ఇటీవల నా దర్శకత్వంలో వచ్చిన ‘విశ్వం’ సినిమా హిట్‌గా నిలిచినందుకు సంతోషంగా ఉంది. నా తర్వాతి సినిమాని త్వరలోనే చెబుతాను’’ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment